23నుంచి అనంతపురంలో షర్మిల పాదయాత్ర
20 Oct, 2012 13:53 IST
అనంతపురం :
మరో ప్రజాప్రస్థానం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందడుగు వేస్తున్న మహానేత తనయ షర్మిల ఈనెల 23న అనంతపురం జిల్లాలో ప్రవేశించనున్నారు. అనంతపురం జిల్లాలో ఆమె పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పులివెందుల నియోజకవర్గంలో యాత్ర పూర్తి అనంతరం దాడితోట వద్ద ఆమె అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తారు. జిల్లాలో 14 రోజుల పాటు యాత్ర సాగుతుంది. ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతారు. మొత్తం 75 గ్రామాల.. పట్టణాల మీదుగా షర్మిల పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. షర్మిల పాదయాత్ర కోసం అనంత జనం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారనీ.. కనీవినీఎరుగని రీతిలో అనంతపురంలో పాదయాత్ర జరగనుందనీ వైఎస్‌ఆర్ సిపి నేత శంకర నారాయణ చెప్పారు.