ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే ఎందుకంత కక్ష..?

చంద్రబాబు అండ్‌ కో పెట్టుబడుల రాజధాని అమరావతి

రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదా..? 29 గ్రామాలు సంతోషంగా ఉంటే చాలా..?

సీఆర్‌డీఏ అంటే.. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

అన్నం పెట్టిన చేతిని నరికేయాలనే ఆలోచనలో చంద్రబాబు

రామోజీ ఈనాడు, డాల్ఫిన్‌ హోటల్‌ వ్యాపారం పుట్టింది విశాఖలోనే..

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ భావించారు

ఉత్తరాంధ్రవాసిగా చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నా..

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలంటే ఎందుకంత కక్ష, ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారని అభివృద్ధిని అడ్డుకుంటున్నాడో చంద్రబాబు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. తాను కొనుగోలు చేసిన అమరావతి ప్రాంత భూములు, 29 గ్రామాలు తప్పితే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదన్న చందంగా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరును ఉత్తరాంధ్ర, విశాఖపట్నం వాసిగా తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సీఆర్‌డీఏ అంటే.. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. చంద్రబాబును చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలు చీదరించుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. విశాఖ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే..

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనకబడిపోయాయి.. వాటిని అభివృద్ధి చేయాలని అనేక సంస్థలు రిపోర్టు ఇచ్చాయి. అటువంటి ప్రాంతాలకు మేలు చేయాలనే ఉద్దేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు న్యాయరాజధాని, విశాఖ పరిపాలన రాజధాని, అమరావతి శాసన రాజధానిగా ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావించారు.  వెనుకబడిన ప్రాంతాలకు మేలు చేస్తామంటే చంద్రబాబు అండ్‌ కో చూస్తూ తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు ఏమైపోయినా, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. తాను కొనుగోలు చేసిన అమరావతి ప్రాంత భూములు, 29 గ్రామాలు తప్పితే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. 

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏం పాపం, ఏం తప్పు చేశారు. ఎందుకు ఈ ప్రాంత ప్రజల కడుపుకొట్టాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారో సమాధానం చెప్పాలి. ఎందుకు మాపై కక్షగట్టావు, ఎందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నాడో సమాధానం చెప్పాలి. చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. గతంలో విశాఖపట్నం వస్తే.. కనీసం అడుగు కూడా పెట్టనివ్వని పరిస్థితులు చంద్రబాబు ఎదుర్కొన్నాడు. 

గడిచిన 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్ర ప్రాంతం అండగా నిలబడిన సందర్భాలను చంద్రబాబు మర్చిపోయాడు. అన్నం పెట్టిన చేతిని నరికేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు.  రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు, ఆయన కొడుకు, ఆ పార్టీ నాయకులు ఈరోజు పండగ చేసుకుంటున్నారు. 29 గ్రామాలకు మంచి జరిగిందనే ఉద్దేశంలో సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి అనేది పేదవాడి రాజధాని కాదు. చంద్రబాబు అండ్‌ కో పెట్టుబడిదారుల తాలూకా రాజధాని అని ప్రతిపక్షంలో పోరాటం చేసిన నాటి నుంచి చెబుతున్నాం.  

సీఆర్‌డీఏ అంటే అమరావతి క్యాపిటల్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కాదు.. చంద్రబాబు రియలెస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు చెబుతూనే ఉన్నాం. రాష్ట్ర విభజన తరువాత వేసిన కమిటీల్లో కూడా విశాఖపట్నం అన్ని రకాలుగా అనువుగా ఉందని, చిన్న తోడ్పాటును ఇస్తే విశాఖ నగరం దేశంలో ఉన్న అనేక పెద్ద నగరాలతో పోటీ పడుతుందని చెప్పారు. అన్ని రకాలుగా అన్ని అవకాశాలు కలిగిన నగరం విశాఖ. ఇలాంటి నగరం మీద విషం చిమ్మి నష్టం కలిగించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీశారు. 

ఈనాడు పుట్టింది విశాఖలో, రామోజీరావు డాల్ఫిన్‌ హోటల్‌ వ్యాపారం కూడా విశాఖ నుంచే మొదలుపెట్టారు. అన్నం పెట్టిన ప్రాంతానికి మేలు చేయకపోగా.. నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ అయితే.. విశాఖ మహాసముద్రంలో మునిగిపోతుందని ప్రచారం చేశాడు. విశాఖలో పెట్టుబడి పెడితే వృథా అయిపోతున్నట్టు రాతలు రాశాడు. తెలుగుదేశం పార్టీ, వారి అనుకూల వ్యక్తుల వ్యాపారాలకు, రాజకీయ అవసరాలకు విశాఖ కావాలి.. కానీ, విశాఖకు మేలు జరుగుతుంటే అడ్డుకుంటారా..? కర్నూలును న్యాయరాజధాని పెట్టాలని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్, చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది వైయస్‌ఆర్‌ కుటుంబం మాత్రమే. 
 

Back to Top