చంద్రబాబు రోగినా లేక వీర యోధుడా..!?

 కండీషన్‌ బెయిల్‌పై వస్తుంటే విజయోత్సవాలేంటి..?
 
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్నలు 

అవినీతి చేసి జైలుకెళ్ళి సంబరాలా..?

నిజం గెలిచిందని టీడీపీ నేతల ప్రచారం సిగ్గుచేటు

ఇదేనా చంద్రబాబు నైతికత..?

అది కంటి ఆపరేషన్‌కు కండీషన్‌ బెయిల్

ఆపరేషన్‌ తర్వాత మళ్లీ జైలుకెళ్తాడు

మేం వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తే ఎలా బయటకొస్తాడు..?:  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు రోగినా లేక వీర యోధుడా..!? అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. కండీషన్‌ బెయిల్‌పై వస్తుంటే విజయోత్సవాలేంటి..? అని నిల‌దీశారు. మంగ‌ళ‌వారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

అది కంటి ఆపరేషన్‌కు కండీషన్‌ బెయిల్ః
చంద్రబాబు నాయుడుకు ఈరోజు న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఆయన ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇచ్చిన బెయిల్‌ గానీ.. టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు  చెప్పుకుంటున్నట్టుగా నిజం గెలిచినట్టు కాదని అందరూ తెలుసుకోవాలి. ఆయనకు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్‌ మాత్రమే. అంటే, కేవలం 30 రోజుల పాటు (నాలుగు వారాలు) కంటికి ఆపరేషన్‌ చేయించుకుని మరలా నవంబర్‌ 28న సాయంత్రం 5 గంటలలోగా చంద్రబాబు లొంగిపోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఆయన కుటుంబ సభ్యులు ఒకవైపు, టీడీపీ నేతలు మరోవైపు చప్పట్లు కొట్టుకుంటూ.. సంబరాలు చేసుకుంటూ.. కేసులో నిజం గెలిచిందన్నట్లు ప్రచారం చేసుకోవడం సరికాదు. కేసు మెరిట్స్‌ మాట్లాడకుండా.. కేసు విచారణ ఆసాంతం జరగకుండానే మీరు నిజం గెలిచిందని ఎలా చెప్పుకుంటారు ..? అని అడుగుతున్నాను. గౌరవ న్యాయస్థానం మంజూరు చేసిన కండీషన్‌ బెయిల్‌ ఆర్డర్‌ను తెప్పించుకుని చదువుకోవడం మంచిదని వారికి తెలియజేసుకుంటున్నాను. 

చర్మవ్యాధి ప్రాణాంతకం అన్నట్టు ప్రచారంః
చంద్రబాబు ఆరోగ్యంపై మొదట్నుంచీ టీడీపీ నేతలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నానా హంగామా చేస్తున్నారు. ఆయనకున్నటువంటి చర్మవ్యాధిని అదేదో ప్రాణాంతకమౌతుందన్నట్టు బెయిల్‌కు నానా రకాల అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చంద్రబాబుకు ఉన్నటువంటి చర్మవ్యాధిని ఇప్పుడు బయట ప్రపంచానికి తెలిసేలా వారికి వారే ప్రచారం చేసుకుంటూ ఆందోళన చేసుకున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం, భద్రత  విషయంలో ప్రభుత్వపరంగా గానీ.. జైలు అధికారుల నుంచి గానీ సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా చిన్నలోపం జరగలేదనేది గౌరవ న్యాయస్థానం అంగీకరించింది. 

- ప్రస్తుతం న్యాయస్థానం మాత్రం చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ అవసరం నిమిత్తమే మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీనిపైనా ప్రభుత్వ వైద్యుల నివేదిక ప్రకారం చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ అంత అత్యవసరం కాదని చెప్పినప్పటికీ.. గౌరవ న్యాయస్థానం మానవీయకోణంలో ఒక జైలు ఖైదీకి ఉన్నటువంటి హక్కుల ప్రకారం మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. 

కంటి ఆపరేషన్ కు బెయిల్ ఇస్తే.. సంబరాలా? సిగ్గుండాలిః
చంద్రబాబు, స్కిల్ స్కాం కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన దొంగ. అందుకే, రాజమండ్రి జెలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కంటి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ కోసమే ఆయనకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది తప్ప ఈ కేసు కొట్టేయలేదు గదా..? మరి, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కేడర్‌ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడంలో అర్ధమేంటి..? ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వలేదు. అది ఇంకా విచారణలో ఉంది. కేసు మెరిట్స్‌పై విచారణ న్యాయస్థానంలో జరగలేదు.  పోనీ.. ఆయనేమన్నా నిర్దోషిగా బయటకొస్తున్నారా..? అంటే, అదీ కాదు. మరెందుకు వాళ్లంతగా సంబరాలు చేసుకుంటున్నారో వారికే అర్ధం కావాలి. అసలు వాళ్లకు సిగ్గుండాలి కదా..? ప్రజలకు కూడా ఈరోజు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ పట్ల చాలా స్పష్టత ఉంది. 

నిజం గెలవాలంటే.. వీటికి సమాధానం చెప్పాలిః
- కేసు మెరిట్స్‌ గురించి మాట్లాడరు. కానీ, కేసులో నిజం గెలిచిందని చెప్పుకోవడానికి చంద్రబాబు మనుషులకు సిగ్గు అనిపించదా..? స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు గురించి మేం మొదట్నుంచీ గట్టిగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..? 
– చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి సీమెన్స్‌ సంస్థతో చేసుకున్నది ఫేక్‌ అగ్రిమెంటా..? కాదా..? 
– చేసుకున్న ఒప్పందం ప్రకారం 90 శాతం అంటే రూ.3,000 కోట్లు సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టకుండానే.. 10 శాతం మొత్తం అంటే, 370 కోట్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రిలీజ్‌ చేశాడా..లేదా..?
– సీమెన్స్‌ సంస్థ ప్రభుత్వం నుంచి మాకెటువంటి సొమ్ము అందలేదని చెప్పిందా .. లేదా..?
– అదేవిధంగా చంద్రబాబు తన సొంత మనుషుల్ని బయట్నుంచి తెచ్చుకుని స్కిల్‌స్కామ్‌కు పాత్రధారులుగా పెట్టుకున్నాడా..?లేదా..? 
– 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయా..? లేదా..? 
– చంద్రబాబు రిలీజ్‌ చేయమంటేనే.. ఖజానా నుంచి ఫండ్స్‌ రిలీజ్‌ చేస్తున్నామని ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు నోట్ ఫైల్స్ రాశారా..? లేదా..?
– ప్రభుత్వం రిలీజ్‌ చేసిన ఫండ్స్‌లో రూ.240 కోట్లు షెల్‌ కంపెనీలకు వెళ్లి కేంద్ర ఐటీ విజిలెన్స్‌ సంస్థ బయటపెట్టిందా.. లేదా..? 
– షెల్‌కంపెనీలకు వెళ్లిన ఫండ్స్‌ క్యాష్‌ రూపంలో తిరిగి  చంద్రబాబు పీఎ పెండ్యాల శ్రీనివాస్‌ ద్వారా చేరాయని ఐటీశాఖ దాడుల్లో రుజువైందా.. లేదా..? 
– ఈ విషయం పూర్తినిర్ధారణకు పెండ్యాల శ్రీనివాస్‌ను పట్టుకుంటే అసలు వాస్తవాలు తెలుస్తాయనడం నిజమా.. కాదా..?
– పెండ్యాల శ్రీనివాస్‌ కోసం సీఐడీ నోటీసులు జారీచేస్తే.. ఆయన్ను యూఎస్‌ఏకు పంపడం.. ఆయన్ను పిలిపించకుండా ఉండటంతో అక్కడ్నే సగం కేసును చంద్రబాబు అంగీకరించారా.. కాదా..?

అవినీతి చేసి జైలుకెళ్ళి విక్టరీ సింబలా..?
స్కిల్‌ స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అనేది సీఐడీ విచారణలో స్పష్టమైంది. ఆయన పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను రప్పించి ఆయన్ను సీఐడీ విచారణ చేస్తే చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం తెలుస్తుంది. ఇదే స్కామ్‌కు సంబంధించి ఈడీ కూడా ఎంటరై విచారించి కొంతమందిని అరెస్టు చేశాక.. అసలు స్కిల్‌ కుంభకోణమే జరగలేదని మీరెలా చెబుతారు..? పెండ్యాల శ్రీనివాస్‌ను కుట్రపూరితంగా మీరు తప్పించి విదేశాలకు పంపి ఇక్కడ కేసే లేదని ఎలా అనగలుగుతారు..?

- స్కిల్‌స్కామ్‌లో సీఐడీ సంస్థ ఇక్కడ్నే విచారించింది. ఆధారాలతో సహా ఆయన్ను అరెస్టు చూపి రిమాండ్‌కు పెట్టింది. అవినీతికి పాల్పడి అడ్డంగా బుక్కైన తర్వాత కూడా నన్ను అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. గౌరవ న్యాయస్థానం అన్నీ పరిశీలించాకే ఈ కేసులో ప్రైమ్ ఆఫ్ ఏసీ  ఉందని నమ్మి కోర్టు రిమాండ్‌కు పంపింది. జైలుకెళ్లేటప్పుడేమో రెండు వేళ్లు చూపించుకుంటూ పోవడం.. తీరా, అక్కడకెళ్లాక నాకు దోమలు కుడుతున్నాయి. వేడ్నీళ్లు ఇవ్వడంలేదు. ఏసీ గాలిలేదు. చెమట పొక్కులు వస్తున్నాయి. చర్మరోగం ఎక్కువైందని పొద్దుపోని కథల్ని చెబుతావా చంద్రబాబు..? ఇదే సాకుగా నీ కుటుంబం ఏమో నీకున్న చర్మవ్యాధి ప్రాణాంతకంగా మారుతుందంటూ.. 70 ఏళ్ల పైబడిన వృద్ధుడ్ని ప్రభుత్వం వేధిస్తుందంటూ ఏడుపురాగం తీస్తూ రాష్ట్రమంతా విషప్రచారం చేస్తారా..? అసలు, మీరు రెగ్యులర్‌ బెయిల్‌ పిటీషన్‌పై సక్రమంగా వాదించాల్సింది పోయి.. కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ అత్యవసరమంటూ ఎందుకు హడావిడి చేసి మధ్యంతర బెయిల్‌ తీసుకున్నారు..? ఒకవైపు చంద్రబాబు నిప్పు అంటారు.. దేన్నైనా సమర్ధంగా ఎదుర్కొంటారని చెబుతూనే మరోవైపు తప్పుడు పనులతో తప్పుడు మార్గాల్లో బయటపడాలని చూస్తారు. ఇదేనా చంద్రబాబు తాలూకూ నైతికత..? అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

మేం వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తే ఎలా బయటకొస్తావ్‌..?
రాజమండ్రి జైల్లో చంద్రబాబు 52 రోజులు ఉన్నాడు. ఆయన ఉన్నన్ని రోజులు రాష్ట్రమంతా బాబు కుటుంబం, టీడీపీ నేతల విషప్రచారం అంతా ఇంతా కాదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ గారు వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తున్నారంటూ చంద్రబాబు కొడుకు లోకేశ్‌ అంటాడు. ఆయన తండ్రిలా అందరూ అలాగే ఉంటారని అనుకుంటే ఎలా..? వ్యవస్థల్ని మేనేజ్‌ చేసే అలవాటు, లక్షణాలు జగన్‌గారికి ఏనాడూ ఉండవు.. జగన్‌ గారు జైల్లో ఉన్నప్పుడు గానీ.. ఇప్పుడు గానీ ఏరోజూ చేయలేదు. ఆది నుంచి అలాంటి నీచమైన మేనేజ్‌మెంట్‌ వ్యవస్థల్ని పెంచిపోషించిందే చంద్రబాబు. నిజంగా జగన్‌గారు వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి ఉంటే.. 52 రోజుల తర్వాత చంద్రబాబు ఎలా జైలు నుంచి బయటకొస్తాడు..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 

ఆపరేషన్‌ తర్వాత మళ్లీ జైలుకెళ్తాడుః
చంద్రబాబు కంటి ఆపరేషన్ కోసం బయటకు వస్తే.. లయన్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ డప్పులు కొట్టుకోవడం తగదని టీడీపీ నేతలకు చెబుతున్నాం. రోగాన్ని సాకుగా చూపెట్టుకుని మధ్యంతర బెయిల్‌ మీద చంద్రబాబు బయటకొస్తున్నాడు. అంటే, ఆయన కోర్టు పరిధిలోని రిమాండ్‌ ఖైదీగా మాత్రమే కంటికి ఆపరేషన్‌ కోసం వస్తున్నాడు. ఎక్కడ ఏ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకుంటాడో.. చేయించుకుని.. బెయిల్‌ ఆర్డర్‌ కండీషన్ల ప్రకారం రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా.. ఇల్లు, ఆస్పత్రికి మాత్రమే తిరిగి మరలా నవంబర్‌ 28న జైలుకెళతాడు. 

నువ్వు రోగివా..వీరయోధుడివా..?
చంద్రబాబు అవినీతి కేసులో జైలులో ఉండి, కంటి ఆపరేషన్ కోసం  కండీషన్ బెయిల్ తో బయటకు వస్తే..  టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులేమో పెద్ద ఎత్తున ర్యాలీలు, విజయోత్సవాలంటూ ఎందుకు హడావిడి చేస్తున్నారు. ఆయన రోగినా..? రోగగ్రస్తుడు అని బయటకు వస్తున్నాడా..? లేదా ఏదైనా యుద్ధంలో గెలిచి వీరయోధుడిగా జైలు నుంచి వస్తున్నాడనుకుంటున్నారా..? రాజమండ్రి నుంచి రోడ్‌ షో ఎందుకు చేస్తున్నట్లు.? రోడ్‌షోతో సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. 

ఆరోగ్యం పేరుతో సానుభూతి డ్రామాలుః
చంద్రబాబు జైలుకెళ్లడంతో రాష్ట్ర ప్రజల్లో సానుభూతి పెద్ద ఎత్తున పెల్లుబికుతుందని టీడీపీ నేతలు ఆశపడ్డారు. తీరా, పరిస్థితి చూసి భంగపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా జనస్పందన కనిపించకపోవడంతో చివరికి ఆయన ఆరోగ్యం సన్నగిల్లుతుందనే సానుభూతి డ్రామాలకు తెరదీశారు. చంద్రబాబు కుటుంబం రోజుకో స్టేట్‌మెంట్‌ ఇస్తూ.. జైలు అధికారుల్ని, ప్రభుత్వంపైన బురదజల్లే ప్రయత్నం చేశారు. మధ్యలో ఏసీ కావాలని కోర్టును అడిగారు. వెంటనే ఏసీ ఏర్పాటుకూ గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో.. ఇక, ఎలాగైనా ఆయన్ను బయటకు తెచ్చుకోవాలని అడ్డదారుల్లో ఆలోచనలు చేశారు. రోగాల్ని చూపెట్టుకుని సానుభూతి డ్రామాలతో మొత్తానికి మధ్యంతర బెయిల్‌ తెచ్చుకున్నారు కనుక.. వాళ్లు ఇప్పటిదాకా చేసింది డ్రామాలే అని ఒప్పుకోవాలి. ప్రజల్లో దక్కని సానుభూతిని కోర్టు ఎదుట రోగాల్ని చూపి బెయిల్‌ తెచ్చుకున్నామని చంద్రబాబు, ఆయన కుటుంబం, టీడీపీ నేతలు ప్రజల ఎదుట బహిరంగంగా అంగీకరించాలని డిమాండ్‌ చేస్తున్నాం. 

Back to Top