చంద్రబాబు కొత్త వేషం

8 Nov, 2017 15:13 IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ప్రతిపక్షం లేకుండా సమావేశాలు ఎలా అని తర్జన భర్జన పడుతున్నారు రాజకీయవాదులు. అధికారాపక్ష నేతలంతా పోలో మంటూ చంద్రబాబు దగ్గరకు పరిగెత్తారు. అసెంబ్లీలో పోట్లాడటానికి, అధికారం ప్రదర్శించడానికి, అహంకారం చూపించడానికి ప్రతిపక్షం లేకపోతే ఎలా…? వాళ్లు ప్రశ్నించాలి…మనం పరిహసించాలి…? వాళ్లను రెచ్చగొట్టాలి…మనం దాడులు చేయాలి…ఇవన్నీ లేకుండా మనం అసెంబ్లీ ఎలా నడపగలం ఆదుర్దా పడిపోయారు నేతలు…
చంద్రబాబు తన మార్కు కుటిల రాజకీయంలో మునిగి గడ్డం నిమురుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. డోన్ట్ వర్రీ డియర్ లీడర్స్. నాకో మహత్తరమైన ఆలోచన వచ్చింది అన్నాడు…
చంద్రబాబు మహత్తరం అన్నాడంటే అదేదో మాహిష్మతిలాంటిదే అనుకున్నారు నాయకులు….చెప్పండి అన్నారు బుద్ధిగా నించుని.
సింగపూర్ లో నేను చూసొచ్చాను..అక్కడ ప్రతిపక్షం పాత్ర పెద్దగా ఏమీ ఉండదు. అధికార పక్షమే పార్లమెంట్ సమావేశాల్లో సమస్యలను లేవనెత్తి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది అన్నాడు గంభీరంగా…
సార్..అది సింగపూర్…ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం. అక్కడ ప్రజలకి కావాల్సినవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం అక్కడ అవసరమైనవన్నీ చేసేస్తుంది…కనుక ప్రతిపక్షానికి అడగడానికేం ఉండదు..మనం అలాకాదే…అన్నీ చేస్తాం అని చెప్పడమే కానీ ఏదీ చేయం గదా…అందుకే ఇక్కడ ప్రతిపక్షానికి బోలెడు పని - చెప్పాడో సీనియర్ నాయకుడు..
ఫర్వాలేదు…ప్రతిపక్షం శాసన సభలో ఉన్నంత మాత్రాన వాళ్లని మనం మాట్లాడనిస్తామా ఏంటి…? మైకులు తెగ్గొట్టి…నోటికొచ్చినట్టు తిట్టి…సమస్యల గురించి మాట్లాడకుండా చేస్తున్నాం కదా…ఆమాత్రం దానికి ప్రతిపక్షం అసెంబ్లీలో లేకపోయినా ఉన్నట్టే అనుకుని కానిచ్చేద్దాం అన్నాడు బాబు. 
అదెలాగో కూడా మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి అడిగాడు మరో నేత. 
ఏముంది కొంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లాగా సభలో లేచి ప్రశ్నలు వేయండి…మిగిలిన వాళ్లు సమాధానం చెబుతారు చెప్పాడు బాబు తేలిగ్గా.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లా ఎందుకు…ప్రతిపక్ష ఎమ్మెల్యేలే ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లాగే మన పార్టీలో ఉన్నారు కదా…వాళ్లని వాళ్ల స్థానంలోనే ఉండి ప్రశ్నించమనండి…ఉక్రోషంగా అన్నాడో టిడిపి నేత…ఫిరాయింపుదారులై వచ్చి, వైయస్సార్ సిపి పేరుతోనే టిడిపిలో పదవులు వెలగబెడుతున్న వారిపై పీకలదాకా కోపం ఉన్నదా నేతకు. 
టాపిక్ డైవర్ట్ అవుతోందని, ఫైర్ రాజుకుంటోందని, పార్టీలో అసంతృప్తి రేగుతుందని గమనించి గబగబా సర్ది చెప్పాడు బాబు. నో కామెంట్స్…మీలో కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లా ప్రశ్నలు రెడీ చేసుకోండి అన్నాడు సీరియస్ గా. 
మరి ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు ఉంటారు…మరో ప్రశ్న మొలిచింది…
ఇంకెవరు నేనే చెప్పాడు చంద్రబాబు…
అవును…నేనే…ప్రతిపక్ష నేతలాగా నించుని ప్రశ్నవేస్తాను…అధికార పక్ష నాయకుడిలా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాను…
ఇంకో విషయం సార్..ఇప్పటిదాకా ప్రతిపక్ష నాయకుణ్ణి తిట్టడానికి మాకు ట్యూషన్ పెట్టి మరీ తిట్లు నేర్పించారు. మరి మేమే విపక్షంలో ఉంటే మీరు నేర్పించిన తిట్లన్నీ మీమీదే వాడాల్సుంటుందేమో సందేహంగా అడిగాడో పచ్చనేత. 
అవున్సార్ దీని గురించి ఆలోచించాలి అన్నాడు మరొకాయన. 
డోన్ట్ వర్రీ ప్రతిపక్షంలాగా ఉంటూ మీ పని మీరు చేయండి…నా పని నేను చేసుకుపోతా..అలా ముందుకు పోదాం….అన్నాడు చంద్రబాబు.