ఎలుకను పట్టు లక్షలు కొట్టు
మా సోగ్గాడు సోదిలో లేకుండా పోయాడు. ఉజ్జోగం సజ్జోగం లేకుండా ఊరకే తిరుగుతున్నావురా సన్నాసీ అని నే తిట్లు మొదలెట్టకముందే ఏడకో పోతున్నాడు. మూన్నాళ్లుగా ఇదే వరస. పొద్దునే పోవడం, సందేళ రావడం. ఈ పూట వాడి సంగతి తేలుద్దామనే సంగటి తిని సప్పుడు సేయకుండా కూసున్నా. అర్థరేత్రి దాకా ఆడా ఈడా తిరిగి అబ్బో తెగ కష్టపడిపోయినట్టు ఆపసోపాలు పడుతూ వచ్చాడు నా పుత్ర రత్నం. వాణ్ణి చూస్తానే నా బీపీ టీడీపీ జమానాలో అప్పులాగా సయ్యని పెరిగిపోయింది.
ఏరా పనికిమాలిన సన్నాసీ, రోజంతా ఏడ తిరిగి తిరిగి వస్తున్నావురా. చదువయ్యి నాల్గేళ్లయ్యింది. పని లేదు, పాటలేదు, ఊళ్లమీద బలాదూరు తిరుగుతున్నావ్. అర్థరేతిరి దాకా ఏం ఉద్ధరించి వస్తున్నా అడిగాను కొడుకుని గుమ్మందగ్గరే ఆపేసి.
ఆపు నాన్నా నేనేమీ ఖాళీగా తిరడం లేదు ఎలుకలు పట్టడం, పాములు పట్టడం, దోమలు పట్టడం ప్రాక్టీస్ చేస్తున్నా అన్నాడు నా కొడుకు మహా గర్వంగా.
ఛీ చెత్త వెధవా. పని లేకపోతే ఇలా పనికిమాలిన పనులు చేస్తావా అన్నాను నేను ఆవేశంగా.
నేనే గాదు నాన్నోయ్ ఊళ్లో ఉన్న సానామంది కుర్రోళ్లిదేపని చేస్తున్నార్లే చెప్పాడాడు తాపీగా.
ఇదెక్కడి ఖర్మరా వాళ్లమ్మ నెత్తికొట్టుకుంటూ అడిగింది.
అదిగాదే అమ్మా 300 ఎలకలు పడితే 60 లక్షలు
మూడు పాములకు 7 లక్షలు,
అదే దోమలు ఆడో మగో కనిపెడితే దోమకు లక్ష ఇస్తన్నారు. అందుకే అందరం గలిసి ఈ పనే ప్రాక్టీస్ చేస్తున్నాం చెప్పాడు నా కొడుకు.
మాయావిడ అయోమయంగా చూసింది. నేను అర్థం కాక తెల్లముఖం ఏసా.
అప్పుడు చెప్పాడు నా కొడుకు అయ్యా చంద్రబాబు ఎలకలు పట్టినందుకు, పాములు పట్టినందుకు, దోమలు పట్టినందుక లచ్చలకి లచ్చలు ఇచ్చాడయ్యా. అందుకే మనం కూడా పోయి ఆ పని చేసుకుంటే పోతదని ఫెండ్సందరం కలిసి తుప్పల్లో దోమలు పట్టడం, కలుగుల్లో ఎలకలు పట్టడం, మట్టిదిబ్బల్లో పాములు పట్టడం ప్రాక్టీస్ చేస్తున్నాం అని.
ఓరి నా ఎర్రి పుత్ర రత్నం అది చంద్రబాబు కనుక, ఆ ప్రభుత్వం టీడీపీది కనుక, ఆ ఎలకలు పట్టినోళ్లు ఎల్లో పార్టీ తాలూకు కనుక అన్ని లచ్చలు, కోట్లు ఇచ్చార్రా. ఇప్పుడున్న గవర్నమెంటులో ఆ పప్పులేం ఉడకవు గానీ ఎల్లి గ్రామ వాలంటీరు పోస్టులు పడ్డాయి పోయి అప్లైచేయండి అందరూ అని గసిరాను.
అట్టాగే లచ్చలొద్దనుకుంటే మానేయ్ అంటూ నన్ను తోసుకుంటా ఇంట్లోకి పోయాడు మా ఎర్రి ఎంకడు.