సంబ‌రాల పేరుతో రాష్ట్రంలో దోపిడీ

డ్రగ్స్..రేవ్ పార్టీలు..రికార్డింగ్ డ్యాన్స్‌..పేకాట‌..గుండాట‌

సంక్రాంతికి కూట‌మి స‌ర్కార్ స‌రికొత్త నిర్వ‌చ‌నం

రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా  

తూర్పు గోదావ‌రి:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కార్ సంక్రాంతి పండుగ‌కు స‌రికొత్త నిర్వ‌చ‌నం తీసుకువ‌చ్చార‌ని వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మండిప‌డ్డారు. అధికార పార్టీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో సంక్రాంతి వేడుక‌ల్లో డ్ర‌గ్స్, రేవ్ పార్టీలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేసి భ్ర‌ష్టుప‌ట్టించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..సంక్రాంతి సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సంక్రాంతికి కొత్త నిర్వచనం తీసుకువ‌చ్చార‌ని దుయ్య‌బ‌ట్టారు.  నారావారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు, గుండాటలు జరిగాయ‌న్నారు. 

ఇదేనా మీ మేనిఫోస్టో..?
ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి నేత‌లు సూప‌ర్ సిక్స్ అంటూ ఊద‌ర‌గొట్టార‌ని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతున్నా..సూప‌ర్ సిక్స్ లేదు..సెవెన్ లేద‌న్నారు. సంప‌ద సృష్టిస్టామ‌ని చెప్పి..ప్ర‌జ‌ల నుంచి ముక్కు పిండి వ‌సూళ్లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఒక్కో మహిళకు నెలకు 15వేలు చొప్పున ఆర్థిక సాయం అన్నారు. కూట‌మి మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కింది. కోడిపందాలు..రికార్డింగ్ డాన్సులు...మద్యం అమ్మకాలు..ఇవే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చూసినట్టు కోడిపందాలను ప్రీమియర్ లీగ్ లా నిర్వహించి ... పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా వసూలు చేశార‌ని త‌ప్పుప‌ట్టారు. రాజానగరం నియోజకవర్గంలో భూపాలపట్నం లో  డ్రగ్స్... రేవ్ పార్టీలు.. రికార్డింగ్ డాన్సులు  విచ్చలవిడి సంస్కృతి తీసుకొచ్చార‌ని ఆక్షేపించారు. అనకాపల్లిలో గంజాయి దొరికితే రాజానగరం నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన జనసేన నేతలు మూలాలు ఉన్నాయ‌ని చెప్పారు. గంగాధర్ అనే వ్యక్తి గుండాటలో డబ్బులు పోయాయని, పెరవలిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. బహిరంగంగా పోలీసులను కూడా అధికార పార్టీ నేత‌లు వేదికలపై నుండి బయటకి గెంటేస్తున్నారు...ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గాల్సి వస్తుంద‌న్నారు.  కొన్నిచోట్ల సంక్రాంతి కి అసలు పోలీసులు ఉన్నారా లేరా అనే ప్రశ్న తలెత్తింద‌న్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో... సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎంపవన్ కళ్యాణ్ మనస్సాక్షిగా ఆలోచించుకోవాల‌ని మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా సూచించారు.  

Back to Top