‘జగన్ కోసం సిద్ధం’తో గడప గడపకూ ప్రచారం
తాడేపల్లి: తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకూ ప్రచారం నిర్వహించనున్నామని, ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ సీపీకి సంబంధించి 47 వేల బూత్ కమిటీల నిర్మాణం పూర్తయిందని, ప్రతి బూత్‌లోనూ 1 ప్లస్ 10 విధానంలో ఒకlప్రెసిడెంట్, 10 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. ‘జగన్ కోసం సిద్ధం’ ప్రచార కార్యక్రమం వినూత్నంగా, బహుశా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా.. వివిధ సామాజిక వర్గాలకు చెందిన 12 మంది నిరుపేదలను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశామని, వారి పేర్లను ఎన్నికల కమిషన్‌కు సమర్పించామన్నారు. బూత్ కమిటీ సభ్యులతో పాటు స్టార్ క్యాంపెయినర్లు జగన్ కోసం సిద్ధం ప్రచార కార్యక్రమంలో పాల్గొని సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఒక్కొక్కరు రెండు ఓట్లు (ఎమ్మెల్యే, ఎంపీ) వేయాలని అభ్యర్థిస్తారని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘జగన్ కోసం సిద్ధం’ ప్రచార కార్యక్రమ వివరాలు వెల్లడించారు.
సజ్జల ఇంకా ఏం మాట్లాడారంటే..
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు గడప గడపకూ కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది రెండుసార్లు ప్రతి గడపకూ వెళ్లి మేనిఫెస్టోలోని అమలు చేసిన అంశాలను వివరించారు. 2019లో అఖండ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు.. రాష్ట్రంలోని 87 శాతం పైగా పేదల ఇళ్లకు ఆర్థిక ప్రయోజనాలను కలిగించాయి. అలాగే నాన్ డీబీటీ కింద ఇళ్ల స్థలాలు, మిగిలిన పథకాలు అందాయి. ఇవన్నీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు గడప గడపకూ కార్యక్రమంలో వివరించారు.
గతంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం నడిపించాం. అప్పుడు కూడా చాలా మంది సీఎం వైయస్ జగన్‌కు అండగా ఉంటాం, ఆయనే మా నాయకుడు అంటూ చెబుతూ వచ్చారు. ఇంత పకడ్బందీగా ప్రజల్లో ఉంటూ, గడప గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఆ గ్రామాల్లోని ప్రజల విన్నవించిన సమస్యలు పరిష్కారం అయ్యాయి.
ఎన్నికల ప్రచారం ఫైనల్‌కు చేరింది. వైయస్‌ఆర్‌సీపీ 47 వేల బూత్ కమిటీల నిర్మాణం పూర్తయింది. ప్రతి బూత్‌లోనూ 1 ప్లస్ 10 కింద ప్రెసిడెంట్, 10 మంది సభ్యులు ఉంటారు. తుది దశ ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకూ బూత్ కమిటీ సభ్యులు ప్రచారం చేయనున్నారు. ‘జగన్ కోసం సిద్ధం’ పేరిట గడప గడపకూ ప్రచారం నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం, సిద్ధం సభలు జరిగాయి. ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు ప్రతి గడపకూ వెళ్లి వైయస్‌ఆర్ సీపీని గెలిపించాలని అభ్యర్థిస్తారు. ఒకటి అసెంబ్లీ, మరోకటి లోక్‌సభ అభ్యర్థికి సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలని ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. నేటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది.
ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు, 2019–24 మధ్య పూర్తిగా అమలు చేసి, వాటిని కంటిన్యూ చేస్తామని సీఎం వైయస్ జగన్ డిక్లేర్ చేశారో ముఖ్యమైన పాయింట్స్ ఒక పేపర్ స్టాండ్‌లో పొందుపరిచాం.. దీనిలో మరోవైపు క్యాలెండర్ ప్రచురించాం.
మేనిఫెస్టో అంటే ప్రకటించి, తరువాత దాన్ని గాల్లో కలిపేసే చంద్రబాబులా కాకుండా.. రికార్డెడ్‌గా ఉండేలా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వైయస్‌ఆర్ సీపీ, వైయస్ జగన్ వ్యవహరిస్తున్నారు. 2019లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైయస్ జగన్ ప్రతీ కార్యాలయంలో మేనిఫెస్టో పెట్టించారు. సచివాలయం దగ్గర నుంచి బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న ప్రతి కార్యాలయంలో మేనిఫెస్టో అందుబాటులో పెట్టారు. అలాగే మేనిఫెస్టోలోని అంశాలను అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ.. మన రాష్ట్రంలోని 1.67 కోట్ల ఇళ్లు ఉంటే, ఆ నివాసాల్లో మేనిఫెస్టో ఉండాలని, హక్కుగా అడిగేలా ఉండాలని ప్రతి ఇంటికి పంపిస్తున్నాం.
ఈరోజు నుంచి జగన్ కోసం సిద్ధం ప్రచార కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా వినూత్నంగా, బహుశా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా.. స్టార్ క్యాంపెయినర్లుగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన 12 మంది నిరుపేదలను ఎంపిక చేశాం. ఆ పేర్లను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాం. జగన్ కోసం సిద్ధం ప్రచారంలో ఈ 12 మంది స్టార్ క్యాంపెయినర్లు పాల్గొంటారు. సీఎం వైయస్ జగన్ ఎప్పుడూ ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అని చెబుతుంటారు.
ఎందుకు సీఎం వైయస్ జగన్‌కు ఓటు వేయాలంటే.. మిగిలినవారికంటే విభిన్నమైన నాయకుడు, అభ్యుదయకరమైన ఆలోచనలతో సమసమాజం దిశగా, కింది వర్గాలను కూడా సంపన్నవర్గాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. హక్కుగా రావాల్సినవి రాబట్టే వాతావరణం సృష్టించారు. భవిష్యత్తులో అన్ని రకాల సాధికారత కల్పించే దిశగా ఈ ఐదేళ్లలో ముందడుగులు పడ్డాయో చెప్పడానికి ఎంపిక చేసిన 12 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తారు.