ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై కేసు నమోదు చేయాలి
తిరుపతి: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వైయస్ఆర్ విద్యార్థి విభాగం నేతల డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన ప్రేమ్ కుమార్, గిరిజన విద్యార్థి విభాగం అధ్యక్షుడు శివ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. రిజిస్ట్రార్ తన భార్యకు పదవి కట్టబెట్టారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ప్రశ్నించగా, ఆయన దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. అనంతరం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రేమ్ కుమార్, శివ నాయక్ ఫిర్యాదు చేశారు. విద్యార్థి సంఘాలు తమ డిమాండ్లపై అధికారులు స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.