చంద్రబాబు కొరియా ప్రయాణం

1 Dec, 2017 08:17 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియాకు ప్రయాణం కట్టారు. దుబాయి, అమెరికాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు కథ అమరావతికి కాకుండా కంచికి చేరడంతో, తర్వాత స్టంట్ లో భాగంగా కొరియా పర్యటనకు సిద్ధం అయ్యారు. పైగా కొన్నాళ్ల క్రితమే కొరియన్ పారిశ్రామికవేత్తల బృందం వచ్చి చంద్రబాబును కలిసారు. మా అమరావతిని మీ రెండో రాజధాని చేసుకోండి అని వాళ్లని కోరారు చంద్రబాబు. తెల్లబోయారు కొరియన్ బృంద సభ్యులు. తర్వాత చంద్రబాబు అమరభ్రమరావతి గురించి తెలిసి భయభ్రాంతులకు గురై మళ్లీ వస్తామని చెప్పి తిరిగి చూడకుండా పారిపోయారు. దాంతో మిమ్మలన్ని వదల కొరియన్ బాబులూ అంటూ బాబు వాళ్ల వెనకే కొరియాకు ప్రయాణం కట్టారు. 
తిన్నగా ఫైట్ లో కొరియాలో దిగారు. కొరియన్ వీధుల్లో ఊరేగింపుగా తిరగడం, అక్కడి పరిశ్రమలను సందర్శించడం, అధికారులు, నేతలు, పారిశ్రామిక వేత్తలతో చర్చలు ఈ పర్యటనలో ముఖ్యాంశాలు అని ముందుగా నిర్ణయం అయిపోయింది. దీనికి సంబంధించిన వివరాలతో ఎపిలో ఎల్లో పేపర్లు బ్యానర్ ఐటమ్స్ కూడా సిద్ధంగా పెట్టేసుకున్నాయి. ‘కొరియా నుంచి కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు, కొరియా పారిశ్రామిక వేత్తలను అమరావతి రోడ్లను విస్తరించమని, విమానాలను కొనివ్వమని, కొత్త కొత్త కంపెనీలను పెట్టమని కోరిన ముఖ్యమంత్రి - అలాగే అని బాబు నెత్తిన చేయ్యేసి చెప్పిన కొరియన్ పారిశ్రామిక వేత్తలు, బాబు మాకు భూమి పుట్టకముందు నుంచే తెలుసన్న కొరియన్ అధికారులు, కొరియా రాజధానిలా అమరావతి అన్న చంద్రబాబు’ వంటి పతాక శీర్షికలు రెడీ గా పెట్టుకున్నారు.
బాబుగారు ఫ్లైట్ దిగి ప్రత్యేక వాహనంలో కొరియన్ రాజధాని వీధుల్లో ప్రయాణం మొదలెట్టారు. ఎటు చూసినా సైనికులు తప్ప ప్రజలెక్కడా కనిపించలేదు. బాబుగారు తన రెండు వేళ్లను పైకెత్తి సైగ చేసాడు. అది చూసిన భద్రతా దళాలు బాబును చుట్టుముట్టాయి. కొరియన్ భాషలో క్వశ్చన్స్ వర్షం కురిపించాయి. బాబుకు అప్పుడు బోధపడింది. తానొచ్చింది దక్షిణ కొరియా కాదు, ఉత్తర కొరియా అని. కిమ్ జాంగ్ కి సెల్యూట్ చెప్పమని వచ్చిన విమానంలో తిరుగు ప్రయాణం అయ్యాడు చంద్రబాబు.