డిజిటల్ పబ్లిసిటీ

1 Dec, 2016 12:25 IST
  ఒక తాపీ మేస్త్రీ హైదరాబాద్ లో రెండు మూడు చోట్ల గోడలకు ప్లాస్టింగ్ చేశాడు. తరువాత ఏమయ్యిందో కానీ అతను మూడో గోడకు ప్లాస్టింగ్ చేసినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. అయితే తాజా నోట్ల మార్పిడి కష్టం కన్నా చాలా ముందు ఓట్లకు నోట్ల మార్పిడిలో మనవాళ్లు బ్రీఫుడ్ మీ అంటూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో తను నిర్మించానని అనుకుంటున్న హైదరాబాద్ ను అర్థంతరంగా వదిలి వెళ్లిపోయాడు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా మన మేస్త్రీ ఆవు వ్యాసంలా మొదట చెప్పేది-తాను హైదరాబాద్ లో ప్లాస్టింగ్ చేసిన గోడల గురించే.
                                   మన తాపీ మేస్త్రీకి జన్మనిచ్చింది చిన్న పల్లెటూరు. ఆ వూరికి వ్యవసాయమే ప్రధానమైన ఆధారం. కానీ మేస్త్రీ ఎదిగే కొద్దీ వ్యవసాయం దండుగ అని అరవడం మొదలుపెట్టాడు. టి చివరి అక్షరం ఉన్న ఏదైనా ఓకే అంటూ కొత్త పాట అందుకున్నాడు. ఐటి ఐటి అంటూ రైతులను గాలికొదిలేశాడు. 

                                  గిచ్చి ఓదార్చడంలో నేర్పరి అయిన మన తాపీ మేస్త్రీకి ప్రస్తుతం గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. రూ. 500,1000 పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ రానున్న ముప్పును ముందే ఉప్పందించిన ముప్పయ్య మాట ప్రకారం ప్రధాన మంత్రికి లేఖ రాశాడు. పాలు, పెరుగు ఉండనే ఉంది కాబట్టి సర్దుకోవాల్సింది సర్దుకున్నాడు. తీరా జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకునే సరికి బ్యాంకర్ల మీద, ఏటీఎంల మీద, క్రెడిట్ కార్డుల మీద, సాఫ్ట్ వేర్ మీద ఆగ్రహించి హుకుం జారీ చేస్తున్నట్లు అధికారిక లీకులిచ్చుకుంటున్నాడు. 
                                       రియల్ టైమ్ మానిటరింగ్ లో రియల్ టైగర్ నంటూ పూటకు మూడు కాన్ఫరెన్సులు పెట్టి చేయని నేరానికి బలపశువులైన బ్యాంకర్లపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. డెడ్ లైన్ పెడుతున్నాడు. ఊగిపోతున్నాడు. 

                                      తమ బ్యాంకు యాజమాన్యాలు, కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐకి లేని దురద మేస్త్రీకెందుకు? అని ఒక అమాయక బ్యాంకరు ప్రశ్నించాడు. ఎందుకంటే తన లేఖవల్లే తెలంగాణ వచ్చినా, ఆ నింద మరొకరిపై ఎలా వేయగలిగాడో, ఇప్పుడు కూడా ప్రజాగ్రహం తన మీద పడకుండా ముందే బలిపశువులను వెతికి పెట్టుకున్నాడు అని అక్కడే సమాధానం కూడా వచ్చింది. 

                                       అప్పుడే ఏమయ్యింది? ముందుంది ముసళ్ల పండగ. డీ మానిటైజేషన్ అనంతర డిజిటలైజేషన్ లో మేస్త్రీ త్రీడీ సినిమా చూపిస్తాడు మున్ముందు. ఇటుక ఇటుక పేర్చుకుంటూ పబ్లిసిటీ ప్లాస్టింగ్ పూత పూస్తాడు. పూర్వానుభవం ఊరికే పోదు కదా?...