అంబటి రాంబాబుతో ప‌లువురు నేత‌ల ములాఖ‌త్‌

13 Feb, 2026 15:09 IST


తూర్పుగోదావరి జిల్లా:  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబును మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు జడ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గాని భరత్ ములాఖత్‌లో కలిశారు. అనంతరం తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వక్రీకరించి అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గృహ దహనాలు, లాఠీచార్జీలు, లూటీలు జరుగుతున్నాయని, దీనికి అసలు కారణం ఏమిటో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలవుతోందని విమర్శించారు.

ప్రజలు న్యాయం చేస్తారని నమ్మి చంద్ర‌బాబుకు అధికారాన్ని ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని తమ్మినేని సీతారాం అన్నారు. అంబటి రాంబాబును ఏ కారణంతో అరెస్టు చేశారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేయడం, ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు జరగడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఏదైనా అనర్థం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కొనసాగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. జైలులో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర మనోవేదనలో ఉన్నారని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు జరపడం రాక్షసత్వమని విమర్శించారు. ఆరాచక విధానాలతో రాజ్యాన్ని నడపడం సరైంది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది విరుద్ధమని అన్నారు.

ఇలాంటి చర్యలను నిలిపివేసి పార్టీ క్యాడర్‌కు హితవు చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. నడి రోడ్డుపై అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసులకు భయపడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మానవత్వం లేదని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికే మానవత్వం లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. జైలులో అంబటి రాంబాబుకు తగిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని గుర్తించకుండా ప్రభుత్వం కళ్లుమూసుకుని వ్యవహరించడం సరికాదని తమ్మినేని సీతారాం హెచ్చరించారు.