విశాఖ: ఎన్ని పార్టీలు కలిసినా రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయమని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తొలి విడత సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో ఈ నెల 30 వరకు రెండో విడత బస్సు యాత్ర జరుగనుందని చెప్పారు. ఇవాళ నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర మొదలవుతుందని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 70 శాతం పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ ప్రభుత్వం అందించిందన్నారు. సాధికార యాత్రలో నాడు–నేడు పనులను పరిశీలిస్తున్నామని, ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని చెబుతున్నామన్నారు. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నాడు–నేడుపై బురద జల్లే పనిలో జనసేన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.