ఎగ్జిట్‌పోల్స్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భంజ‌నం

ఏపీలో వైయ‌స్అర్‌సీపీదే అధికారం

వైయ‌స్ జ‌గ‌నే నూతన ముఖ్యమంత్రి  

135కి పైగా అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో గెలుపు తథ్యం

అన్ని జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు, మీడియా సర్వేల్లో వెల్లడి 

అమరావతి: ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వే ఫలితాలే ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ ప్రతిబింబించాయి. ప్రతిపక్ష నేత,  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు  వైయ‌స్‌ జగన్‌మోహ‌న్‌రెడ్డికి  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు చేపట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. దేశవ్యాప్తంగా తుదివిడత పోలింగ్‌ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియగానే ఎన్‌డీటీవీ, టైమ్స్‌ నౌ, రిపబ్లిక్‌ టీవీ – జన్‌కీ బాత్, ఇండియాటుడే, మిషన్‌ చాణక్య, ఆరా, సీపీఎస్, ఏబీపీ నీల్సన్‌ మార్గ్‌ , సీఎన్‌ఎన్‌ న్యూస్‌ –18, ఐ పల్స్, కేకే సర్వీస్‌  తదితర సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందని, కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే అధికార పగ్గాలు చేపడుతుందని అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్‌ జగన్‌ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీకి మూడింట రెండొంతులకుపైగా మెజార్టీ ఖాయమని తెలిపాయి. 
ఫలితాలు ఏకపక్షం..
ప్రతిష్టాత్మక ఇండియాటుడే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 130–135 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 37–40 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. జనసేనకు ఒక్క సీటు లేదంటే అది కూడా రాకపోవచ్చని విశ్లేషించింది. ఇక ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీకి 18–20, టీడీపీకి 4–6 వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు ఒక స్థానం దక్కే అవకాశం కూడా ఉందని తెలిపింది.  టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 98 అసెంబ్లీ సీట్లు లభించగా టీడీపీకి 65 సీట్లు రావచ్చని తెలిపింది. జనసేనకు 2 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వైఎస్సార్‌ సీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది. వీడీపీ అసోసియేట్స్‌ వైఎస్సార్‌సీపీకి 111–121 స్థానాలు, టీడీపీకి 54–60 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో తెలిపింది. ఇతరులు 4 చోట్ల గెలుపొందవచ్చు.
వైఎస్సార్‌సీపీ 133 నుంచి 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పేర్కొంది. అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లకే పరిమితమవుతుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. జనసేన సున్నా లేదా ఒక్క స్థానంలో గెలుపొందే అవకాశం ఉంది. ‘ఆరా’ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ 126 సీట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీకి 47 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని పేర్కొంది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ 20–24 చోట్ల, టీడీపీ 1–5 చోట్ల గెలుపొందే అవకాశాలున్నట్లు తెలిపింది. కేకే సర్వేస్‌లో వైఎస్సార్‌ సీపీకి 130–135 సీట్లు లభించాయి. టీడీపీ 30–35 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులు 10–13 చోట్ల గెలుపొందే అవకాశాలున్నట్లు పేర్కొంది. మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌ సీపీకి 98 స్థానాలు దక్కగా, టీడీపీకి 58 సీట్లు వచ్చాయి. ఇతరులు 7 చోట్ల నెగ్గే అవకాశం ఉంది. 
ఎంపీ స్థానాల్లోనూ ‘ఫ్యాన్‌’ ప్రభంజనం
రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ 13–16 ఎంపీ సీట్లను వైఎస్సార్‌ సీపీ గెలుస్తుందని,  టీడీపీ 8–12 సీట్లలో నెగ్గుతుందని తెలిపింది. సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌ సీపీకి 13–15 ఎంపీ సీట్లు లభించగా టీడీపీకి 10–12 సీట్లు వచ్చాయి. ఏబీపీ నీల్సన్‌ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ అత్యధికంగా 20 ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకోగా టీడీపీ ఐదు స్థానాలకే పరిమితమైంది. ఐ పల్స్‌ సంస్థ వైఎస్సార్‌ సీపీ 19–21 ఎంపీ సీట్లను, టీడీపీ 4–6 సీట్లను సాధిస్తాయని తెలిపింది. రిపబ్లిక్‌ సీ ఓటర్‌ 11 చోట్ల లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌ సీపీ గెలుచుకుంటుందని, 14 చోట్ల టీడీపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. కాగా వైఎస్సార్‌ సీపీ 8–12 ఎంపీ సీట్లను, టీడీపీ 13–17 ఎంపీ సీట్లను గెలుస్తాయని లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసిన అనంతరం పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ 72 అసెంబ్లీ స్థానాలు, టీడీపీ 100 సీట్లు, జనసేన, ఇతరులు 3 సీట్లు గెలుస్తారని చెప్పారు. 
ఓట్ల శాతంలోనూ భారీ తేడా
వైఎస్సార్‌సీపీ, – టీడీపీ మధ్య ఓట్ల శాతంలోనూ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందని వివిధ సర్వేలు తేల్చాయి. వైఎస్సార్‌సీపీకి 50.1 శాతం, టీడీపీకి 40.2 శాతం, జనసేనకు 7.3 శాతం, ఇతరులకు 2.6 శాతం ఓట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పోస్ట్‌ పోల్‌ సర్వే పేర్కొంది.  ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌  ఉండాలని 45 శాతం మంది కోరుకున్నట్లు వీడీపీ అసోసియేట్స్‌ విశ్లేషణలో తేల్చింది.
అన్ని వర్గాల ఆదరణ అన్నకే
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని పలు సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్‌ తదితర సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేశాం. అన్ని వర్గాల్లోనూ జగన్‌ పట్ల ఆదరణ కనిపించింది. చంద్రబాబు పసుపు – కుంకుమ పథకం వల్ల మహిళలు ఎక్కువగా టీడీపీకి  ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే మహిళల ఓట్లు వైఎస్సార్‌ సీపీకే పడ్డాయని మా సర్వేలో తేలింది’ అని ఆరా సంస్థ ప్రతినిధి మస్తాన్‌వలి తెలిపారు. ‘బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌వైపే నిలిచారు.’ అని సీపీఎస్‌ ప్రతినిధి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. 
 

Back to Top