బాబుది బోగస్‌ రిపోర్టు..జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్టు

టంగుటూరు ప్రచారంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 

చంద్రబాబుకు ఓటేస్తే..మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది

ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు

చంద్రబాబు హయాంలో 31 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు

మీ బిడ్డ 58 నెలల కాలంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో చంద్రబాబు రిపోర్టు బోగస్‌ కాదా?, మనది ప్రోగ్రెస్‌ రిపోర్టు 

రుణమాఫీ అంటూ బాబు రైతులను మోసం చేశారు

వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు

రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చాం

గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాం

రైతుల విషయంలో మనది ప్రోగ్రెస్‌ రిపోర్టు

చంద్రబాబు చేసిన అభివృద్ధ ఏమైనా ఉందా?

గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

పెన్షన్లపై బాబు కుట్రలు చేస్తున్నారు

పెన్షన్లు ఇంటి వద్దనే ఇస్తున్న చరిత్ర మీ బిడ్డది:  వైయస్‌ జగన్‌

ప్రకాశం:  వ్యవసాయం, విద్యా, వైద్యం, అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్‌ రిపోర్టు అయితే..మీ బిడ్డ జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్టు అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారన్నారు. మనం 2019లో ఇచ్చిన వాగ్ధానాలు 99 శాతం పూర్తి చేసి ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓటు అడుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేకి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని, సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డకు మద్దతుగా నిలవాలని, రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కి ఆశీర్వదించాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

 నాయకుడు అంటే నమ్మకం కలిగించాలి.
ఈరోజు మీ అందరితో, మీ అందరి సమక్షంలో నిల్చుని మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఒక మాట చెబితే చేస్తాడు అనే నమ్మకం ఆ నాయకుడి మీద ఉండాలి. మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇన్నాళ్లు అంటే ఈ 58 నెలలుగా సీఎంగా మీకు మంచి చేసి.. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒకవైపున ఉన్నాడు. మరోవైపు గతంలో 14 ఏళ్లు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకూ కూడా తాను చేసిన ఏ మంచీ కూడా గుర్తుకురాని మరో పెత్తందారీ అటువైపున ఉన్నాడు. 

మీ ఓటు పేదవాడి తలరాతను మార్చబోతుంది.
ఈరోజు నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు జరగబోతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతున్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కోసంమీరు ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవావి భవిష్యత్తు, తలరాతలను మార్చబోయేదే మీరు వేసే ఓటు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తెరగమని కోరుతున్నాను. మీ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది? మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకా అంటూ మళ్లీ 5 ఏళ్లు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తుడుతుంది. ప్రతి ఒక్కరూ గమనించమని మీ అందరితో కోరుతున్నాను. 

బాబుది బోగస్ రిపోర్ట్- మీ జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్.
ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది, ఎవరు ఎలాంటి నాయకుడు, ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఎవరు వంచనలు, మోసాలు చేసే నాయకుడు అన్నది మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను.ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో తేల్చేద్దామా? అని మీ అందరినీ కూడా అడుగుతున్నాను. ఎవరి రిపోర్టు ఏమిటో చూద్దామా? ఎవరిది భోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చేద్దామా? మామూలుగా ఏమంటారు? ఈ ఎల్లో మీడియా ఏమంటుంది. చంద్రబాబు తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు. బాబు వస్తే జాబొస్తుందని ఈ పెద్దమనిషి చంద్రబాబు ఊదరగొట్టారు. గుర్తున్నాయా? 2014లో ఈయన అన్న మాటలు గుర్తున్నాయా? జాబు రావాలంటే బాబు రావాలన్న మాటలు గుర్తున్నాయా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఆరోజు చంద్రబాబు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.

బాబు కేవలం 32వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తే- మీ జగన్ హయాంలో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ.
మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఆ పెద్దమనిషికి ఓటేస్తే ఏం జరిగింది? చంద్రబాబు హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నోతెలుసా? కేవలం ముష్టి వేసినట్లు 32 వేలు ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే... ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఏకంగా  మరో 2.31 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు.  

ఈ 2.31 లక్షల ఉద్యోగాలు పొందిన వీరంతా కూడా మన గ్రామ సచివాలయాల్లో, మనమెరుగు పడిన ఆస్పత్రులు, మన బాగుపడిన స్కూళ్లలో కనిపిస్తున్న మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్లు. నేను అడుగుతున్నాను. బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా? ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు కళ్లెదుటే కనిపిస్తున్న రిపోర్టు కాదా? 

బ్యాంకుల్లో బంగారం వేలం వేయించిన బాబు
రైతుల విషయంలో మరొక విషయం కూడా చూద్దామా? రైతుల  వ్యవసాయం విషయంలో బాబు రిపోర్టు ఏమిటో జగన్ రిపోర్టు ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా? సూటిగా చంద్రబాబు నాయుడినే అడుగుతున్నాను. ఓ బాబూ.. ఓ చంద్రబాబూ.. రైతు రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశావా? అని అడుగుతున్నాను. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? అని ఈ పెద్దమనిషిని చంద్రబాబును అడుగుతున్నాను. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపించకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు. 

ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏరోజైనా ఇచ్చాడా అని అడుగుతున్నాను. రైతులకు సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఉందా? సున్నా వడ్డీకే రుణాలు ఈ పెద్దమనిషి ఇచ్చాడా? లేక ఎగరగొట్టారా? పెట్టుబడికి సాయంగా రైతు భరోసాగా ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజైనా ఏ ఒక్క రైతుకైనా.. రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా? 

సాగు దండగన్న బాబూ- రైతులపై కాల్పులు జరిపించింది నువ్వు కాదూ.
వ్యవసాయం దండగ అని నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా ఓ చంద్రబాబూ? అని అడుగుతున్నాను. రైతులపై బషీర్ బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా? రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబూ? రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబూ? ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన చంద్రబాబూ రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా? 

రైతులకు జగనేం చేశాడో చూద్దాం
మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు? వ్యవసాయానికి ఏం చేశాడు అన్నది కూడా చూద్దామా? పెట్టుబడికి సాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ కాదా? సకాలంలోనే ఇన్ పుట్ సబ్సిడీ, సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నది ఈ 58 నెలల్లోనే కాదా? గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా? 9 గంటలు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఇ- క్రాప్ చేసి మరీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సలహాలు, దళారీలు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కాదా? 

మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్. రైతన్నకు కళ్ల ఎదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టు. మరి బాబు చేసింది ఏమిటి? బాబు చేసింది బోగస్ రిపోర్టు కాదా? అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇంకొక విషయం చూద్దామా? డెవలప్ మెంట్ విషయం చూద్దాం. బాబుకు సంబంధించిన ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లంతా ఏమంటారు? చంద్రబాబును ఏమంటారు డెవలప్ మెంట్ కింగ్ అంట. పోనీ చూద్దామా? చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా? 

నిజానికి బాబు చేసిన డెవలప్ మెంట్ ఏమైనా ఉందా? మీరే చూడండి. మీ జగన్ లా గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మక మార్పులు తెస్తూ ఏకంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు కట్టిందెవరు అని అడుగుతున్నాను.

మీ జగన్ లా ఈరోజు 11 వేల విలేజ్, వార్డు క్లినిక్ లు ఈరోజు గ్రామాల్లో కనిపిస్తున్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబును. ఈరోజు గ్రామంలో జగన్ లా 11 వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయంటే కట్టింది ఎవరు అని ఈరోజు చంద్రబాబు నాయుడును అడుగుతున్నాను. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతున్న డిజిటల్ లైబ్రరీలు. ఇవన్నీ జరుగుతున్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. 

ఈరోజు గ్రామాల్లో నాడు-నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి, గవర్నమెంట్ ఆస్పత్రులు బాగుపడ్డాయి. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఇదే చంద్రబాబును అడుగుతున్నా..  జగన్ లా 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టావా? మీ జగన్ లా 4 కొత్త సీ పోర్టులు నువ్వు కట్టావా? మీ జగన్ లా 10 ఫిషింగ్ హార్బర్లు నువ్వు కట్టావా?  జగన్ లా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నువ్వు కట్టావా? మీ జగన్ సర్ఫేజ్ వాటర్ ను సైతం తీసుకొస్తూ ఉద్దానం సమస్యను తీర్చాడు. వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకు వచ్చింది కూడా మీ జగన్ కాదా? జగన్ లా ఎయిర్ పోర్టుల విస్తరణ నువ్వు చేశావా?  జగన్ లా భోగాపురం ఇంటర్నేషనల్ పరుగులు నువ్వు తీయించావా? జగన్ లా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు 10 ఇండస్ట్రియల్ నోడ్లు ఇవన్నీ కూడా నువ్వు పరుగెత్తించావా?  జగన్ లా ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా నువ్వు సపోర్ట్ చేశావా?  జగన్ లా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఓ రైతు భరోసాగానీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, లా నేస్తం వంటి పథకాలతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏరోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు చేశావా చంద్రబాబూ అని అడుగుతున్నాడు మీ జగన్. 

మరి ఇదే చంద్రబాబు.. డెవలప్ మెంట్ కింగ్ ఎలా అవుతాడు అని అడుగుతున్నాడు మీ జగన్ ఈరోజు. అంటే డెవలప్ మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది బోగస్ రిపోర్టు. 58 నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్ల ఎదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్టు. అన్నింటికీ మించి ఓ బాబూ.. ఓ చంద్రబాబూ.. ఇంటింటా ప్రతి కుటుంబం బాగుపడేలా పేదరికం సంకెళ్లను తెంచుకునే విధంగా పిల్లల చదువులు బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబూ అని అడుగుతున్నాడు మీ జగన్. 

నీ కళ్లకు పచ్చకామెర్లా చంద్రబాబూ...
ఓ చంద్రబాబూ నీ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? ఓ చంద్రబాబూ బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే పథకాన్ని ఏరోజైనా నువ్వు పెట్టావా అని అడుగుతున్నాడు మీ జగన్. ఆ పేదింటి పిల్లలకు ఇంగ్లీషు మీడియం, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, 8వ తరగతికి వచ్చే సరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం.. 3వ తరగతి నుంచే టోఫెల్, బైజూస్ కంటెంట్ వంటివి కరిక్యులమ్ లో భాగంగా ఈరోజు కనిపించడం లేదా చంద్రబాబూ? పచ్చకామెర్లు వచ్చాయా నీ కళ్లకు అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

పూర్తి ఫీజులు చెల్లిస్తూ తల్లులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, పెద్ద చదువులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కరిక్యులమ్ లోకి భాగం చేస్తూ మొట్ట మొదటిసారిగా ఆన్ లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను.. ఇవన్నీ తీసుకొచ్చింది ఎప్పుడు అంటే ఈ 58 నెలల కాలంలోనే కాదా? అని మీ బిడ్డ మీ అందరి సమక్షంలో అడుగుతున్నాడు. మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా? కళ్ల ఎదుటే కనిపిస్తున్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా? 

పెన్షన్లపై బాబు కుట్రలు...
మీ అందరితో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను, ఈ బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం చూడండి. పెన్షన్ల విషయంలో బాబుకు కుట్రలను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్కరోజైనా అవ్వాతాతల కష్టాన్ని, బాధలను ఏరోజైనా పట్టించుకున్నాడా? పెన్షన్ ను ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్కరోజైనా జరిగిందా? మరి ఈరోజు ఎన్నికలు వచ్చే సరికే మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి, ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా? ఇప్పుడు తీరా తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబునాయుడును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని ఈ పెద్దమనిషి చంద్రబాబు మళ్లీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తుంటే.. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

ఎవరు మనసున్న మనిషో ఆలోచన చేయండి.
ఆలోచన చేయమని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం రూ.1,000. ఈరోజు మీ బిడ్డ ఇస్తున్న పెన్షన్ ఎంత? రూ.3,000. మరి ఎవరికి మనసుంది? చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజైనా ఆ అవ్వాతాతల బాధ చూశాడా? ఆ అవ్వాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా? ఈరోజు ఆ అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తున్నది ఎవరు? 

అక్కచెల్లెమ్మల సాధికారత విషయంగా.. జగన్ అక్కచెల్లెమ్మలను చూసుకున్నట్టు.. ధ్యాస పెట్టినట్టు చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం ఏ ఒక్కరోజైనా చేశాడా? నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని, వారి ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక, జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్ట మొదటిసారిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు..నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తోంది. మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజూ కూడా ఇలా బటన్లు నొక్కి ఏ ఒక్క పథకం ద్వారా ఇలా అక్కచెల్లెమ్మలకు మంచి చేసిన చరిత్ర ఎందుకు లేదు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. 

చంద్రబాబు ధ్యాస దోచుకోవడం- పంచుకోవడం పైనే...
కారణం చంద్రబాబు నాయుడు గారి ధ్యాస అక్కచెల్లెమ్మలకు మంచి చేయడం మీద కాదు. చంద్రబాబు నాయుడు గారి ధ్యాస దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మీద తన ధ్యాస కాబట్టి అక్కచెల్లెమ్మలకు ఏ రోజూ న్యాయం జరగలేదు. ఈరోజు మీ అందరినీ అడుగుతున్నాను.

ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి మోసం ఇది గుర్తుందా మీ అందరికీ. గుర్తుందా అక్కా. గుర్తుందా అన్నా. పెద్దమ్మా ఇది నీకు గుర్తుందా (మేనిపెస్టో చూపిస్తూ). 
2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు గుర్తుందా? ఒకసారి చదవమంటారా? ఆయన చెప్పినవి కనీసం ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్నే అడుగుతాను. 

రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్లు రైతు రుణాలు మాఫీ అయ్యాయా? ఆ చంద్రబాబు నాయుడు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. రూ.14,205 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఇదే పెద్దమనిషి చంద్రబాబు. నేను అడుగుతున్నా ఇంత మంది మీరు ఇక్కడున్నారు కదా.. ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా? 

ఇంటికో ఉద్యోగం, ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు నెలకు రూ.2వేల చొప్పున రూ.1.20 ఎవరికి ఇచ్చాడు అని  మీ బిడ్డ అడుగుతున్నాడు.
ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. మరి ఇంత మంది ఇక్కడ ఉన్నారు కదా. మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. ఎక్కడన్నా కొండెపిలో కనిపిస్తోందా? మరి ఆలోచన చేయమని కోరుతున్నాను. 

ముఖ్యమైన హామీలంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మరి నేను అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అది కూడా అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వారిని నమ్మొచ్చా? అని అడుగుతున్నాడు మీ బిడ్డ.
మరి ఇదేముగ్గురు ఇప్పుడేమంటున్నారు. సూపర్ సిక్స్ అంటున్నారు. సూపర్ సెవెన్ అంటున్నారు అవ్వా.. ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు అన్నా.. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తారంట అన్నా.. నమ్ముతారా? 
పేదవాడి భవిష్యత్ మారాలంటే ఫ్యానుకే ఓటేయండి.
అందరినీ ఆలోచించమని కోరుతూ.. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్లు మెరుగు పడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?.. 

మన గుర్తు.. ఫ్యాను. ఇక్కడో అక్కడో ఎక్కడో తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు.. అక్కా, అవ్వా, అక్కడ అవ్వా.. మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను. పెద్దమ్మా మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాను.మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మన పార్టీ తరపున నిలబడిన అభ్యర్ధులను ఆశీర్వదించవలసిందిగా మీ ఆ అందరినీ సవియనంగా ప్రార్ధిస్తున్నాను అని తెలియజేస్తూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top