అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడత పెడతారు?

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ‌: అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడత పెడతారని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు. మాకు షర్ట్స్ ఉన్నాయి కాబట్టి మేం మడత పెడతామ‌న్నారు. విశాఖ‌లో అతిపెద్ద వైయ‌స్ఆర్‌ సీపీ జెండాను  వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిలో అతిపెద్ద జెండాను ఆవిష్కరించడం సంతోషం అని అన్నారు. మరోసారి విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని వైవీ స్పష్టం చేశారు. కోర్టులో చిన్న చిన్న అడ్డంకులు ఉండడం వలన పరిపాలన రాజధానిగా విశాఖ ఆలస్యమైందని తెలిపారు. కేసులు వేసి విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంది చంద్రబాబేనని దుయ్యబట్టారు. ఇప్పటివరకు వైయ‌స్ఆర్‌ సీపీ ఏడు జాబితాల అభ్యర్థులను విడుదల చేసింది.. జనసేన, టీడీపీలకు అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని ఆరోపించారు. చంద్రబాబు ఒక్కొక్క పార్టీతో ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలు నమ్మరని సుబ్బారెడ్డి తెలిపారు.  
రాజ్యసభలో టీడీపీకి ఒక్క సీటు కూడా లేకుండా పోయింది..వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇదే పరిస్థితి ఉంటుంద‌న్నారు.  "విధ్వంసం" పుస్తకం రాసిన వాళ్లు, ఆవిష్కరించిన వాళ్లను చూస్తేనే దాని వెనుక విద్వేషం అర్దం అవుతోంద‌ని పేర్కొన్నారు.  

Back to Top