ఏంతపనైంది చంద్రయ్యా!!!
చంద్రయ్య ఇంటికి జనాలు క్యూ కడుతున్నారు. వచ్చే లైను పోయే లైనుతో ఇల్లంతా కిటకిట లాడుతోంది. ప్రతి ఒక్కరూ వచ్చి చంద్రయ్యను కావలించుకుని భోరు భోరున ఏడుస్తున్నారు.
ఇంతపనైందేంటి చంద్రయ్యో....చంద్రయ్య...అంటున్నారు.
ఎట్టాంటి నువ్వు ఇట్టా అయ్యావా చంద్రయ్యా అని చేతులు పట్టుకుంటున్నారు
*కాస్ట్లీ* *క్యాస్ట్ లీ* అనేవాడి వేస్ట్ లీ అయ్యావా చంద్రయ్యో అని కావలించుకుంటున్నారు
మరికొందరు జాలిగా చూస్తూ కొంగుతో కన్నీళ్లొత్తుకుంటున్నారు.
దారిన పోతున్న పక్క ఊరికి చెందిన పెద్దాయనొకరు ఇదంతా చూసి కంగారు పడ్డాడు.
అక్కడే లైన్లో ఉన్న మరో వ్యక్తిని అడిగాడు...
ఏమయ్యా ఈ ఇంటాయిన గానీ పోయాడా?
లేదండీ
ఎవరికైనా జబ్బు చేసిందా?
కాదండీ.
పోనీ మీరేమైనా మీ కష్టాలు చెప్పుకుందామని వచ్చారా?
అబ్బే అలాంటిదేం లేదండీ.
మరెందుకయ్యా? ఈ ఇంటి ముందు ఇంతమంది లైను కట్టారు?
మరండీ ఈ ఇంటాయన చంద్రయ్యగారు ఎన్నికల్లో ఓడిపోయారండీ. సానుభూతి దీక్షలకు సంఘీభావం ప్రకటించమంటే వస్తున్నామండీ.
సానుభూతి దీక్షలా?
అవునండీ...మీ ఓటమికి మా సంతాపం..నీ ఫెయిల్యూర్ కు నా మనస్తాపం ఇలా చెబుతూ మా మద్దతు తెలుపుతున్నామండీ...
ఇలా చేస్తే ఏమౌతుంది?
భలే వోరే...మీకు తెలీదా డైలాగుకు 1000. ఏడిస్తే 2000, కావలించుకుని కన్నీళ్లెడితే 5000 ఇస్తన్నాడు మరి.
డబ్బిచ్చిమరీ సానుభూతి కొనుక్కుంటున్నాడా? ఛీ..ఛీ ఈడేం పెద్దమనిషయ్యా?
ఆయనంతేలే అదోటైపు. ఎగస్పార్టీ నాయకుడి దగ్గరికి ప్రజలు పెద్ద ఎత్తున వెళ్తున్నారని, తన దగ్గరికి రావడం లేదని ఇలా ప్లాన్ చేసాడు. అంతే కాదు వాళ్లు ఏం హామీ ఇచ్చినా తనూ వాటిని కాపీ కొట్టి అవే ఇచ్చేవాడు. ఎవరో చేసే పనికి తన పేరు పెట్టుకునేవాడు. తుఫాను, సముద్రాన్ని కూడా తనే కంట్రోల్ చేస్తానని ప్రచారం చేసుకునేవాడు..
అరే...! మరి అంత గొప్పగా ప్రచారం చేసుకున్న పెద్దమనిషి ఎలా ఓడిపోయాడయ్యా?
అదా అండీ...అనుభవం అనుభవం అన్నడండీ. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా అన్నీ అవే చెప్పేవాడండీ. అరపూట కోసం అర్థ కోటి ఖర్చు పెట్టేవాడండీ. అప్పనంగా జనాల సొమ్ము అనుభవించేవాడండీ. ఆ అంటే అమెరికా ఆహా అంటే సింగపూరు స్పెషల్ ఫ్లైట్లలో తిరిగేవాడండీ. ఫైస్టారు హోటళ్లలో ఫ్యామిలీ సూటులు వాడుకునేవాడండీ. డ్రైఫ్రూట్ల కోసం రాష్ట్రాన్ని డ్రై చేసేసాడండీ. చివరకు చిర్రెత్తిన ఈ జనమంతా చిరాకెత్తి ఓడించేసారండీ.
మరెందుకు ఓడించిన చేత్తోనే ఓదార్పు చేస్తున్నారు
అంటే మరి ఇన్నాళ్లూ తిన్న జనం సొమ్ము కక్కించాలి కదండీ...
ఇలా అయినా కొంత రాబడదామనండీ...
మంచి పని చేస్తున్నారు..అట్టాగే చేయండి అని చక్కా పోయాడా దారినపోయే పెద్దమనిషి.