దొంగలు భయపడతారు మరి
పడక్కుర్చీలో వాలి ...సిగార్ గుండెల నిండా పీల్చి పొగ వదిలాడు గిరీశం.
ఆకాశం కేసి చూస్తూ ఆలోచనలో పడిపోయాడు.
గురూగారూ...గురూగారూ...అంటూ కంగారు కంగారుగా పిలిచాడు గోపాత్రుడు
గిరీశం ఉలిక్కి పడి..గోపాత్రుడివైపు చూసి..యావిటోయ్? గోపాత్రుడూ..ఏంటి నీ తస్సల గొయ్య...ఏంటా అరుపులు ఏమైందేవిటీ? అని చిరుకోపంగా అడిగాడు.
అది కాదు గురూగారూ...ఈ బిజెపి వోళ్లని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయాలండీ అన్నాడు గోపాత్రుడు.
గోపాత్రుడు నోట్లోంచి సిగార్ బయటకు తీసి గుప్పున పొగ వదిలి.. ఏవైందోయ్ అలా రంకెలేస్తున్నావు అని ఆరాతీశాడు .
లేకపోతే ఏంటి గురూగారూ..మా సెందరబాబుగోరిని ఊరికే బయపెడుతున్నారెందుకండీ బిజెపీ వాళ్లు అని గోపాత్రుడు అడిగేశాడు.
వార్నీ... చంద్రబాబును బిజెపి వాళ్లేం భయపెడుతున్నారోయ్? బిజెపి-చంద్రబాబు ఫ్రెండ్సే కదా. అన్నాడు గిరీశం.
ఏం ఫ్రెండ్స్ండీ.. ప్రత్యేక హోదా ఇవ్వమని సెందరబాబు గోరు గట్టిగా అడిగేసరికి బిజెపివోళ్లు మా సెందరబాబుపైకి ఇంకంటాక్సోళ్లనీ..ఈడీవోళ్లనీ పంపిస్తున్నారంటకదా అని గోపాత్రుడు నిలేశాడు.
గిరీశం సాలోచనగా నవ్వేసి..ఒరేయ్ ఓ మాట చెప్పరా...ఊళ్లో ఎక్కడన్నా దొంగతనం జరిగిందనుకో..పోలీసులొస్తారు. పోలీసులొచ్చి ఏం చేస్తారు దొంగలను పట్టుకుంటారు అంతేనా? అని గిరీశం అడిగాడు.
దానికి గోపాత్రుడు ఇదేం పెద్ద ప్రశ్నా అన్నట్లు చూసి..అవును గురూగోరూ..పోలీసులొస్తే దొంగలు భయపడతారు కూడా దానికీ మా సెందరబాబుగోరిన బయపెట్టానికీ ఏంటి సమ్మందం అని లాపాయింట్ లేవనెత్తాడు.
గిరీశం..గోపాత్రుడి కేసి జాలిగా చూసి.. ఒరేయ్ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్లని పోలీసులు పట్టుకున్నట్లే.. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవోళ్లూ..బాగా డబ్బున్నవోళ్లూ కూడా పన్నులు ఎగవేశారనుకో.. వాళ్లని కూడా దొంగలనే అంటారు.అలాంటి దొంగలను పట్టుకోడానికి ఇంకంట్యాక్సోళ్లూ.. అలా అక్రమంగా సంపాదించి బినామీ పేర్లతో డబ్బులు తరలించేవాళ్లని పట్టుకోడానికి ఈడీ వోళ్లూ..సీబీఐ వోళ్లూ కూడా వస్తారన్నమాట. అన్నాడు గిరీశం.
గోపాత్రుడి మొహం కందగడ్డలా ఎర్రగా అయిపోయింది.
అంటే మా సెందరబాబుగోరు దొంగంటారా ఏటి? అని కోపంగా అడిగాడు.
గిరీశం నవ్వేసి..నేననడం లేదురా పిచ్చిసన్నాసీ.
మీ చంద్రబాబే ఎవరూ రాకుండానే ఊరికే వణికిపోతూ..నన్నరెస్ట్ చేసేస్తారు..నన్ను లోపలకి తోసేస్తారు అంటూ ప్రచారం చేసుకుంటోంటే..అందరికీ అనుమానాలు పెరుగుతున్నాయి మరి అన్నాడు గిరీశం.
మా సెందరబాబు గోరు నిప్పండి అన్నాడు గోపాత్రుడు.
అవున్రా..చంద్రబాబు కూడా అడిగిన వాళ్లకీ..అడగని వాళ్లకీ కూడా తానునిప్పనే చెబుతున్నాడు.
కానీ బాబొరే..నాకో డౌట్రా? అని ఆగాడు గిరీశం.
ఏంటండది? అని గోపాత్రుడు అమాయకంగా ప్రశ్నించాడు.
చంద్రబాబు నిజంగానే నిప్పే అనుకుందాం.
ఆయనగానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలూ ఎంపీలు మంత్రులూ కానీ..ఏ తప్పు చేయలేదనే అనుకుందాం.
ఏ తప్పు చేయనపుడు ఈడీ వస్తే ఏంటి? సిబిఐ వస్తే ఏంటి?
ఎవరైనా రండి నా నిజాయితీ నిరూపించుకుంటానని చంద్రబాబు ఛాలెంజ్ చేస్తే సరిపోతుంది కదరా అన్నాడు గిరీశం.
గోపాత్రుడు అయోమయంగా చూశాడు.
అవును గురూగోరూ..మీరన్నదీ నిజవే.మరి మా సెందరబాబుగోరు ఎందుకంత దైన్యంగా సెప్పడం లేదండీ మరి? అని అడిగాడు.
గిరీశం నవ్వేసి..నువొట్టి పిచ్చిమాలోకం రా.
తప్పు చేసిన వాళ్లు ధైర్యంగా సవాల్ చేయలేరు.
మీ చంద్రబాబు కూడా అంతే అన్నాడు గిరీశం.
గోపాత్రుడికి చాలా అవమానంగా అనిపించింది. తలదించేసుకున్నాడు.