ప్రభుత్వ శాఖలకు రేటింగ్

1 Dec, 2015 13:41 IST

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యాడు.

`` ప్ర‌జ‌ల‌కు మ‌నం ఏం చేసినా చేయ‌క‌పోయినా ఏదో చేసిన‌ట్టు న‌మ్మించాలి. నా స‌క్సెస్ ఫార్ములా అదే, తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌డ‌మే నా స్పెషాలిటి. అందువ‌ల్ల ఇక‌పై అంద‌రికీ రేటింగ్‌లు ఇస్తా, ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే ప‌నులు మ‌నం ఎలాగూ చేయ‌లేం. ఇలాంటి కంప్యూట‌ర్ క‌ల‌రింగ్‌తో షో చేద్దాం.

`` బాగా ప‌నిచేస్తున్న‌ట్టు న‌టించే శాఖ‌కు గ్రీన్ రేటింగ్.. ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక‌టి చెప్పి న‌మ్మించే శాఖ‌కు ఎల్లో రేటింగ్‌,...ప‌ని త‌క్కువ ప్ర‌చారం ఎక్కువ‌గా వుండే శాఖ‌కు బ్లూరేటింగ్... ఆదాయం ఎక్కువుండే శాఖ‌కి రెడ్‌రేటింగ్ .. ఇస్తామన్న మాట’’అన్నాడు బాబు

అధికారులు  తెల్ల మొహాలేసి `` చేసే ప‌నుల‌కి రేట్‌క‌ట్టి తీసుకోవ‌డం త‌ప్ప ఈ రేటింగ్ మాకు తెలియ‌దు సార్‌``అన్నారు.

`` నాకు మాత్రం తెలుసా ఏంటి? ఏదో ఒక‌టి హ‌డావుడి చేస్తుంటే మ‌నం బాగా ప‌నిచేస్తున్నామ‌ని ప్ర‌జ‌లు అనుకుంటారు. నేను మాడ్ర‌న్ ముఖ్య‌మంత్రిని, కంప్యూట‌ర్ వ‌ల్ల గ‌తంలో నా ఫూజ్ ఎగిరిపోయినా, జ‌నం న‌న్ను ఓడించినా నాకు బుద్ధిరాలేదు. న‌న్ను ఎన్నుకున్నందుకు జ‌నానికి బుద్ధి వ‌చ్చేలా చేయాలంటే అన్నింటిని కంప్యూట‌రైజేష‌న్ చేయాల్సిందే``

`` క‌డుపుకి ఇంత తిండి ముఖ్యంకానీ కంప్యూట‌ర్లు ఎందుకు సార్‌?`` అడిగాడో అధికారి

`` తెలివైన ప్ర‌శ్న‌లు వేస్తే స‌స్పెండ్ చేస్తా, ప్ర‌తి మ‌నిషి ఎంత తిండి తింటాడో లెక్క‌లేయాల‌న్న కానీ, కంప్యూట‌ర్ వుండాల్సిందే. ఇప్పుడీ రేటింగ్ ఎందుకంటే మ‌న‌కు కావాల్సిన ఒక కంపెనీ వుంది. ఈ కాంట్రాక్ట్ ని  ఆ కంపెనీకి ఇస్తే అదే లెక్క‌లు తీసి క‌ల‌ర్ కాంబినేష‌న్ చూసుకుంటుంది. మ‌న‌కు ఇవ్వాల్సిన‌ది ఇచ్చేస్తే రేటింగ్ కూడా మ‌న‌మే చెబుతాం.

ఏం ప‌ని చేస్తుందో, ఎంత ఆదాయాన్ని ఇస్తుందో ఎప్ప‌టికీ తేల్చ‌కుండా కాకి లెక్క‌లు చెప్పే ఆర్థిక శాఖ‌కు గ్రీన్ రేటింగ్ నైవేద్యం ఇస్తే అంద‌రికీ వైద్యం అని న‌మ్మించే ఎల్లో రేటింగ్ ప‌సుపు మ‌న పొంత రంగు. మ‌న పార్టీ అధికార జ‌బ్బు ప‌చ్చ‌కామెర్లు లోక‌మంతా ప‌చ్చ‌గా వుండాలంటే కామెర్లు చాలా అవ‌స‌రం.

  స‌మాచార శాఖ‌కి బ్లూ రేటింగ్.. ఎందుకంటే మ‌న‌మేమీ ప‌నిచేయ‌క పోయినా ప్ర‌చారం క‌ల్పించ‌డ‌మే దాని బాధ్య‌త . మ‌న ద‌గ్గ‌ర రొట్టె చేసుకోడానికి పిండి లేక‌పోయినా కొండ‌లు పిండి చేస్తున్నామ‌ని అది.

   ఇక ఆదాయం తెచ్చి పెట్టే శాఖ ఎక్సయిజ్ శాఖ..  జ‌నం ఎంత ఎక్కువ తాగితే అంత‌గా వాస్త‌వాన్ని  మ‌రిచిపోతారు. మైకం వ‌ల్ల పైకం పోయినా సుఖం ద‌క్కుతుంది. దీనికి రెడ్ రేటింగ్  ఎందుకంటే ఉద‌యించే సూర్యుడు కూడా ఎర్ర‌గానే వుంటాడు. ఆదాయం ఎన్న‌టికీ త‌గ్గిపోని ఈ శాఖ అంటే మ‌న ప్ర‌భుత్వానికి సూర్యోద‌యం లాంటిది. అర్థ‌మైందా?``

``అర్థ‌మైంది సార్‌``

`అర్థ‌మైనా కాక‌పోయినా అర్థ‌మైంది అంటూ వుండాలి. అదే అధికారుల ప్రాథ‌మిక విధి`` అంటూ ముగించారు చంద్రబాబు