తాడేపల్లి: మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే నీచ చరిత్ర చంద్రబాబుదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. పార్టీ ఉనికి కాపాడుకునేందుకు టీడీపీ గోబెల్స్ ప్రచారానికి తెరతీసిందని, టీడీపీ నాయకురాలు అనితకు వైయస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి, అర్హత లేదని హెచ్చరించారు. మహిళలను అడ్డం పెట్టుకొని స్వర్గీయ ఎన్టీఆర్ కుర్చీని లాక్కున్న నీచ చరిత్ర చంద్రబాబుదన్నారు. టీడీపీ హయాంలో మహిళలకు ఆదరణే లేదు, బాబు పాలనలో మహిళలు అన్యాయాలకు గురయ్యారని, మహిళా ద్రోహి చంద్రబాబు గురించి తెలుసుకోకుండా పచ్చ పైత్యంతో బాబు మెప్పు కోసం ప్రభుత్వంపై అనిత ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏపీలో అదృశ్యమైనవారు 2,705 మంది మాత్రమే అని తెలుసుకోవాలన్నారు. ఏదైనా ఆరోపణలు చేసేముందు ఆలోచన చేసి మాట్లాడాలని సూచించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనిత గడ్డి తినే మాటలు మాట్లాడుతుంది. సుపరిపాలన అందిస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. మహిళా మిస్సింగ్ కేసుల్లో ఏపీ 13వ స్థానంలో ఉందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలను సీఎం వైయస్ జగన్ నడిపిస్తున్నారు. మహిళలకు రక్షణగా దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో మహిళా పోలీస్‌ను కూడా నియమించారన్నారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ పరిపాలనలో మహిళలు మహారాణుల్లా జీవిస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్ సొంతమన్నారు. దళిత మహిళను హోంశాఖ మంత్రిని చేసిన చరిత్ర వైయస్ జగన్‌దన్నారు. కౌన్సిల్‌లో మైనార్టీ మహిళలను డిప్యూటీ చైర్మన్‌గా నియమించారని గుర్తుచేశారు. మహిళా సంక్షేమంలో దేశానికి సీఎం వైయస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక టీడీపీ నేతలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలంతా జగనన్నకు అండగా ఉన్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. 2019లో 6,896 మిస్సింగ్ కేసులు నమోదైతే, అందులో 6,583 కేసుల్లో మహిళల అచూకీని కనిపెట్టి తెచ్చారు. అదే 2020లో 7,576 మిస్సింగ్ కేసులు నమోదైతే, వాటిల్లో 7,195 కేసుల్లో బాధితుల్ని గుర్తించి పోలీసులు రక్షించారు. 2021ల్లో 10వేలు మిస్సింగ్ కేసులు నమోదు కాగా అందులో 9,621 కేసుల ఆచూకీ లభించింది. ఆ నివేదిక ప్రకారంగా చూస్తే.. 2019 నుంచి 2021 మధ్య నమోదైన మహిళల అదృశ్యం కేసులు 24, 557 ఉంటే.. వాటిల్లో 23,399 కేసుల్ని గుర్తించి బాధిత మహిళలకు పోలీసులు భద్రత కల్పించారు. అంటే, ఈ మూడేళ్లలో 1158 కేసుల్లో మాత్రమే మహిళల ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. టీడీపీ మహిళల్ని వంచించిన పార్టీ. ధుర్యోధన, దుశ్శాసునుల పార్టీ అది. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి అనే విదార్థిని, ఒక ప్రొఫెసర్ కులోన్మాదానికి బలైతే దాన్ని ర్యాగింగ్‌బూతంగా బాబు చిత్రీకరించాడు. అప్పట్లో మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు అంతేలేదు. ఆయన హయాంలో మహిళల వేధింపుల్లో రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో ఉండగా, మహిళల అక్రమరవాణాలో రెండోస్థానంలో ఉంది. ఆనాడు టీడీపీ ముసుగులో ఉన్న కీచకులు, దుశ్శాసునులు చాలామంది అరాచకపర్వం నడిపారు. కనుకనే, ఆ ప్రభుత్వం పట్ల విసిగివేసారిన మహిళలు 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి బాబుకు తగిన బుద్ధి చెప్పారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన ఆయన పార్టీ ఎమ్మెల్యేలే విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ నడిపి వార్తల్లోకెక్కగా.. దెందులూరు ఎమ్మెమల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా తహశీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టాడు. దీనిపై అప్పట్లో వనజాక్షి సీఎం కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. తిరిగి ఆమెనే బాబు మందలించి పంపిన ఘటన అందరికీ తెలిసిందే కదా..? ఈ ఉదంతాన్ని మహిళలెలా మరిచిపోతారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన వారి అరాచకపర్వం చెప్పాలంటే అంతాఇంతా కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు మహిళల పుట్టుకనే అవమానించాడు. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా..?’ అని మాట్లాడిన దుర్మార్గుడు చంద్రబాబు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఒకవైపు అలాఉంటే, మరోవైపు మహిళా సోదరీమణులను చంద్రబాబు మోసం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. డ్వాక్రా రుణాలపై వడ్డీని, అసలును కూడా తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని చంద్రబాబు హామీనిచ్చాడు. ముఖ్యమంత్రి కాగానే తానిచ్చిన మాటను దాటేసి.. రుణమాఫీ చేయలేని మహిళాద్రోహి చంద్రబాబు. ఈ విషయంపై రాష్ట్రంలోని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఇప్పటికీ తిట్టుకున్నారని లోకేశ్ తన యాత్ర ద్వారా గుర్తించాలని మనవి చేస్తున్నాను. మహిళల్ని ఉద్దరిస్తామని బాబు, లోకేశ్‌లు తేనెపలుకులు పలికినంత మాత్రాన ఎవరూ నమ్మరు గాక నమ్మరు. లేనిపోని అభూతకల్పనల్ని అల్లి పచ్చమీడియాలో విషపురాతలు రాయించి.. వాటిపై మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధిచెబుతారు. మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్‌కళ్యాణ్ మహిళల మిస్సింగ్, వాలంటీర్లే కారణం అంటూ.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఆయనొక పొలిటికల్ టూరిస్ట్. ప్యాకేజీ తీసుకున్నాననే ఉన్మాదంతో మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఆరోపించినంత మాత్రాన ఆయన మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెబుతున్నాను. ఇచ్చిన మాటకు కట్టుబడటమనేది రాజకీయాల్లో ఒక్క వైయస్ జగన్‌లోనే చూస్తాం. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఈరోజు మహిళలు ఆకాశంలో సగం.. అవనిలో సగంలా అన్నిరంగాల్లోనూ ముందంజలోనే ఉన్నారు. సీఎం వైయస్ జగన్ మహిళలకు ఒక అన్నగా, తమ్ముడిగా కొండంత అండనిచ్చి ధైర్యమిచ్చిన ముఖ్యమంత్రి అని రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆదరణ పొందుతున్నారు. డీబీటీ, నాన్‌డీబీటీ ద్వారా మహిళా సోదరీమణులకు సుమారు రూ.3.5 లక్షల కోట్ల లబ్ధిని నేరుగా అందించారు. అదేవిధంగా నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవుల్లోనూ 55 శాతం మహిళా రిజర్వేషన్‌ను అమలు చేస్తున్న ఏకైక ఒక్క ఆసరా పథకం ద్వారానే రూ.24వేల కోట్లు చెల్లించిన మహిళా పక్షపాతి సీఎం వైయస్ జగన్ నిలిచారు. వైయస్ జగన్ ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే ఈ చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ యాత్రల పేరిట విమర్శలకు పాల్పడుతున్నారు. మరోవైపు పచ్చమీడియాలో విషపురాతలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మహిళల్లో ఈ ప్రభుత్వానికి ఉన్న మంచిపేరును చెరిపేయలేరని గుర్తుచేస్తున్నాను. దేశానికే రోల్‌మోడల్‌గా ఉండే విద్యా విధానాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. ఈరోజు మహిళారక్షణకు సంబంధించి దిశయాప్‌ను 1.40 కోట్లమంది మహిళలు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఎక్కడైనా అఘాయిత్యం చోటుచేసుకున్న క్షణాల్లోనే దిశయాప్‌తో బాధితులు రక్షణ పొందుతున్న సంఘటనల్ని అనేకం చూస్తున్నాం. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రెండువేల జనాభా ఉన్న ప్రతీచోట మహిళా పోలీసులును నియమించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతోనే అందిస్తున్నాం. జగనన్న అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. అందుకే, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలు, మేధావులంతా వైయస్ జగన్ వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. 2024లో 175 స్థానాలకు 175 స్థానాలూ వైయస్‌ఆర్‌సీపీకి ఇచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.