శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం రాత్రి శ్రీకాకుళం రూరల్ మండలంలోని నైరా గ్రామంలో ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో నవరత్నాలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్నాయన్నారు. పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు ‘పల్లె నిద్ర’ చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం 46 నెలలుగా అందిస్తున్న పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని ప్రజలు సంతోషంగా చెబుతున్నారని తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. గృహ సారథుల నుంచి సీఎం వైయస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను తీసుకుని ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు అతికించి తమ నమ్మకం, భవిష్యత్తు, అంతా జగనన్నే అంటూ నినదిస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడూ, ఇప్పుడూ ఒకటే బడ్జెట్ ఉన్నా, 2014-19 మధ్య చంద్రబాబు, దుష్టచతుష్టయం రూ. 2 లక్షల కోట్లను మూడున్నర సంవత్సరాల్లోనే ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా దోచుకో.. పంచుకో.. తినుకో.. (డీపీటీ) స్కీం ద్వారా అడ్డంగా తినేశారని, అదే వైయస్ జగన్ పాలనలో మూడున్నరేళ్ళలోనే రూ. 2 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్(డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా బ్యాంకు అకౌంట్లకు, చేతికి అందిందని స్పష్టం చేశారు.
