రంజాన్ తోఫా పంపిణీ
వైయస్ఆర్ జిల్లా: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. గురువారం పోరుమామిళ్ల పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాదాపు 500 మందికి ముస్లిం నిరుపేదలకు రంజాన్ పండగకు కావలసిన నిత్యం వస్తువులు, బియ్యం తదితర సామాగ్రిని ఉచితంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజులపాటు ఎంతో నియమనిష్ఠలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులు అవుతారన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని ఆయన అన్నారు. ముస్లింలు అతిపవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు అనేక దైవకార్యాలు చేస్తారని, ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని, ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం అని ఆయన పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపు మాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.