పేదలందరికీ ఇళ్ల పట్టాలిస్తాం
విశాఖ: ఎంత మంది పేదలున్నా..అర్హతలను బట్టీఅందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నవరత్నాలు ..పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలోని ఆనందపురం మండలంలో నిర్వహించిన పట్టాభిషేకం కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆనందపురం మండలంలోని శిర్లపాలెం , దుక్కవాని పాలెం, ముకుంద పురం, బొని గ్రామాల్లో వైయస్సార్ జగనన్న కాలనీ లకు శంకుస్థాపన చేసి.. చెట్లు నాటారు. అలాగే ముకుంద పురం లో రూ.18 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరచిపోలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. పేదలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.