నంగనాచి నాయుడు కాకి
నీళ్ల కుండలో రాళ్లేసిన కాకి కథ పాతది. ఇప్పుడు చెబుతున్న నాయుడుగారి కాకి కథ సరికొత్తది. నల్ల కాకి, బొంత కాకి, జెముడు కాకి ఇలా కాకుల్లోనూ కులాలున్నాయి. అందులో నాయుడు కాకి ఒకటి. నాదే ఆధిపత్య కులం అని మిగితా కాకుల మీద పెత్తనం చేసేది. ఎంగిలి మెతుకుల నుంచి ఎత్తిన పిండం వరకూ అన్నింట్లోనూ కమీషన్ల వాటా నొక్కేది. పూటా పొట్ట పట్టనంత తిండి బొక్కేది. ఓ సారి మాంఛి వేసవి కాలం వచ్చింది. నాయుడు కాకికి ఎడతెగని దాహం వేసింది. ఎందుకంటే ఏ మూలకెళ్లినా గుక్కెడు నీళ్లు దొరకలేదు. చెరువులు, చెలమలూ కూండా ఎండి మండిపోతున్నాయి. ఏ ఇంటి ముందన్నాకడవ దొరక్కపోతుందా అని వెతుక్కుంటూ పోయింది. ఓ ఇంటిముందు కడవ ఉంది. కొత్తదిలాగుంది. ఈ కుండ నాదే. ఇందులో నీళ్లన్నీ నావే. ఎవ్వరికీ వాటా లేదు అంటూ ఎగురుకుంటూ వెళ్లి కుండ మీద వాలింది. తలకాయి కుండలోకి పెట్టి తొంగి చూసింది. తిరిగి తిరిగి ఉందేమో కళ్లకు పొరలు కమ్మాయి. కుండలో నీళ్లున్నాయో లేదో తెలీడంలేదు. కళ్లు చికిలించి చూసింది. కుండ అన్నాక నీళ్లుండవా అని ధీమాకి పోయింది. తాతలనాటి గతం గుర్తుకు తెచ్చుకుంది. మేనమామ తెలివిని అరువు తెచ్చుకుంది. గులకరాళ్లు తెచ్చి కుండలో వేయడం మొదలెట్టింది. రాళ్లు నిండుతున్నాయి. నీళ్లు పైకి రావడంలేదు. నాయుడు కాకి మాత్రం కుండ నాదే..నీళ్లు నావే అంటూ రాళ్లేస్తూనే ఉంది....రాళ్లతో కుండ నిండింది. నాయుడు కాకి గుండె మండింది. చివరకు నీరసంతో కుండ పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది. ఒక్క కాకి నేలరాలితే గుంపుగా వచ్చి వాలే కాకి జాతి కూడా నంగనాచి కాకి ముఖం చూడకుండా నీటి చెలమ వెతుక్కుంటూ అవతలకి పోయింది.