టైమ్ అప్

22 Jun, 2018 12:11 IST

 టైమ్ అప్ అని ఎప్పుడు అంటారు. సమయం మించిపోయినప్పుడు అంటారు. సమయం ఎప్పుడు మించిపోతుంది. నిర్ణీత గడువు ముగిస్తే సమయం మించిపోతుంది. చంద్రబాబు పాలనకు టైమ్ అప్ అంటున్నారు ఏపీ ప్రజలు. గడువు ముగిసిపోతున్నప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు అంటున్నారు. ప్రజలు నమ్మి పట్టం కట్టిన ఐదేళ్ల కాలాన్నీ, అపరిమితమైన అధికారాన్నీ, అద్భుతాల ఆశలను చంద్రబాబు వ్యర్థం చేసారు. నాలుగేళ్ల సమయాన్ని వృద్ధా చేసేసారు. అందుకే ఇప్పుడు సమయం మించిపోబోతోంది. అది తెలిసే చంద్రబాబు ఉన్నపళాన ప్రభుత్వ బాధ్యతలు గుర్తొస్తున్నాయ్. నాలుగు సంవత్సరాల్లో తలచుకోడానికి కూడా ఇష్టపడనివన్నీ చంద్రబాబు చకచకా చేస్తానంటున్నారు. ఓడరేవులకు శంకుస్థాపనలు, పరిశ్రమలకు పునాదిరాళ్లు, పథకాల అమలు, వాటి పనితీరు తెలుసుకోడానికి అధికారిక మిత్రుల నియామకాలు.... అబ్బో ఒకటా రెండా? గత కొద్ది రోజులుగా చంద్రబాబు గారు ప్రజలపై కురిపిస్తున్న కన్ సర్న్ కు కొదవే లేదు. గతంలో తొమ్మిదేళ్లపాలనలో హెలికాప్టర్లలో పూజారులను వెంటవేసుకుని పునాదిరాళ్లు వేసిన ఘన చరిత్ర ఉన్న బాబు ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అంగన్ వాడీ టీచర్లు, ఆయాల జీతాలను పెంచుతున్నట్ట ప్రకటించారు చంద్రబాబు. గత నాలుగేళ్లలో కనీసం అనేక సార్లు అంగన్ వాడీ మహిళలు తమ జీతాల గురించి ఆందోళలను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు ఎన్నోసార్లు నిరసన ప్రదర్శనలు చేసారు. లాఠీఛార్జిలతో వారిని కొట్టించి వారి దీక్షలను భగ్నం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారిని గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. అలాంటింది అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు ఉన్నపళంగా జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. వారు జీతాలకోసం పోరాడినప్పుడు ఒక్కరూపాయి జీతం పెంచని చంద్రబాబు ఇప్పుడు ఎవరూ అడక్కుండానే జీతాలు పెంచుతున్నామని ప్రకటించడం దేనికని అంటే...ఇన్నాళ్లుగా లేని కరుణ ఇప్పుడు కలగడానికి కారణం ఎన్నికలే అని వేరే చెప్పాలా?

రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో లక్షకు పైగా ఖాళీలున్నాయి. కానీ వేల సంఖ్యలో కూడా వాటిని నింపలేదు చంద్రబాబు సర్కార్. కాంట్రాక్టు ఉద్యోగలను కూడా నిర్దాక్ష్యంణ్యంగా తొలగించింది. నాలుగేళ్ల క్రిందట టెట్ డిఎస్సీ కలిపి నిర్వహించారు. ఆ తర్వాత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ వచ్చారే తప్ప డిఎస్సీ నిర్వహించలేదు. చివరికి టెట్ నిర్వహణ కూడా అధ్వాన్నంగానే జరిగింది. ఇప్పుడు మరో నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ఇది కూడా కేవలం పదివేల పోస్టులకు మాత్రమే. ఉపాధి అని, ప్రభుత్వోద్యాగాలని, నిరుద్యోగ భృతి అని యువతను వంచించిన చంద్రబాబు చివరికి నోటిఫికేషన్ల విషయంలోనూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. నాలుగేళ్ల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనీయలేదు. ఎన్నికల తరుణంలో రాజకీయ లబ్ది కోసం డిఎస్సీ నిర్వహణ చంద్రబాబు అవకాశవాదానికి పరాకాష్ట.

మేందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చిన చంద్రబాబు, ఎన్నికలకు ముందస్తుగా తయారీ ఈవిధంగా చేసుకుంటున్నారు. పాత హామీల చిట్టాలు విప్పుతున్నారు. కొన్నిటిని చేస్తున్నట్టు, మరికొన్ని చేయబోతున్నట్టు ప్రజలకు చెబుతూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికలకు సరిగ్గా ముందు ఏడాది మొక్కువడిగా కొన్ని హామీలు నెరవేర్చడం, మిగిలనవి గెలిచిన తర్వాత పూర్తి చేస్తామని చెప్పడం బాబు వ్యూహం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సేవలను కూడా తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాత్రమే చేసే చంద్రబాబును చూసి ప్రజలు నిలువునా అసహ్యించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని వేషాలు వేసినా బాబును నమ్మి తెలుగు ప్రజలు ఇచ్చిన టైమ్ అయిపోయిందని అనుకుంటున్నారు.