తాడేపల్లి: వరద బాధితులను ఆదుకోవాలని డిమాండు చేస్తూ ఈ నెల 10వ తేదీ(గురువారం) విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్‌కు పేదలంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు. సంక్షోభం నుంచి అవినీతి ఎలా చేస్తారో చంద్రబాబు చేసి చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. సంక్షోభంలో అవకాశాలను సృష్టిస్తానని చెప్పుకునే సీఎం చంద్రబాబు, మరో అడుగు ముందుకేసి విజయవాడ వరదల్లో సంపద సృష్టించుకున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆక్షేపించారు. వరద బాధితులకు దక్కాల్సిన సాయం నాయకులు జేబుల్లోకి వెళ్లిందన్న ఆయన, మంత్రులకు వరద ప్రాంతాల్లో పర్యటించి, వరద బాధితులను కలుసుకునే ధైర్యం ఉందా? అని నిలదీశారు. దమ్ముంటే విజయవాడలోని సింగ్‌నగర్, కుమ్మరిపాలెం, కబేళా, జ్యోతినగర్, లూనా సెంటర్‌కు రావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి పేదలంటే చులకన అని, చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా ముంచిందని దుయ్యబట్టారు. చంద్రబాబు బస్సుల్లో పడుకున్నా, జేసీబీల మీద తిరిగినా ఆ విన్యాసాలేవీ బాధితులను ఆదుకోలేదని, నెల రోజులు గడిచినా, దాదాపు 30 వేల మంది వరద బాధితులు పరిహారం కోసం కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. దాతలు అందించిన విరాళాలు, కేంద్ర ప్రభుత్వ సాయం ఏమైందని వెల్లంపల్లి ప్రశ్నించారు. వరద ఖర్చులపై అధికారులు, మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని, చిన్నారులు కిట్టీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము కూడా విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని, నిజాయతీగా ఆ వివరాలు వెల్లడించాలని మాజీ మంత్రి కోరారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు చేశామని రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్‌పీ సిసోడియా చెప్పగా, దాన్ని ఎల్లో మీడియా కూడా రాసిందని, మరి ఇప్పుడు హోం మంత్రి అనిత ఆ ఖర్చు కేవలం రూ.23 లక్షలే అని మాట మార్చడం ఏమిటని వెల్లంపల్లి ప్రశ్నించారు. ప్రశ్నిస్తే జగన్‌గారిని, మమ్మల్ని నిందించడం, తమపై నిందలు మోపడం పరిపాటిగా మారిందని ఆక్షేపించారు. వరద బాధితులకు వైయస్సార్‌సీపీ కోటి రూపాయల విలువైన సాయం చేస్తుందని ప్రకటించినా, అంతకు దాదాపు మూడింతల సాయాన్ని అందించామని, అంతే తప్ప, కోటి రూపాయల విరాళం ఇస్తామని చెప్పలేదని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ట్వీట్స్‌కు ముందు అన్ని విషయాలు తెలుసుకోవాలని చురకలంటించారు. నిజానికి తాము వరద బా«ధితులకు సాయం చేసేందుకు పడవలు అడిగితే ఇవ్వలేదని, చివరకు తాము ట్రాక్టర్లు తీసుకువెళ్లినా అనుమతించలేదని చెప్పారు. వరద బాధితులకు ఆహార పొట్లాల సరఫరాకు 412 డ్రోన్లు వాడామని మంత్రులు చెబుతుంటే విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. వరద బాధితులను ఆదుకోవాలని, వారికి పూర్తి సాయం చేయాలని కోరుతూ, గురువారం (10వ తేదీ) ధర్నా చౌక్‌లో ధర్నా చేపడుతున్నట్లు వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. దుర్గ గుడిలో శరణ్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడిందని, వీఐపీల కారణంగా భక్తులు గంటల కొద్దీ క్యూలలో నరకయాతన అనుభవిస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు. ఒక కేసులో ముద్దాయిగా ఉన్న నటి కాదంబరి జత్వానీకి ఏ హోదాలో వీఐపీ దర్శనం చేసి పంపారన్న ఆయన, అమ్మవారి దర్శనానికి వచ్చిన విజయవాడ మేయర్‌ను దారుణంగా అవమానించారని చెప్పారు. చివరకు మూల నక్షత్రం రోజున డిప్యూటీ సీఎం దర్శనానికి వస్తే, భక్తులను గంటలకొద్దీ క్యూలైన్లలో ఆపేయడం దారుణమని గుర్తు చేశారు. కొండపైకి ఉచిత బస్సులు అని చెప్పుకుంటున్నారే కానీ, 70 ఏళ్ల వృద్ధులను కూడా బస్సులు ఎక్కించుకోవడం లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.