విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తి అని, ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాడ ఎన్‌ఏడీ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన ఆందోళనకు వైయస్‌ఆర్ సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్లమెంట్‌లో కూడా నిరసన తెలియజేస్తామన్నారు. అవసరమైతే స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామన్నారు. ప్రైడ్ ఆఫ్ ఏపీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు లోక్‌సభలో పోరాడుతామని వైయస్‌ఆర్ సీపీ ఎంపీ సత్యవతి అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను పోరాటాలతో సాధించుకున్నామని, వేలాది మంది ఉపాధి పొందే పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ప్లాంట్ లాభాల బాటలో పయనించిందని, వేల కోట్ల రూపాయలను కేంద్రరాష్ట్రాలకు పన్నుల రూపంలో అర్జించి పెట్టిందన్నారు. ప్రైడ్ ఆఫ్ ఏపీగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలిచిందన్నారు. అలాంటి పరిశ్రమను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామన్నారు.