కొంగ జపం – దొంగ దీక్ష

21 Apr, 2018 09:53 IST

బాబు స్టేడియలంలో పాతిక్కు పైగా ఉన్న ఎయిర్ కూలర్ల చల్లని గాలుల మధ్య, తన పుట్టిన రోజు దీక్షను శాంతియుతంగా సాగిస్తున్న తరుణంలో హఠాత్తుగా ఓ పరిణామం జరిగింది. వందల కొద్దీ తెల్లని కొంగలు గుంపులు గుంపులుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోకి వచ్చాయి. పొడవాటి ముక్కులతో కుర్చీల్లో కూర్చున్నవాళ్లని పొడిచి మరీ లేపి దారి చేసుకుంటూ బాబు దీక్షా వేదికదాకా చేరుకున్నాయి. అందులో నాయకుడిలా ఉన్న కొంగ వచ్చి వేదికమీదున్న బాబుకు తెల్లపూల మాలొకటి వేసింది. అది చూసి మిగితా కొంగలన్నీ రెక్కలు అల్లారుస్తూ కరతాళ ధ్వనులు చేసాయి. నాయకుడు కొంగ మైకు దగ్గరకెళ్లింది. సభలో ఉన్న అందరినీ, తన కొంగ జాతినీ ఒకసారి పరికించి చూసుకుని మాట్లాడటం మొదలు పెట్టింది.

‘ఇన్నాళ్లూ కొంగ జపం అన్నారు. దాన్ని దొంగ జపం కింద జమ కట్టారు. కొంగ అనేది ఒంటికాలితో జపం చేయ తగదని, చేసినా దాన్ని ఎరగా భావించాలే కానీ, త్వరగా నమ్మకూడదని మీరంతా డిక్లేర్ చేసేసారు’ అని ప్రసంగాన్ని ఆపి ఆవేదనతో కన్నీళ్లు తుడుచుకుంది నాయక కొంగ. తమ నాయకుడి కళ్లలో నీళ్లు తిరగడం చూసిన మిగిలిన కొంగలన్నీ కూడా బోలెడంత బాధపడ్డాయి. నాయక్ కొంగ తిరిగి మాట్లాడటం మొదలెట్టింది. ‘కొంగలు జపం చేసేది చేపల కోసం అనే స్పృహ మీకు ఉండటమే అందుకు కారణం. ఇన్నాళ్లూ మా గుట్టు తెలిసి, దాన్ని గడుసుగా సామెతగా వాడేసుకుంటున్నారే- మాజాతిని అవమానిస్తున్నారే అని బాధపడేవాళ్లం. అయితే ఇవాళ్టికి మా బాధ కాస్త ఉపసమించింది. మనుషుల్లోనూ దొంగ జపాలు చేసే వాళ్లుంటారని ఇప్పుడే తెలుసుకున్నాం. వాటికి దీక్ష అనే పురుంటుందని కూడా తెలుసుకున్నాం. మా జపానికి సమానమైన ఆ దీక్షను చేస్తున్నందుకు బాబును అభినందించి, సత్కరించుకోవాలనే ఇలా వచ్చాం. ఇకపై కొంగ జపం దొంగ జపం అని కాకుండా కొంగ జపం బాబు దీక్ష అని సామెతను మార్చి ఉపయోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ప్రసంగం ముగించిబోయింది కొంగ.

వేదికమీద కూర్చున్న బాబుకు కోపం శివాలెత్తింది. కొంగ మీద ఫైర్ అయిపోయాడు. ‘ఆఫ్ట్రాల్ కొంగవి. నీదీ నాదీ ఒకేలాంటి దీక్ష అంటావా? నేను రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాడుతున్నాను..శాంతియుతంగా యుద్ధం చేస్తున్నాను. కేంద్రంతో ఒంటిగా ఢీకొడుతున్నాను…’ ఆవేశంలో బాబుకు మాటలు తడబడుతున్నాయి…

చేపలు తినని కొంగలు చెరువులో ఉండవు…జనాన్ని మోసం చేసే నాయకుడు జనంలో ఉండడు…మే ఏం రోజుకారోజు ఆహారం కోసం జపం చేస్తాం. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరం కోసం దీక్ష చేస్తావ్. మాకు చేపలు దొరగ్గానే జపం ఆపేస్తాం. నువ్వు ప్రజలను డైవర్ట్ చేసి దీక్ష వదిలేస్తావ్. ఇంతకు మించి మన మధ్య పోలికలింకేం కావాలి. అందుకే మా జపం నీ దీక్ష రెండూ ఒక్కటే. ఇది కాదనలేని సత్యం…కాకపోతే మా జపాన్ని చేపలు నమ్ముతాయి..నీ దీక్షని వాళ్లు నమ్మడం లేదు – అనిచెప్పి రెక్కలు విప్పుకుని తన గుంపుతో సహా వేదికమీద నుంచి ఎగిరిపోయింది నాయక కొంగ.

    ’