తాడేపల్లి: విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 12న చేపట్టనున్న "యువత పోరు" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, వైయస్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం "యువత పోరు" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను వైవి సుబ్బారెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) మాట తప్పింది. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం. యువత పోరును విజయవంతం చేద్దాం’’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే.. ఈ మూడింటి కోసమే ‘యువత పోరు’: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మూడు ప్రధాన హామీలు అమలు చేయని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయని కారణంగా విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసగిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా, జగన్‌గారు ముందుచూపుతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభించారు. మిగతా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కల్పించకుండా పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలా వైద్య విద్య చదవాలన్న పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఈ మూడు అంశాలపై యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలవడానికి, ఈనెల 12న వైయస్ఆర్‌సీపీ ‘యువత పోరు’ పేరిట పేరిట రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఇదీ ఆ కార్యక్రమం: ఆ రోజున అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారు. ధర్నా అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. యువతకు చంద్రబాబు దగా: గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించి, విద్యాదీవెన పథకం అమలు చేస్తే, టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ భృతి పేరిట చంద్రబాబు మరోసారి యువతను మోసగించారు. గతంలో 2014–19లో ఇదే హామీ ఇచ్చి మోసగించిన చంద్రబాబు, ఈసారి కూటమి ప్రభుత్వంలో కూడా మళ్లీ అలాగే మోసం చేస్తున్నారు ఏటా 4 లక్షల ఉద్యోగాలిస్తామని, అలా ఇచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి, అమలు చేయడం లేదు. వరసగా రెండు బడ్జెట్లలోనూ ఇందుకోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దేశంలో ఏ రాష్ట్రమైనా సరే, కొత్తగా మెడికల్ సీట్లు కోరుకుంటుంది. కానీ, మన దగ్గర మాత్రం విచిత్రంగా తమకు మెడికల్ సీట్లు వద్దని, ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు నిర్వహించలేమని ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. పులివెందుల కాలేజీకి కేటాయించిన సీట్లు రద్దు చేయాలని భారత వైద్య మండలి (ఎంసీఐ)ని కోరడంతో పాటు, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే చర్యలు మొదలుపెట్టింది. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. అందుకే యువత పోరు పేరుతో ఆందోళన కార్యక్రమం చేపట్టాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం: మార్చి 12వ తేదీ, వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం. అందుకే ఆరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్న తర్వాత, పార్టీ శ్రేణులంతా ర్యాలీగా యువత పోరు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ శ్రేణులంతా ఇప్పట్నుంచే సమాయత్తం కావాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.