జూన్4న విశాఖలో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం
విశాఖ: విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తానని, జూన్4న మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. అబద్ధాలకు రెక్కలుకట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైస్‌ఆర్‌సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. మూడు వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్‌టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా పూర్తవుతుండడానికి కారణం ఎవరు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో మంగళవారం ) జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...
గాజువాక సిద్ధమా? చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమాభిమానాలు, ఇంతటి ఆప్యాయతలు మధ్య ఇక్కడకు వచ్చిన... నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ,తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, మీ జగన్..మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.
జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రం.
మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను మాత్రమే ఎన్నుకునేందుకు జరగబోతున్న ఎన్నికలు కానే కావు. జరగనున్న ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి. ఇంటింటి భవిష్యత్తు,పథకాల కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన మేనిఫెస్టోకు అర్థం.
బాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.
ఈ ఎన్నికల్లో ఎవరైనా మళ్లీ చంద్రబాబును నమ్మడం అంటే దానర్ధం... కొండచిలువ నోట్లో తల పెట్టడం. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే...మళ్లీ చంద్రముఖిని నిద్రలేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి.
దేవుడి దయతో, మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం. వివిధ పథకాలకు ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్‌నొక్కిన పిమ్మటే నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డబ్బులు వెళ్లిపోతున్న పరిస్థితి. ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు. గొప్ప మార్పు నేడు రాష్ట్రంలో కనిపిస్తోంది.
గతంలో ఎప్పుడూ ఇలా బటన్‌లు నొక్కడమూ లేదు, గతంలో ఎప్పుడూ లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు పంపించడమూ లేదు. గతంలో ఉన్నది దోచుకోవడమూ, దోచుకున్నది పంచుకోవడము. మొట్టమొదటిసారిగా చరిత్రను మార్చి ఈ మార్పును తీసుకు వచ్చింది కూడా ఈ 59 నెలల పాలనలోనే.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేశాం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా ఉన్న ఉద్యోగాలు మొత్తం 4 లక్షలు ఉంటే, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు 2.31 లక్షలు.
చంద్రబాబు మేనిఫెస్టో - అబద్దాలకు కట్టిన రెక్కలు.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అనే పదానికి మీ బిడ్డ విశ్వసనీయతను తీసుకువచ్చాడు. ఇంతకు ముందు అంతా మేనిఫెస్టో ఇచ్చేవాళ్లు. రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవారు. మళ్లీ మేనిఫెస్టో జోలికి వెళ్లని పరిస్థితిని మీ బిడ్డ మార్చి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన 99% నెరవేర్చి, అక్కచెల్లెమ్మలకు తీసుకు వెళ్లి ఆ మేనిఫెస్టో చూపించి, జగనన్న పాలనలో ఎన్ని జరిగాయో, ఏం జరిగాయో వారిచేతే టిక్కులు పెట్టించి, వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారి ఆశీస్సులు తీసుకుంటున్న కొత్త సంప్రదాయం పెట్టింది కేవలం ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇలాంటి మార్పులన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వ హయాంలో కనిపిస్తుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు...
ప్రతి రోజూ ప్రతి మీటింగ్‌లో మీ బిడ్డ గడగడా చదువుతున్న పేర్లను చూసి...ఈ స్కీముల పేరు చెప్పగానే ప్రతి పేదవాడికి జగన్ పేరు గుర్తుకువస్తుంది. అదే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకు అయినా ఆయన చేసిన ఒక్క మంచి అయినా గుర్తుకు వస్తుందా? మూడుసార్లు సీఎంగా చేసానని చెప్పుకుంటున్న ఈయన పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము పేరైనా గుర్తుకు వస్తుందా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ పేదకూ ఆయన చేసిన ఏ మంచీ, ఏ స్కీమూ గుర్తుకు రావడం లేదు అంటే ఆయనకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. జగన్ పేరు చెబితే ఇన్నిన్ని స్కీములు గుర్తుకు వస్తాయి ప్రతి పేదవాడికి, ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి రైతన్నకు, ప్రతి పిల్లాడికీ గుర్తొస్తాయి.
బాబు పేరు చెబితే ఏ స్కీమూ గుర్తురాదు కనుక బాబు ఏమంటున్నాడు అంటే జగన్ హయాంలో అభివృద్ధి లేదు..అభివృద్ధి లేదు అంటున్నాడు.
అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాం.
చంద్రబాబుకు ఆయన తోక పత్రికలకు, ఆయన పచ్చ మీడియాకు, అభివృద్ధి అంటే ఏమిటి? ఎవరు చేసారు అన్నది ఒక్కసారి చెబుదామా...సిద్ధమేనా?
రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ అధికారంలోకి రాకమునుపు వరకూ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11. ఈ 59 నెలల్లో మీ బిడ్డ కడుతున్న మెడికల్ కాలేజీలు 17.
మరి ఇది అభివృద్ధి కాదా? మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకూ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు 13. మీ బిడ్డ అధికారంలోకి వచ్చాక ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాలుగా వాటిని మార్చాడు.
13 జిల్లాల్లో 13 కలెక్టర్లు, 13 ఎస్పీలు ఉన్న చోట ఈరోజు 26 జిల్లాల్లో 26 కలెక్టర్లు, 26 ఎస్పీలతో ప్రజలకు మరింత దగ్గరయ్యాడు, మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తున్నారు.
మొట్టమొదటిసారిగా మూడు రాజధానుల దిశగా ఈ 59 నెలలకాలంలో అడుగులు వేసింది మీ బిడ్డే. మీ బిడ్డకు మాత్రమే ఈ ధైర్యం ఉంది.
మొట్ట మొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక, రేపు జూన్ 4 వ తారీకున దేవుని ఆశీస్సులతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర నాలుగు లొకేషన్లలో 6 సీపోర్టులు మాత్రమే ఉన్నాయి. మీ బిడ్డ కొత్తగా
4 సీపోర్టులు కడుతున్నాడు. ఇదే ఉత్తరాంధ్రలోని మూలపేటలో రూ.4,400 కోట్లతో శ్రీకాకుళం జిల్లాలో వేగంగా అడుగులు వేస్తూ సీ పోర్టు కనిపిస్తోంది.
మొట్టమొదటిసారిగా కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి.
మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లొకేషన్లలో 6 మాత్రమే సీ పోర్టులు ఉంటే మీ బిడ్డ 59 నెలల్లో మరో 4 సీపోర్టులు కడుతుంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతున్నాను.
గ్రామ స్వరాజ్యానికి అర్దం చెబుతూ..
చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ.
15,000 గ్రామ సచివాలయాలు, 11,000 విలేజ్ మరియు వార్డు క్లినిక్‌లు, 11,000 ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఎప్పుడూ చూడని విధంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తూ 2,60,000 మంది వాలంటీర్లు ఒక వ్యవస్థగా పనిచేస్తున్నారు. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుని కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, రాజకీయాలు చూడటం లేదు, చివరికి వారు ఏపార్టీకి ఓటు వేసారు అన్నది చూడకుండా నేడు మీ బిడ్డ పాలనలో ప్రతి ఒక్క అర్హుడికీ తలుపుతట్టి, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే పెన్షన్, ఇంటివద్దకే రేషన్, ఇంటి వద్దకే ఈ పథకాలన్నీ అందుతున్న ఈ పాలన మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఈ పాలన అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను.
ఉద్దానం సమస్య మనకు తెలుసు. అక్కడ కిడ్నీ బాధితుల సమస్య దశాబ్దాలుగా ఉండటం చూస్తున్నాం. మీ బిడ్డ రానంత వరకూ ఉద్దానం సమస్యను ఎవ్వరైనా పట్టించుకున్నారా? ఎప్పుడూ చూడని విధంగా ఉత్తరాంధ్రలోనే 4 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, పాడేరులో మెడికల్ కాలేజ్, పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజ్, నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్, విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ వస్తోంది.
ఐటీడీఏ పరిధిలో నేడు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పటళ్లు వేగంగా పూర్తి కావస్తున్నాయి.
భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ పూర్తి కావచ్చే దిశకు పోతోంది అంటే మీ బిడ్డ పాలన కాదా?
ఎయిర్పోర్టుల విస్తరణ కానీ, వేగంగా పూర్తి కావస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు కానీ అన్నీ మీ బిడ్డ హయాంలోనే జరుగుతున్నాయి.
చంద్రబాబు హయాంలో జరగని విధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ రోడ్స్ మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ 1 స్టేటస్ మెయిన్‌టైన్ చేస్తున్నది కూడా మీ బిడ్డ హయాంలోనే.
చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ రాని పారిశ్రామిక వేత్తలు నేడు ముందడుగువేస్తుంటే ఇది విశేషం కాదా?
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32,000 కోట్లు అయితే, అదే ఈ 59 నెలల్లో మీ బిడ్డ పాలనలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి అంటే ఇది అభివృద్ధి పాలన కాదా?
అక్కచెల్లెమ్మల పేరిటే 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుంటే ఇది కాదా అభివృద్ధి?
నాడునేడుతో స్కూళ్లు బాగుపడుతున్నాయి. నాడునేడుతో హాస్పటళ్లు బాగుపడుతున్నాయి. ఎప్పుడూ చూడని విశేషాలు కనబడుతున్నాయి.
గవర్నమెంట్ బడులు మారుతున్నాయి. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫెల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చారు. 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీలతో క్లాసురూములు డిజిటల్‌గా మారుతున్నాయి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి. పిల్లలకు ఇచ్చే టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్, ఇవన్నీ జరుగుతున్నది మీ బిడ్డ కాలంలో కాదా?
ఈరోజు ఒక పిల్లాడు 1వ తరగతిలోకి అడుగుపెడితే మీ బిడ్డ సంస్కరణల వల్ల 2035 వచ్చే సరికి ఆ పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంతోనే కాదు ఐబీ సర్టిఫికెట్ తో ఆ పిల్లవాడు పదోతరగతి పూర్తి చేసి బయటకు వస్తాడు. మీ బిడ్డ సంస్కరణలతో మరో నాలుగేళ్లలో ఆ పిల్లవాడు డిగ్రీ పూర్తి చేస్తాడు, ఆ డిగ్రీలో కూడా 30% కోర్సులు హార్వర్డ్, ఎల్.ఎస్సీ, స్టాన్‌ఫర్డ్ విశ్వ విద్యాలయాల సర్టిఫికేషన్‌తో, ఆన్‌లైన్ కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది.
ఐబీ కోర్సుతో 10వ తరగతి పూర్తి చేసి, డిగ్రీ కూడా స్టాన్‌ఫర్డ్, ఎల్‌ఎస్సీ, హార్వార్డ్‌ల నుంచి కూడా తీసుకుని, అనర్ఘళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ, జాబ్ కోసం అప్లికేషన్ పెడితే..అప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోమని కోరుతున్నాను. ఇది కాదా సస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే అని అడుగుతున్నాను.
ఇంతగా మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తుంటే, రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి అటువైపు నుంచి అడుగులు వేస్తూ ...
గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం జగన్ చెప్పిస్తున్నాడు, మేం వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తాం అని చెబుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా..
మీ బిడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటే...వాళ్లంతా కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోవడానికి ఎలా ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తున్నారో గమనించమని కోరుతున్నాను.
మొట్టమొదటిసారిగా నాడునేడుతో హాస్పటల్ రూపురేఖలు మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ హాస్పటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం 3.95% మాత్రమే. 54,000 మందిని గవర్నమెంట్ హాస్పటళ్లలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్స్ సిబ్బందిని రిక్రూట్ అయ్యారు అంటే ఈ 59 నెలల కాలంలోనే. నాడునేడుతో హాస్పటళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ప్రివెంటివ్ కేర్‌లో ఎప్పుడూ చూడని అడుగులు పడుతున్నాయి. గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ వచ్చింది, గ్రామానికే ఫ్యామిలే డాక్టర్ వస్తోంది. ఇంటిని జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికీ అందుబాటులో ఉంది. విస్తరించిన ఆరోగ్యశ్రీ ద్వారా 25లక్షల దాకా, 3,300 ప్రొసీజర్లకు విస్తరించిన వైద్యం, ప్రతి పేదవాడికీ అండగా ఉంటూ ఒక ఆరోగ్య ఆసరా...పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ హెల్త్ కేర్ ఇస్తుంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతున్నాను.
బాబు గురించి మోదీ గతంలో చెప్పిన మాటలు చూస్తే...
విచిత్రం ఏమిటి అంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే నిన్న ప్రధాని మోదీగారు సభలో చేసిన విమర్శలు చూస్తుంటే..
రాజకీయాల్లో ఇదే చంద్రబాబు, ఇదే దత్త పుత్రుడు, అటు మోదీగారు...గత ఎన్నికల్లో చంద్రబాబు గురించి ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నాను.
-పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టిన వారి చంకనెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు.
అత్యంత అవినీతిపరుడు అని చెప్పిన నోటితోనే...ఇదే మోదీగారు మళ్లీ చంద్రబాబును తమ ఎన్‌డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని ఇవాళ చెబుతున్నాడు అంటే రాజకీయాలు ఏస్థాయికి దిగజారిపోయాయి...అని గమనించాలని కోరుతున్నాను.
అంటే వారితో ఉంటే ఒకలాగా..వారితో మరోలా...మాటలుమారుస్తున్నారు అంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించాలి.
బాబు, దత్తపుత్రుడు, మోదీగారు కలిసి ఆడుతున్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతున్నాను.
ప్రత్యేక హోదా ఇస్తామని జట్టుకట్టారా అని అడుగుతున్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతున్నాము. అందరూ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను.
మీ జగన్ ఆమోదం లేదు కాబట్టే...
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకూ కేంద్రం వెనకడుగు వేసింది. 5 సం.లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అంటే దానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టే అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను.
ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు, దత్తపుత్రుడు, బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడ నుండి పంపమని కోరుతున్నాను.
గాజువాకలో టీడీపీకి ఓటు- స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటు.
గాజువాకలో టీడీపీకి మీరు ఓటు వేయడం అంటే దాని అర్థం... ప్రైవేటేజైషన్ చేస్తాను అంటున్న ఎన్‌డీఏకి ఓటు వేయడం అంటే..స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.
గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే, ఏన్‌డీఏ గెలిచింది అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ ఆపడం సాధ్యం కాదు. ఎందుకు అంటే వాళ్లు దీన్నే ఎన్నికల రెఫరాండంగా తీసుకుంటారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలు అందరూ మద్దతు తెలిపారు కాబట్టే తెలుగుదేశం అభ్యర్థి ఏన్‌డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. దాని తర్వాత జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ల నోట్లోంచి వచ్చే మాట ఏముంటుంది అంటే 'నీకెందుకయ్యా బాధ, వాళ్లకు లేని బాధ నీకెందుకు..వాళ్లు ఎన్‌డీఏకి ఓటు వేసారు ... అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసారు అని అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వారంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా...నీకెందుకయ్యా బాధ' అని ఆ తర్వాత వాళ్లు జగన్‌నుకూడా అంటారని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.
రెండు బిల్డింగ్‌లు కడితే రైల్వే జోన్ కాదు.
అలాగే రైల్వేజోన్- రైల్వే జోన్‌కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్ పెడుతున్నారు..రైల్వే జోన్‌కు అర్థం..ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని. కేవలం రెండు బిల్డింగులు కట్టి మమ అనిపించడం వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు. ఇవాళ వీళ్లు చేస్తున్నది దొంగ ప్రేమే మనమీద చూపిస్తున్నదని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను.
చంద్రబాబు మోసాలు...
రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ మీకు చూపిస్తాను. చూడండి.
2014లో చంద్రబాబు నాయుడు ఈ పాంప్లెట్ తను స్వయంగా సంతకం పెట్టి, ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫొటోలు పెట్టి... ప్రతి ఇంటికీ పంపించాడు. 2014 లో ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు అంటూ రాసాడు. అప్పుడు ఇదే ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లోనూ ఇటువంటి మాటలే మాట్లాడారు. అడ్వర్‌టైజ్‌మెంట్లతో ఊదరగొట్టారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడును ప్రజలు నమ్మి ఓటు వేసారు. ఓటు వేసిన తర్వాత 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపిన ఈ పాంప్లెట్‌లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేసాడు అని మిమ్మల్నే అడుగుతున్నాను. మీరే సమాధానం చెప్పండి.
ఇందులో చంద్రబాబు ముఖ్యమైన హామీలు అంటూ చెప్పినవి..
రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు జరిగిందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు .
రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మకు సంబంధించి రూ.14,205 కోట్లు ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? అని అడుగుతున్నాడు మీ బిడ్డ. మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నా..ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు...ఏ ఒక్కరి బ్యాంకులో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. నెల నెలా అన్నాడు. మరి ఐదేళ్లు అంటే 60 నెలలు నెలకు రూ.2వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. అర్హులందరికీ మూడు సెంట్ల స్ధలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను.. ఇన్ని వేలమంది ఇక్కడున్నారు చంద్రబాబు 3 సెంట్ల కథ దేవుడెరుగు మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చాడా ? అని అడుగుతున్నాను. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా?. సింగపూర్ కి మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీని నిర్మిస్తానన్నాడు, జరిగిందా? మన గాజువాకలో ఏమైనా కనిపిస్తుందా?. 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి పంపించాడు. ఇదే ఫాంప్లెట్, ఇందులో చెప్పినవి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?
పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మళ్లీ ఇదే ముగ్గురు..మళ్లీ ఇదే మేనిఫెస్టో డ్రామా... మరి ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా అని అడుగుతున్నాడు మీ బిడ్డ. నమ్ముతారా? సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారమట నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా? అందరూ ఆలోచన చేయమని కోరుతున్నా. ఇలాంటి అబద్ధాల వ్యక్తులతో, ఇలాంటి మోసాల వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.
వివక్ష లేని పాలనకు ఫ్యాను గుర్తుకే ఓటు.
వాలంటీర్లు ఇంటకే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయము, మన హాస్పటళ్లు మెరుగుపడాలన్నా.. ఏం చేయాలి..ఏం చేయాలి...
రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175 కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 కి 25 ఎంపీ స్ధానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?
ఇక్కడో, ఎక్కడో, అక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్.
మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్, సింక్ లోనే ఉండాలి.
ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలియజేస్తూ...నా పక్కన అమర్ నిలుచున్నాడు. నా తమ్ముడు. యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. అమర్‌ను మీరు గెలిపించండి. అమర్ చేత ఇంకా మంచి మీకు నేను చేయిస్తాను అని మాట ఇస్తున్నాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాను.
నాకు తల్లిలాంటిది. నా అక్క ఝాన్సమ్మ నా పక్కనే ఉంది. వెన్నలాంటి మనసు. మీ అందరికీ మంచి చేస్తుందని నమ్మకం నాకుంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని సవినయంగా చేతులు జోడించి, పేరుపేరునా ప్రార్థిస్తున్నాను అంటూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.