రూ.118 కోట్లలో వారంద‌రికీ వాటాలు వెళ్లాయా..?

చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే ఐటీశాఖపై పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు..?

గతంలో బాబు అవినీతిపై పుస్తకం అచ్చేశారు.. ఇప్పుడున్న కమ్యూనిస్టుల నోరు ఎందుకు మూగబోయింది

ప్రశ్నిస్తానని మాట్లాడే దత్తపుత్రుడు.. దత్తతండ్రి నోటీసులపై ఎందుకు స్పందించడు..?

కేంద్రప్రభుత్వ సంస్థ నోటీసులిస్తే పురందేశ్వరి ఎందుకు స్పందించరు..?

ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలంతా చంద్రబాబు మనుషులేనని అర్థమవుతోంది

చంద్రబాబు పాపం పండింది.. జైలుకు వెళ్లే సమయం దగ్గరపడింది.. 

వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్‌రెడ్డి

తాడేపల్లి: నిజంగా చంద్రబాబు ఏ తప్పు చేయకపోయి ఉంటే ఐటీ శాఖ తప్పుడు నోటీసులు ఇచ్చిందని పరువు నష్టం దావా ఎందుకు వేయడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా ఎందుకు చేర్చడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. బాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే, నిజంగా నిప్పు అయితే రూ.118 కోట్ల లంచం కేసులో ఏ ఎంక్వైరీ సంస్థ వచ్చినా సహకరిస్తా.. విచారణ చేసుకోండి అని మాట్లాడగలడా..? అని నిలదీశారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే ఐటీ నోటీసులపై ఇప్పటి వరకు స్పందించకుండా ఉన్నాడన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో కారుమూరి వెంకట్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కారుమూరి వెంకట్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘షాపూర్‌జీ పల్లోంజీ అనే కంపెనీ ప్రతినిధిని 2019 ఎన్నికల కంటే ముందు ఫిబ్రవరిలో చంద్రబాబు తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. 2019 మార్చి నాటికి రూ.118 కోట్ల లంచాన్ని ఆ కంపెనీ నుంచి షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించి వారి నుంచి ముడుపుల రూపంలో తీసుకున్నాడు. కేవలం ఇదొక్క కంపెనీ మాత్రమే కాదు.. ఇలాంటి ఇంకా ఎన్ని కంపెనీలు ఉన్నాయి.. ఎంతెంత సొమ్ము చంద్రబాబుకు వెళ్లిందనేది లెక్కలేస్తే ఆ లంచం సొమ్ము దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. 

నా మీద ఎన్నో ఎంక్వైరీలు వేశారు నన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయారు అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. నువ్వు అసలు ఏదైనా కేసు ధైర్యం ఎదుర్కున్న దాఖలాలు ఉన్నాయా..? వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా కేసులను ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుకుంటున్నాడు. ముడుపులు తీసుకున్నానని చెప్పడం లేదు కానీ, నాకు సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. విచారణకు వస్తేనే కదా ఎవిడెన్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తారు. విచారణను ఎదుర్కొనే దమ్ములేదంటే తప్పు చేశాడని రుజువవుతోంది. 

గతంలో చంద్రబాబు హయాంలో ‘బాబు జమానా, అవినీతి ఖజానా’ అని అప్పుడున్న కమ్యూనిస్టులు పుస్తకం రాశారు. రూ.118 కోట్లు ఒక నెలలో లంచాల రూపంలో తీసుకున్నాడని ఐటీ శాఖ 46 పేజీల నోటీసుల్లో ఇచ్చాక ఇప్పుడున్న కమ్యూనిస్టులు నారాయణ, రామకృష్ణల నోరు ఎందుకు మూగబోయింది. రూ.118 కోట్లలో వారికి ఎన్నికల ఫండ్‌ ఇచ్చాడా..? 

ప్రశ్నిస్తా, పీకలు పిసికి చంపేస్తా, ఇంట్లోంచి లాక్కొచ్చి చంపేస్తా అని ఇష్టారీతిగా మాట్లాడే దత్తపుత్రుడు.. దత్తతండ్రి రూ.118 కోట్ల లంచం తీసుకున్నాడని నోటీసులు వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదు. రూ.118 కోట్లలో దత్తపుత్రుడికి ముడుపులు అందాయా..? అందే ఉంటాయి కాబట్టి మాట్లాడటం లేదని ప్రజలు అనుకుంటున్నారు. 

భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి.. నేను ఎందుకు స్పందించాలని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించరు. గతంలో ఏలేరు స్కామ్‌కు సంబంధించి ఉదయ కమలం అనే సిరీస్‌ను రిలీజ్‌ చేసి బీజేపీ పుస్తకం వేసింది. మరిప్పుడున్న ఏపీ బీజేపీ నోరు ఎందుకు మెదపడం లేదు. అంటే వీరంతా చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులని స్పష్టంగా అర్థం అవుతుంది. 

రూ.118 కోట్ల లంచం కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అందుకే అరెస్టు అవుతారనే భయంతో ఇంటికొకరు వచ్చి రక్షణ వలయంగా నిలబడండి.. నన్ను కాపాడండి అని బీద అరుపులు సానుభూతి కోసం అరుస్తున్నాడు. చంద్రబాబు పాపం పండింది.. జైలుకు వెళ్లే సమయం దగ్గరపడింది. బాబును ఎవరూ కాపాడలేరు. చంద్రబాబుకు ఈడీ నోటీసులు కూడా రాబోతున్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఫైబర్‌ గ్రిడ్, రూ.118 కోట్ల లంచం కేసులో కచ్చితంగా అరెస్టు కాబోతున్నారు’’ అని కారుమూరి వెంకట్‌రెడ్డి చెప్పారు. 

Back to Top