బాబు చరిత్రలో ఆ ముగ్గురు మహిళలు...
తెలుగు తమ్ముళ్లందరినీ వెంటపెట్టుకుని చినబాబు చంద్రబాబు ముందుకు వచ్చాడు.
ఏమిటి సంగతి అడిగారు బాబు.
మనం ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం ఎవరు? అడిగాడు చినబాబు...!
ఇంకెవరు నేనే...నా స్వయం కృషితో, పట్టుదలతో ఇక్కడిదాకా ఎదిగాను...ఇంకేదో చెప్పబోయిన బాబును మధ్యలోనే ఆపేశాడు చినబాబు.
మైకు ముందుకాదు మనముందు చెప్పు. మనం ఇవాళ ఇలా ఉండటానికి కారణం ముగ్గురు మహాతల్లులు. ఇవాళ మహిళాదినోత్సవం కనుక వాళ్లకు సన్మానం చేద్దాం అన్నాడు.
బాబుకు స్వతహాగా ఎక్కొచ్చిన మెట్లు, మడతల నాలికతో చెప్పిన మాటలు అలవోగ్గా మర్చిపోయే గుణం ఉందికనుక ఆ ముగ్గురు ఎవరా అని ఆలోచనలో పడ్డాడు.
అది గమనించిన లోకేష్ నాన్నారూ మా అమ్మ భువనేశ్వరిని చేసుకోబట్టే కదా మీకు తాత ఎన్టీఆర్ పంచన చేరే లక్కీ ఛాన్సు దక్కింది. లక్ష్మీపార్వతి అమ్ముమ్మ ఉండబట్టే కదా ఆవిణ్ణి సాకుగా చూపి మీరు పార్టీ కబ్జా చేయడానికి అవకాశం చిక్కింది. ఇక మా ఆవిడ బ్రాహ్మణి వల్లే కదా నందమూరి వంశం నుంచి మనకు సీటు పోటీ తప్పింది. ఇక వదిన సుహాసిని వల్లే కదా తెలంగాణా ఎన్నికల్లో నందమూరి సెంటిమెంట్ వాడుకునే అవకాశం కలిగింది. అది వర్కు అవుట్ కాలేదనుకోండి...అయినా సరే వీళ్లందరి వల్లే మనకు, మన కుటుంబానికీ, మన వంశానికీ, మన రాజకీయ జీవితానికి ఎంతో కలిసొచ్చింది. వీళ్లే లేకపోతే మీరు లేరు, మీకు తెలుగుదేశం లేదు. పదవీ లేదు అధికారం లేదు. నాలాంటి వాడికి అడ్డదారిలో మంత్రి పదవీ లేదు. కనక మన అభివఋద్ధికి కారకులైన ఆ మహిళలందరికీ మనం సన్మానం చేయాలి నాన్నారూ...విపులంగా చెప్పాడు చినబాబు.
అవును...చినబాబు చెప్పినట్టు వాళ్లందరికీ సన్మానం చేసి కాళ్లుకడిగి నెత్తిన చల్లుకోవాలి కోరస్ పాడారు తెలుగు తమ్ముళ్లు...
తన చరిత్ర రాసిన కలాలు ఆ మహిళలు అని గుర్తు చేసుకున్న చంద్రబాబు కనీసం వారికి మహిళాదినోత్సవ శుభాకాంక్షలన్నా చెబుతాడో లేదో...!!