12న 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం

విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి సర్కార్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసే వరకు పోరు

నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచారు

నిరుద్యోగభృతి పేరుతో మరో వంచన

కూటమి సర్కర్ వైఫల్యాలను ఎత్తిచేపేలా వైయస్ఆర్‌సీపీ నిరసనలు

అన్ని వర్గాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు

పల్లెపల్లెలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు 

ప్రజల్లో పార్టీకి ఉన్న పట్టును చాటుకునేలా కార్యక్రమాలు

ఉత్సాహంగా కార్యకర్తులు, నాయకులు పాల్గొనాలి: స‌జ్జల రామకృష్ణారెడ్డి పిలుపు

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడిన పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఈనెల 12న చేపట్టిన 'యువత పోరు' ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్దులను వెళ్ళగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటీస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ కు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకాన్నికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైయస్‌ఆర్‌ బాటలో మరో రెండడుగులు ముందుకు వేసిన వైయస్ జగన్ గారు 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది.

నిరుద్యోగులను అడుగడుగునా వంచిస్తోంది

కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగభృతి చెల్లిస్తానంటూ ఇచ్చిన హామీ ఏమయ్యింది? ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటుపరంకు కుట్ర

ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేరసేందుకు వైయస్‌ఆర్‌సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తయ్యి, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలుల 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైయస్ఆర్‌సీపీ యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైయస్‌ఆర్‌సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైయస్సార్సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి. 

వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు

ఈనెల  12వ తేదీ వైయస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
 

Back to Top