తాడేపల్లి: వైయస్ వివేకానందరెడ్డి కూతురు సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. భారతమ్మ, తాను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదని, అవినాష్‌రెడ్డిని డిఫెండ్ చేయమని నేను చెప్పలేదన్నారు. వివేకా పరువు కాపాడాలని అవినాష్ కుటుంబం ప్రయత్నించిందని, మూడేళ్లుగా అవినాష్ కుటుంబం ఎంతో బాధ అనుభవిస్తోందని చెప్పారు. సీబీఐ ఛార్జ్‌షిట్‌లో అన్ని కల్పిత కథలే అని కొట్టిపారేశారు. ముందే దోషులను నిర్ణయించుకొని కథలు అల్లారని తెలిపారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. ఎల్లో మీడియాకు మసాలా తప్ప అందులో ఏమీ లేదు: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు పెట్టిన డెడ్ లైన్ మేరకు సీబీఐ తన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఒక వర్గం మీడియా టార్గెటెడ్‌గా వ్యక్తిత్వ హననం చేస్తున్నాయి. వరుసపెట్టి విషప్రచారం చేస్తూ ఉన్నారు. దర్యాప్తు పేరుతో ముందస్తు పథకం ప్రకారం ఎవరిని దోషులుగా పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారో అలానే చేశారు. సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి వాళ్లే దోషులని ప్రూవ్ చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా...కేవలం వ్యక్తుల స్టేట్‌మెంట్ల ద్వారా వ్యూహాత్మకంగా కల్పితమైన కథలాంటిది చార్జ్‌షీట్లో కనిపిస్తుంది. వ్యక్తుల స్టేట్‌మెంట్లలోనూ కథకు అనుకూలంగా మార్పులు చేపట్టడం ద్వారా ఒక్క స్క్రిప్ట్ చార్జ్‌షీట్లో కనిపిస్తుంది. వారు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దానికి ఆధారాలు చూపుతున్నామనే పేరుతో ఈ స్టేట్‌మెంట్లు తీసుకొచ్చినా, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అంటూ రాసుకుంటూ పోయినా అవి టీడీపీ ప్రచార బాకాలు, ఎల్లోమీడియాకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. టీడీపీ - ఎల్లో మీడియా.. వారి అధికారిక పత్రికలు, టీవీ చానళ్లకు మాత్రం నాలుగు రోజులుగా అవసరమైన సరుకు, మసాలా ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడింది. దర్యాప్తు పేరుతో థర్డ్ రేటెడ్ స్క్రిప్ట్: సీబీఐ ప్రతి దేశానికి ఉన్నట్లే మన దేశానికి నమ్మదగిన అతిపెద్ద దర్యాప్తు సంస్థ. అలాంటి సంస్థ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా, థర్డ్ రేటెడ్ స్క్రిప్ట్‌ను తయారు చేసింది. వైరుధ్యాలతో ఎంత చెత్తగా విచారణ చేయవచ్చు అనడానికి ఈ కేసు సీబీఐ చరిత్రలో, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగులుతుంది. హత్యకు గురైన వ్యక్తి ఒక పబ్లిక్ ఫిగర్. ఎవరికీ ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఎన్నికలకు ముందు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. హత్య జరిగింది అత్యంత కిరాతకంగా...ఆయన సొంత గడ్డపై జరిగింది. ఆయన మా పార్టీ అధినేతకు చిన్నాన. దీంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న మా నాయకుడు, జగన్‌గారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన పక్కన నడిచిన నాయకుడు వివేకానందరెడ్డి. ఆయన బ్లెస్సింగ్స్‌తో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి అవినాష్ రెడ్డి. ఆయన కూడా కొడుకు వరస అవుతాడు. ఈ హత్య వల్ల మొదటిగా నష్టపోయేది ఎవరనేది అందరికీ అర్ధం అవుతుంది. దీని వల్ల డీ మోరలైజ్ అయ్యేది ఎవరు అనేది ఆలోచిస్తే హత్యకు కారణం ఎవరు కాదో అర్ధం అవుతుంది. ఈ బేసిక్ లాజిక్‌ను గుర్తిస్తే ఎవరు కాదో తెలుస్తుంది. చిన్న పిల్లాడ్ని అడిగినా నష్టం ఎవరికంటే వైఎస్సార్సీపీకి, జగన్ గారికి అంటారు. ఇంకా చెప్పాలంటే ఆ పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేస్తున్న అవినాష్‌రెడ్డికి నష్టం. అవినాష్ రెడ్డి రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటాడు..? ఏ చిన్న దర్యాప్తు సంస్థ అయినా, ప్రైవేటు డిటెక్టివ్ సంస్థకైనా ఈ మాత్రం ఇంగితం ఉంటుందని అనుకుంటాం. పోనీ వారు చూపుతున్న దానికంటే బలమైన కారణం ఉందన్నా దాన్ని చూపించాల్సి ఉంది. మేం మొదటి నుంచీ ఈ అంశాలన్నీ చెబుతూనే వస్తున్నాం. కానీ అలాగే బుల్డోజ్ చేసుకుంటూ సీబీఐ కథ నడుపుకుంటూ వచ్చింది. ఎందుకు వాళ్లు అలా చేశారు అనేది వారే చెప్పాలి.. కానీ ఎవరి కోసం చేశారనేది మాత్రం మేం చెప్పగలం. వ్యవస్థల్లోకి వైరస్‌లా చొరబడే చంద్రబాబు వల్లే ఇదంతా..: వ్యవస్థల్లో వైరస్‌లా పాకిన చంద్రబాబు, ఆయన ప్రాబల్యం వల్ల.ఆయన తరఫున జాతీయ స్థాయిలో వ్యవస్థలను మేనేజ్ చేసేలా చక్రం తిప్పే సిద్ధహస్తులు చేయాల్సిందంతా చేశారని మేం భావిస్తున్నాం. దానివల్ల వారికి రెండు లాభాలు. ఒకటి... జగన్ గారిని డీమోరలైజ్ చేయాలి.. పాదయాత్ర పూర్తిచేసి అభ్యర్థులను ప్రకటించే దిశగా యుద్ధానికి ఆయన సిద్ధమవుతున్నారు. అలాంటి సమయంలో షాకింగ్‌గా ఉండాలనే వారు ఈ ప్రచారం చేశారు. దానివల్ల చంద్రబాబుకే లాభం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించిన బీటెక్ రవి, ఆయనకు మద్దతుగా నిలిచిన ఆదినారాయణరెడ్డి వీరు క్యాంపులు పెట్టి వైఎస్సార్సీపీ ఓట్లను దొంగలించి...అలవోకగా గెలవాల్సిన వివేకానందరెడ్డి ఓటమికి కారణం అయ్యారు. వివేకానందరెడ్డి చుట్టూ ఉన్న వారు కొద్ది మంది వారి సహకారంతో చేసి ఉండొచ్చని మేం ప్రారంభంలోనే అనుమానించాం. ఇప్పటికీ మేం అదే అనుకుంటున్నాం. ఇంతటి విచిత్రమైన కేసు కూడా ఎక్కడా ఉండదు. చంద్రబాబు హయాంలో మూడు నెలలు, మా హయాంలో 9 నెలలు ఈకేసును రెండు సిట్‌లు దర్యాప్తు చేశాయి. వివేకా తొలివర్ధంతి వచ్చే ముందే సీబీఐకి బదిలీ అయ్యింది. రెండు సిట్‌లు దర్యాప్తు చేసిన కాల్ రికార్డ్స్, డేటా మొత్తం సీబీఐకి ఇచ్చారు. వాటిని సీబీఐ ఏం చేసిందో తెలియదు. నేడు సీబీఐ ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అంటూ రాసుకున్న దానిలో ఒక్కదానికన్నా ఆధారాలు కనిపించలేదు. కేవలం వందల కొద్దీ స్టేట్‌మెంట్లు మాత్రమే ఉన్నాయి. కొంత మంది 161 స్టేట్‌మెంట్లు మేం అనకుండానే అన్నామని రాసుకున్నారని ఆరోపించారు. సునీత ప్రత్యర్థుల క్యాంపులోకి వెళ్ళింది: ఏ కారణాలో తెలియదు కానీ...వైఎస్ వివేకా కుమార్తె సునీతమ్మ తర్వాత తీసుకున్న లైన్..పూర్తిగా ఆ క్యాంపులోకి వెళ్లిందనిపించింది. ఆమె పూర్తిగా ఆ నాయకుల మాటలు వింటూ.. ఈవైపు కేసును తొయ్యాలని చూశారు. కథ మలుపు తిరగాలన్నపుడల్లా వారికి అనుగుణంగా సునీతమ్మ ఆరేడు సార్లు స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. వారికి ఏఏ స్టేట్‌మెంట్లు కావాలో దాన్ని తీసుకుంటూ ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అంటున్నారు. సునీల్ యాదవ్ అనే నిందితుడు బెయిల్‌కి దరఖాస్తు చేసినప్పుడు గూగుల్ టేకవుట్ ఆధారం మావద్ద ఉంది...అతను అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడంటూ అవినాష్ రెడ్డి తండ్రిని తీసుకెళ్లి లోపలపెట్టేశారు. ఆ తర్వాత గూగుల్ టేకవుట్ నిలబడదు అని తెలియగానే కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ యూనివర్సల్ టైమ్ కోఆర్డినేటర్ ప్రకారం మన సమయానికి 5.30గంటలు కలపాలని అన్నారు. ఆ లెక్కన వారు చెప్పిన టైం మరుసటి రోజు 8గంటలకు పడుతోంది. దీంతో దాన్ని పక్కన పెట్టేశారు. వాళ్లకీ అది నిలబడదని అర్ధమైనట్లుంది. 31.05.2023న తెలంగాణ హైకోర్టు మొదటి సారిగా కేసును క్షుణ్ణంగా పరిశీలించి ప్రశ్నించింది. మేం ముందు నుంచీ ఏవైతే సందేహాలు వ్యక్తం చేస్తున్నామో వాటినే హైకోర్టు కూడా ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డి జూన్19న సీబీఐ డైరెక్టర్‌కి ఒక లేఖ రాశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సునీతమ్మ స్టేట్‌మెంట్ మరొకటి రికార్డు చేశారు. వివేకాందరెడ్డి–షమీమ్ రెండో వివాహం విషయం గతంలో ప్రస్థావించలేదు. భారతమ్మతో కలిసి నేను సునీతను కలవనే లేదు: ఎప్పుడైతే అవినాష్ లేఖ రాశాడో దాన్ని కూడా పూర్తిగా మెన్షన్ చేసి అది కారణం కాదని కొట్టిపడేశారు. సునీతమ్మ స్టేట్‌మెంట్‌లో 23వ తేదీన భారతమ్మ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు చేయమన్నారని చెప్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి..అవినాష్‌ను సమర్ధించాలని కోరాడని కథ అల్లారు. బహుశా అప్పుడేమన్నా ఫోన్ రికార్డు ఉండి ఉంటుంది...దాన్ని పట్టుకుని కథ అల్లేశారు. ఆ రోజు మేము, భారతమ్మ అసలు కలిసి వెళ్లలేదు... హత్య జరిగిన తర్వాత పదిరోజులకు నా భార్య, నేను పరామర్శించడానికి వెళ్లాను. బాగా షాక్‌గా ఉంటారనుకున్నా కానీ అంత ఇదిగా అయితే కనిపించలేదు. కాఫీ అన్నారు...వద్దని పరామర్శించి వచ్చాం... ఇక సునీతమ్మ చెప్పినట్లు.. విలేకరుల సమావేశం, అధికారుల వద్దకు వెళ్లడం జరగకుండా ఎందుకుంటాయి...? జరగకపోతే ఆశ్చర్యం. ఆమె వైయస్ రాజశేఖరరెడ్డి గారి తమ్ముడు కూతురు...వివేకానందరెడ్డి మధ్యలో బయటకు పోయి వచ్చిన వ్యక్తి, వైయస్ జగన్ గారికి చిన్నాన. హత్య జరిగిన తర్వాత కుమార్తెగా తన తండ్రి వ్యక్తిత్వ హననం జరుగుతుందని భావించారు. ఆ వ్యక్తిత్వ హననం.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేశాడు..అంతో ఇంతో ఈనాడు చేసింది. మేం టీడీపీలో చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను విమర్శిస్తుంటే...దిక్కుతెలియక వివేకా రెండో వివాహం అని రాసుకొచ్చారు. అసలు వివేకా రెండో వివాహం ఫోటో వేసింది మొదటిగా ఆంధ్రజ్యోతే. అలాంటప్పుడు ఆమె కుటుంబంలో సభ్యురాలు కాబట్టి ఆమెకు అండగా ఉంటాం. వివేకా వ్యక్తిత్వ హననం చేసిన వారే ఆమెకు నేడు సలహాదారులు: హత్య జరినప్పుడు అవినాష్‌రెడ్డి అక్కడకు వెళ్లకపోతే, ఆ సమాచారం జగన్‌గారికి రాకపోతే అసహజం అవుతుంది. హత్య జరిగిన తర్వాత లెటర్ దాచిపెట్టమనడం అసహజమే. షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మొదటిగా ఇంటికి పెద్దలా ఉన్న జగన్ గారికి ఫోన్ రావాలి. కానీ సునీతమ్మ వైపు నుంచి జగన్ గారికి ఫోన్ రాలేదు. పులివెందుల నుంచి మాత్రమే ఫోన్ వచ్చింది. తర్వాత ఏమన్నా మళ్లీ మాట్లాడారేమో తెలియదు. ఇలా క్రిటికల్‌గా చూస్తే ఇవన్నీ డౌట్‌లు రావాలి... వివేకానందరెడ్డి గురించి ఎవరైనా మాట్లాడుతుంటే సహజంగా మాకందరికీ కోపం వస్తుంది. ఆమె మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే మా నాన్న వ్యక్తిత్వ హననం చేయవద్దని కోరింది. ఆలా సాక్షి, వైఎస్సార్సీపీ చేసే అవకాశం లేదు. ఆనాడు ఆలా చేసింది ఆంధ్రజ్యోతే. వాళ్లు ఈ రోజు ఆమెకు మిత్రులు, సలహాదారులు, సన్నిహితులు. చంద్రబాబు ఆనాడు ఆమెపై ఎటాక్ చేశాడు...ఆయన ఇప్పుడు ఆమెకు సన్నిహితుడు. చంద్రబాబు వెనుక ఉండేవారంతా ఇప్పుడు వివేకానందరెడ్డి గౌరవాన్ని కాపాడేవాళ్లు అయ్యారు.? వివేకానందరెడ్డి పేరుపై మచ్చ పడకూడదని, చనిపోయిన వ్యక్తి గౌరవానికి భంగం కలగకూడదని అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబం మూడేళ్లుగా మౌనంగా అన్నీ భరించారు. చనిపోయిన వ్యక్తి గౌరవం కాపాడాలని మేం తపన పడుతుంటే... బతికున్నవారినే బజారుకీడుస్తున్నారు. వారి బతుకులను నాశనం చేసే పరిస్థితికి వచ్చాక మౌనం వీడి నోరు తెరవాల్సి వస్తోంది. అంతా రివర్స్ జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్సార్సీపీ అంతా, మా బలమంతా వివేకా గౌరవం కాపాడటానికి వినియోగించాం. ఆయన హత్యకు కారణమైన అసలు దోషులు బయటకు రావాలని మేం గట్టిగా కోరుకున్నాం...ఇప్పటికీ అదే కోరుకుంటున్నాం. దానికి తగ్గట్లు ఎక్కడన్నా దర్యాప్తు జరిగిందా అంటే లేదు. నిజంగా జగన్ గారు దీన్ని ఏదో ఒకటి చేయాలంటే సీబీఐ వరకూ ఎందుకు పోనిస్తాం..? మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో ఒక లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్ల వచ్చు కదా..? కానీ నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని, అసలు దోషులు బయటకు రావాలని కోరుకున్నాం. సునీతమ్మ ఆలోచన మారడంతోనే కేసు మలుపులు తిరిగింది: ఆధారాలు, పరిసరాలు, ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు...ఇలా అన్నీ ఒక వైపు చూసిస్తున్నాయి. దర్యాప్తు మరోవైపు సాగుతుంది. ఎప్పుడైతే సునీతమ్మ ఆలోచన విధానం మారిందో అప్పుడే బలవంతంగా తిప్పడం మొదలుపెట్టారు. దీనివల్ల చంద్రబాబుకు లాభం చేకూరేలా మారింది. వాళ్ల పార్టీ నాయకులు సేఫ్..కేసు జగన్ గారి వైపు తిరుగుతుందనేదే వారి ఆలోచన. ఇక వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఎలాగూ వారు సిద్ధహస్తులు కాబట్టి సీబీఐ చేతికి చేరాక వారికి తగ్గట్లుగానే అన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ ఊరు తెలిసిన వారికి అందరికీ తెలుసు ఆ ఇళ్లన్నీ పక్కపక్కనే ఉంటాయి. పైగా వివేకానందరెడ్డి మా పార్టీ నాయకుడు...ఆయన ప్రోగ్రాంలన్నీ కో ఆర్డినేటెడ్‌గానే ఉంటాయి. బహుశా ఆయన జమ్మలమడుగులో తిరుగుతున్నప్పుడు కూడా ఫోన్లు చేసుకునే ఉంటారు. ఆయన అందుబాటులో లేకపోతే పక్కన వారికి కూడా ఫోన్లు చేసి ఉండొచ్చు. హత్యకు రెండు రోజులు ముందు వివేకా నాతో కూడా మాట్లాడారు. ఏదో జాయినింగ్ గురించి వాకబు చేశారు. ఒక నెల రోజుల్లో ఎన్నికలు ఉండగా...మా మధ్య ఫోన్లు ఉండొద్దంటే ఎలా..? పైగా కుటుంబ సభ్యుల మధ్య ఫోన్ కాల్స్ ఉండటంలో విచిత్రం ఏముంది.? వాటినే సాక్షాలు అంటే ఎలా..? దస్తగిరిని ఎందుకు అప్రూవర్‌గా మార్చారు..?: హత్య జరిగింది సొంత ఇంట్లోనే...ఆయన చుట్టూ ఉన్న వాళ్లు ఏళ్లతరబడి ఆ కుటుంబానికే క్లోజ్ అయి ఉంటారు. వాళ్లలో రెండు రోజులు ముందు ఎప్పుడు వెళ్లని వాడు ఇంటికి వస్తాడు..అయినా వీరికి అనుమానం రాదు. రెండు నెలలుగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు..రెండో భార్యకు న్యాయం చేయలేకపోతున్నానని బాధపడుతున్నాడని పలు స్టేట్‌మెంట్లలో ఉంది. విపరీతంగా డ్రింక్ చేస్తూ తిండి సరిగ్గా తినడం లేదని కూడా చెప్తున్నారు. రంగన్న అనే వ్యక్తి నలుగుర్ని చూశాను అన్నాక...దస్తగిరి అనే వాడిని ఎందుకు అప్రూవర్‌గా మార్చారు..? అవినాష్‌రెడ్డి వైపు వేలు చూపించేందుకు అతన్ని అప్రూవర్‌గా మార్చారు. దానికోసం రెండు మూడు నెలలు అతనికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అప్పటికే కన్ఫెషనల్ స్టేట్‌మెంటు ఉంది. ఆ తర్వాత దాంట్లో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి పేర్లు వచ్చేలా మార్పులు చేశారు. ఎర్రగంగిరెడ్డి చెప్పాడని అప్రూవర్ హియర్ సే ఎవిడెన్స్ చెప్తుంటే దాన్ని వీళ్లు కథలా అల్లుతున్నారు. అతనికి ఏఏ ప్యాకేజీ ఇచ్చి చెప్పించుకున్నారో తెలియదు కానీ..దాన్ని పట్టుకుని అంతా ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అని రాసుకుంటూ పోయారు. దాన్ని అతికించడానికి గూగుల్ టేకవుట్ అన్నారు...అదీ ఫెయిల్ అయ్యింది. ఏదైతే ఇన్వెస్టిగేషన్ పేరుతో జరిగిన ఫార్స్ చూస్తే థర్డ్ రేట్ డెయిలీ సీరియల్ చెత్తలా దర్యాప్తు ఉంది. ఆ రోజు ఎందుకు వారికి సంబంధం లేదని చెప్పావమ్మా అని అంటారని దాన్ని ఈ రోజు మార్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వారు అడుగుతున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి...ఆమె చెప్పేది కూడా అలానే ఉంది. హైకోర్టు వ్యాఖ్యల తర్వాత దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ఆ తర్వాత కూడా స్టేట్‌మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. లెటర్ ఎందుకు చూపించలేదు అంటే హింసాత్మక సంఘటనలు జరుగుతాని ఇవ్వలేదని చెప్పుకొస్తున్నారు. సొంత తండ్రి చనిపోయాడు అంటే ఈ లేఖ విషయం పట్టించుకోలేదు అంటే ఎలా నమ్ముతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించింది టీడీపీ వారే: వివేకా పోటీ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికలో మేము సునాయాశంగా గెలవాల్సినది...దాన్ని టీడీపీ వారు అక్రమంగా అడ్డంపడ్డారు. ఆనాడు ఒక ఎంపీటీసీని ఎత్తుకెళ్లారని వైఎస్ అవినాష్‌రెడ్డి స్వయంగా ధర్నాకు కూర్చున్నాడు. రామాపురం మరికొన్ని చోట్ల కేసులు కూడా పెట్టారు. వివేకానందరెడ్డి కూడా వారు చేసిన అక్రమాలపై పోరాటం చేశాడు. ఆ ఎన్నికల్లో వివేకా గెలుపునకు దెబ్బ పడింది జమ్మలమడుగులోనే. ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడంలో అవినాష్‌రెడ్డి కూడా ప్రపోజ్ చేసినవారే.. అప్పట్లో ఆయన ఓటమి, అందులో కడపలో అనేది మా అందరికీ షాకింగే. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచీ పులివెందుల విషయంలో తన ప్రతినిధిగా అవినాష్‌రెడ్డిని జగన్‌గారు సెలక్ట్ చేసుకున్నాడు. ఆనాడు రాజశేఖరరెడ్డి గారు- వివేకా ఎలా ఉన్నారో అలానే జగన్ గారికి అవినాష్ అలా ఉన్నాడు. ఆయనే 2014లో ఎంపీ అభ్యర్థి అయ్యాడు... అందరితో కలిసిపోయి మంచి మెజార్టీతో గెలిచాడు. అధికార దర్పం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తిని కాదని వేరే ఆలోచన ఎందుకొస్తుంది..? ఆయన పెట్టిన పార్టీ... ఆయన పైకి తెచ్చుకున్న పార్టీ. టికెట్ లు ఎవరికివ్వాలని నిర్ణయించే వ్యక్తి జగన్ గారే.. కుటుంబ సభ్యులకు ఆలోచన ఉండొచ్చు...అడగొచ్చు...కానీ నిర్ణయం జగన్ గారిదే కదా.. నిర్ణయం అయిపోయి, సరైన అభ్యర్థిని ఎంచుకున్నారు అని అందరూ అనుకున్నాక మార్పు అనే ప్రశ్న ఎక్కడుంది..? షర్మిలమ్మను వివేకా అడగొచ్చు..ఒప్పించవచ్చు...కానీ ఇవ్వాల్సింది ఎవరు..? ఆల్ రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు... జగన్ గారు తనకుతానుగా పిక్ చేసుకున్న వ్యక్తి అవినాష్. ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీనా...నా గ్రూపు, నా బలం అనుకోడానికి..? పార్టీ పెట్టినప్పటి నుంచీ వివేకా ఏమైనా పార్టీని నడిపారా.? మొదటి పోరాటమే వారిద్దరి మధ్య జరిగింది. ఆ రోజు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం అంతా ఏకమై జగన్ గారి తల్లిగారిని ఓడించాలని చూశారు. అప్పుడు వారి కుట్రలు, కుతంత్రాలు సక్సెస్ అయ్యి ఒకవేళ వివేకానందరెడ్డి గారు గెలిచి ఉంటే జగన్ గారి పరిస్థితి ఏంటి..? దయతో గెలవలేదు..ఆయనపై నమ్మకం ఉంది కాబట్టి ఆయన్ను గెలిపించారు. అంత దెబ్బ కొట్టాలని చూసినా... తప్పనిసరి అయ్యి ఆయన ట్రై చేశారు.. పట్టించుకోవద్దంటూ జగన్ గారు ఆనాడు అన్నారు. ఆనాడు ఇదంతా వ్యక్తిగతంగా ఆయన చేశాడు అని ఇప్పటికీ మేం అనుకోవడం లేదు. ఆనాడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి.. నేను పోటీకి సై అన్నాడు. వారందరి వత్తిడితోనే...ఇంకే కారణాలో ఆ ఎన్నికల్లో ట్రై చేశాడు. - కానీ, మంచి మనసుతో కొడుకుకు మద్దతుగా ఉండాలనుకున్నాడు. - మళ్ళీ వివేకానందరెడ్డిగారు వెనక్కు వస్తే సాదరంగా పార్టీలోకి తీసుకుంది జగన్ గారే. ఆయనకు పూర్తి బాధ్యతలు ఇచ్చి గౌరవించారు. జరిగిందేదో జరిగింది...వివేకాతో ఎవరూ పరుషంగా మాట్లాడవద్దని జగన్ గారు అందరికీ చెప్పారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వివేకా..జగన్ గారికి, అవినాష్‌కి బ్లెస్సింగ్స్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటిది ఆయన హత్య జరిగితే షాకింగ్ ఎఫెక్ట్ తగిలేది అవినాష్ రెడ్డికే. గుంటనక్కలకు సీబీఐ లాంటి ప్లాట్‌ఫాం దొరికింది: ఆవైపు పదిపన్నెండు కారణాలున్నాయి. సెంకండ్ మ్యారేజీ, బిడ్డ పుట్టడం అన్నీ జరిగాయి. కొడుకుకు ఆయన ఆస్తిలో 25 శాతం పెడతానన్నాడని చెప్తున్నారు. రాజకీయాల్లో ఉండే విభేదాలు హత్యలకు పెద్దగా దారితీసేవి కావు.. ఆస్తి కానీ, కుటుంబ పరువు విషయాలే ప్రధానంగా హత్యలకు దారితీస్తాయి... షమీమ్ స్టేట్‌మెంట్లో అన్నీ ఉన్నాయి. శివప్రకాశ్‌రెడ్డి బెదిరించాడని, మనుషులను పంపించాడని ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చింది. వివేకాకు చెక్ పవర్ రద్దు చేశారు.. ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి బెంగుళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్ అన్నారు. ఆ సెటిల్‌మెంటే లేదని, ఆ ల్యాండే ఫేక్ అని ఎర్ర గంగిరెడ్డికి ముందే తెలుసు. ఆ విషయం ఎర్రగంగిరెడ్డికి తెలుసన్న విషయం సీబీఐకి కూడా ముందే తెలుసు. దస్తగిరి అప్రూవర్‌గా మారేటప్పుడు మీరు లోపల కొట్టేసిన డాక్యుమెంట్లు ఏంటని అడగాలి కదా..? షమీమ్‌ను శివప్రకాశ్‌రెడ్డి బెదిరించాడు అంటే ఆతన్ని ఏమీ అడగరు..? కేవలం వారికి పనికొచ్చే స్టేట్‌మెంట్లు తీసుకుని గుదిగుచ్చి ఒకచోట పెట్టడం తప్ప ఆ చార్జిషీట్ లో ఏమీలేదు. జగన్ గారిని ఫీల్డ్‌లో ఎదుర్కోడానికి ఏ అస్త్రం లేక..శక్తి లేక...శక్తులు అన్నీ ఉడిగిపోయిన గుంటనక్కలన్నీ ఒకచోట చేరి, జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీసేందుకు సీబీఐ లాంటి ప్లాట్‌ఫాం వాళ్ళకు దొరికింది. పది బండలు వేస్తే జనం ఒకటన్నా నమ్మకపోతారా అన్నట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానివల్ల వారికి ఓట్లు రావు కానీ...మేం ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్ రెడీ కోర్టు ఒక సారి మొట్టికాయలు వేసింది. ఆనాడు జడ్జిగారు ప్రశ్నిస్తే ఆంధ్రజ్యోతి డిబేట్‌లో నేరుగా జడ్జి అమ్ముడుపోయాడంటూ అంటగట్టేశారు.. వీరు జర్నలిజం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ.. ఉగ్రవాదులకంటే ఎక్కువై పోయారు. అక్కడ ఆధారాలు లేవు... ఈ కేసు కోర్టులో నిలబడదు. కోర్టులో నిలబడాలని కోరిక వారికీ లేదు... వారికి వివేకానందరెడ్డిపై గౌరవం ఏమైనా ఉందా..? ఉంటే ఆనాడు ఆంధ్రజ్యోతి అలాంటి వార్తలు రాస్తుందా..? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వస్తుంది..? వారు కరివేపాకులా వీరిని వాడుకుంటున్నారు. 2024 ఎన్నికల లోపు జగన్ గారిని విసిగించడం ఎలా అని వారు ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత వారిని అనాథల్లా పక్కన పడేస్తారు. కేవలం విషప్రచారం చేయడానికి మాత్రమే ఇది పనికి వస్తుంది... అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.