'ఢీ'ఎస్సీ

20 Nov, 2018 18:37 IST

చిల్లు చెంబుతో చల్లినీళ్లిచ్చే రకం చంద్రబాబు. 2016 నుంచి ఇప్పటిదాకా డిఎస్సీ నోటిఫికేషన్ ను ఇవాళా రేపు అంటూ మూడేళ్లు గడిపేసాడు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి అందులో సవాలక్ష లొసుగులు పెట్టాడు. నిబంధనలపేరుతో అభ్యర్థులను నిలువు దోపిడీ చేస్తూన్న తంతు చూసి ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇచ్చిన పోస్టులే 7,729. రాష్ట్రంలో లక్షలాది మంది డిఎస్సీకోసం ఎదురు చూస్తుంటే ఖాళీ ఉన్న పోస్టుల్లో కనీసం పావు వంతుకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అందులోనే సవాలక్ష నిబంధనలు.

ఉన్నవే అరొకరా పోస్టులు. వాటికోసం లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సొంత జిల్లాలో స్థానిక కోటాతో పాటు, నాన్ లోకల్ గా ఇతర జిల్లా పోస్టులకూ వేరువేరుగా ఫీజులు చెల్లించారు. అయితే ఆ ఫీజులు పుచ్చుకుని, హాల్ టికెట్లు కూడా పంపిన తర్వాత ఎన్నిసార్లు ఫీజు చెల్లించినా ఏదో ఒక కేటగిరీకి సంబంధించే పరీక్ష రాయాలని మెలిక పెట్టింది ప్రభుత్వం. మరి ఆ విషయాన్ని వెబ్ సైట్ లో ముందే చెప్పి ఉండాలి కదా అన్న ప్రశ్నకు సమాధానంలేదు. కనీసం దరఖాస్తు సమయంలోనైనా ఈ విషయాన్ని రెగ్యులేషన్స్ లో చెప్పకుండా, ఒక్క పరీక్షకే అనుమతిస్తామని దరఖాస్తు సమయం ముగిసాక చెప్పడంలో తిరకాసు ఉందంటున్నారు అభ్యర్థులు. ఇంత లోప భూయిష్టంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా అని నిప్పులు చెరుగుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి, ఎంతో సమయం వెచ్చించి చదువుకుని, ఏళ్లుగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభుత్వం పెడుతున్న షరతులను తప్పు పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ కొర్రీలను అడ్డుపెట్టుకుని, కోర్టులో ఎవరితోనో కేసు వేయించి డిఎస్సీని నిలిపేసేందుకే ఇలాంటి షరతులు పెట్టారని అనుమానిస్తున్నారు.

స్థానికేతర కోటాను తెలంగాణా డిఎస్సీలో కల్పించారు. కానీ ఎపిలో మాత్రం స్థానికేతర కోటాను అనుమతించలేదు. కోర్టు మొట్టికాయలతో చివర్లో తిరిగి అనుమతించారు. తెలంగాణా డీఎస్సీలో ఒకే ఫీజుతో లోకల్, నాన్ లోకల్ లో ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఇచ్చారు. ప్రతిభ ఆధారంగా స్థానిక, స్థానికేతర కోటాల్లో పోస్టు దక్కే అవకాశం కల్పించారు. కానీ చంద్రబాబు మాత్రం వీటన్నిటికీ కొర్రీలు పెడుతూ వచ్చారు. పేరుకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి, అతి తక్కువ పోస్టులు, అందులోనూ తలతిక్క నిబంధనలతో అభ్యర్థులను గందరగోళంలో పడేసారు. చంద్రబాబు విధానం చిల్లుల జల్లెడలో నీళ్లు తాగమన్నట్టుగా ఉందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.