పాపం ముగ్గురూ కష్టాల్లో ఉన్నారు..వదిలేయండి

13 May, 2016 16:58 IST
పాపం చంద్రబాబు నాయుడు దేశంలో లేని సమయం చూసుకుని...అందరూ కలిసి ఆయన్ని ఆడిపోసుకోవడం నాకేమాత్రం నచ్చలేదు.
ప్రత్యేక హోదా  కావాలని చంద్రబాబు నాయుడు ఏనాడూ తమని అడగ లేదన్న  సత్యాన్ని బిజెపి కూడా సరిగ్గా ఈ సమయంలోనే బయట పెట్టేసింది.
అసలే  పనామా బినామీ కంపెనీల్లో హెరిటేజ్ డైరెక్టర్ పేరు బయట పడ్డంతో చికాగ్గా ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనలో ఆయన ఏయే దేశాలు తిరుగుతారో  అది ఆయనిష్టం.స్విట్జర్ లాండ్ వెళ్లచ్చు. రాజధాని భూదందాల తాలూకు కిక్ బ్యాక్స్ ఏమన్నా ఉంటే  అక్కడ దాచుకుని రావచ్చు.  కొడుకు లోకేష్ అంది వచ్చాడు కాబట్టి అతనికి కూడా స్విస్ బ్యాంకు ఎలా ఉంటుందో ఓ సారి చూపించి రావచ్చు. ఇలా ఆయన తన సొంత పనుల్లో బిజీగా ఉంటే..ప్రతిపక్షాలేమో ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు తేవడం లేదంటూ చంద్రబాబును నిలదీస్తున్నారు. 
ఇంతకాలం బిజెపి ఇవ్వడం లేదనే అందరూ అనుకున్నారు.
కానీ అసలు తప్పు టిడిపిలోనే ఉందని ఇపుడు తేలిపోయింది.
చంద్రబాబే ప్రత్యేక హోదా కావాలని అడక్కుండా విభజన చట్టంలో ఉన్నవి అమలు చేయండని మాత్రమే అడిగారట. ప్రత్యేక హోదా ను విభజన చట్టంలో పెట్టలేదు కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని బిజెపి అనుకుంటోంది.
ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో 2014 ఎన్నికల్లో ఓట్లు దండుకున్న చంద్రబాబు నాయుణ్ని ఇపుడు అందరూ కలిసి ఇరకాటంలోకి నెట్టేశారు.
అయినా  ప్రత్యేక హోదా పాపం చంద్రబాబు నాయుడు ఒక్కరిదే కాదు కదా.
ఆ మాటకొస్తే బిజెపితో చేతులు కలిపి బిజెపి-టిడిపిలకు ఓటు వేయించిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ అవసరం వచ్పినా తాను ప్రశ్నిస్తానని అన్నారు కదా.
మరి ఆయన ఇపుడు ఎందుకు ప్రశ్నించడం లేదు ? అని చాలా మంది అడుగుతున్నారు.
అయితే వాళ్లు పవన్ కళ్యాన్ సమస్యలను అర్ధం చేసుకోవడం లేదు.
పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అయి ఆయన విషాదంలో ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు..ఎగ్జిబిటర్లూ పవన్ కళ్యాన్ కు ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేకనే ఆయన మరో సినిమా షూటింగ్  పేరు చెప్పి ఎక్కడికో వెళ్లిపోయారు. ఆయన ప్రశ్నిస్తారా లేదా అన్నది తేల్చుకోవాలంటే ముందు ఆయన కనిపించాలి కదా.
ఇక ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కుచ్చుటోపీ పెట్టిన మూడో సింహం వెంకయ్యనాయుడు.
ఎన్నికలకు ముందేమో ప్రత్యేక హోదా మా బాధ్యత అన్నారు నాయుడు గారు.
అధికారంలోకి వచ్చాక  ప్రత్యేక హోదా ఇస్తాం కానీ..కాస్త సమయం పడుతుంది అని నాన్చారు.
ఆ తరవాత యూపీయే ప్రభుత్వం ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదయ్యా బాబూ..మేమేం చేసేది అని ఓ నిట్టూర్పు విడిచి చేతులు దులిపేసుకున్నారు.
కనీసం ఇప్పుడైనా ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పండని వెంకయ్య నాయుడిని అడుగుదామనుకుంటే..ఆయనేమో తన రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోందన్న బెంగలో ఉన్నారు. వచ్చే నెలలో వెంకయ్యనాయుడి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. మరో దఫా రాజ్యసభ కు నామినేట్ చేయాలంటే బిజెపి నియమ నిబంధనలు అంగీకరించవు. అందుకే ఇపుడాయన తన మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అన్న   టెన్షన్లో ఉన్నారు.
ఇలా మూడు సింహాలూ సొంత సమస్యలతో బిజీగా ఉన్నందున ప్రత్యేక హోదా గురించి ఏపీ ప్రజలు మర్చిపోవడం మంచిదని మూడు సింహాల తాలూకు అభిమానులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ఒక వేళ ప్రతిపక్షాలు తమ బాధ్యతను గుర్తు చేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాడతే అవి ఓటు బ్యాంకు రాజకీయాలుగా ప్రచారం చేయాలని   చంద్రబాబు నాయుడు..వెంకయ్యనాయుడులు ఎప్పుడో తమ అనుచరులకు చెవిలో కర్తవ్య బోధ చేశారని కర్ణపిశాచులు అంటున్నాయి.
మరంచేత ఎవరూ గొడవ చేయకండిక