సునీతమ్మా ఇంత’పచ్చ’పాతమా

5 Oct, 2018 13:27 IST

 


కొద్ది రోజుల క్రితమే ఎపి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పరిటాల సునీత డ్వాక్రా మహిళల రుణమాఫీకి టిడిపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. అంతలోనే తమ పార్టీ అధ్యక్షుడి బుద్ధులు పుణికిపుచ్చుకున్నట్టు కొన్నాళ్లకే మళ్లీ యూటర్న్ తీసుకుని డ్వాక్రా మహిళలకు నాలుగేళ్ల లో 2500 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చామంటున్నారు. ఎంత సొంత పార్టీ అయినా, ఎంతగా తమ పార్టీ అంటే పక్షపాతం ఉన్నా ఇంతలా పబ్లిక్ గా అబద్ధాలు చెబుతారా అని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. పైగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు హామీలు అమలవలేదని చెప్పిన సునీతమ్మ ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించిందేమిటా అని ఆలోచిస్తున్నారు.

సరే దీనితో పాటే పరిటాల సునీత మరో సంచలన ప్రకటన కూడా చేసారు. అదేమిటంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రలకే పరిమితమని, ఆయన ఎప్పటికీ సిఎం కాలేరని అన్నారు. ఈ మధ్యే టిడిపి అధినేత హస్తంతో చేయికలిపినప్పటి నుంచీ ఆ పార్టీ నాయకులకు హస్త సాముద్రికం, జాతకాలు చెప్పడం అలవాటైనట్టుంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఎవరు గెలుస్తారో ఘంటాపథంగా చెప్పేస్తున్నారు. ఇక పరిటాల వారి కోడలకు కూడా భవిష్యత్తును చెప్పే శాస్త్రమో, అస్త్రమో దొరికినట్టు జగన్ ఎన్నికల్లో గెలుపు గురించి స్పష్టంగా వాదిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ కు అవగాహన లేదని కూడా ఆవిడ అభిప్రాయం. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టిడిపి నేతలకు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో భారతదేశంలోని మరే నేతకూ తెలియదని వారందరి నిశ్చితాభిప్రాయం. నేతలకే కాదు అభివృద్ధి అంటే ఏమిటో తెలుగు ప్రజలకే అవగాహనకు రాకుండా ఉంది. 

రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడమే అభివృద్ధి అని ప్రజలు భ్రమ పడుతున్నారు. రాజధాని పేరుతో భూములు లాక్కోవడమే అభృవృద్ధి విధానం కాబోలని సరిపెట్టుకుంటున్నారు. కబ్జాలు, లూఠీలు, ప్రైవేటు ఆస్తుల కైకర్యం చేయడం, ఆలయాల్లో నగలు, వజ్రాలు దోపిడి చేయడం, ప్రజలను హింసించడం ఇవన్నీ అభివృద్ధి లక్షణాలని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అసలు అభివృద్ధి అనే పదానికి స్పెల్లింగ్ అయినా, ఆ మాటకు పేటెంట్ అయినా టిడిపిదే తప్ప మరెవ్వరిదీ కాదని కొత్తగా చట్టం కూడా రాబోతోందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.