విష ప్రచారాలు చేసిన వారిని శిక్షించండి

వైయస్‌ షర్మిలపై దుష్ప్రచారాలను నిరసిస్తూ తిరుపతిలో ధర్నా

తిరుపతి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిలపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్‌ చేశారు. తిరుపతి బస్టాండ్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఐక్య దళిత మహానాడు, వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ మరణించిన నాటి నుంచి ఆ కుటుంబంపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తూ క్షోభపెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించారని, అంతటితో ఆగకుండా మహిళలను కూడా టార్గెట్‌ చేస్తున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగే అసత్య ప్రచారాలు చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ కుటుంబాన్ని క్షోభపెట్టి ఎలాగైనా విజయం సాధించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇలాంటి విషప్రచారాలు చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. ప్రజల్లో వైయస్‌ జగన్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉందని, రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులపై దుష్ప్రచారాలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వైయస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను అరికట్టాలని, విష ప్రచారాలు చేస్తున్న వారిని వెంటనే శిక్షించాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చింతమనేని లాంటి వారిని శిక్షిస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. 

 

Back to Top