చంద్రబాబు మ్యూజిక్‌కు ఏపీ బీజేపీ నేతల డ్యాన్స్‌లు

మంత్రి గౌతమ్‌రెడ్డి మరణంపై టీడీపీ, బీజేపీ మాటలు సిగ్గుచేటు

దోమలతో యుద్ధం చేసే పహిల్‌వాన్‌లా జీవీఎల్‌ చాలెంజ్‌లు

సుజనాచౌదరి ఆడించే ఆటలో తోలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారు

నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజల చేతుల్లో బడితపూజ తప్పదు

కేంద్ర పథకాలకు ఎక్కడ స్టాంపు వేసుకున్నామో చూపించండి..? 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మఒడి, ఆసరా, చేయూత ఉన్నాయా..?

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే పార్థసారధి ధ్వజం

తాడేపల్లి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వారి కుటుంబం, సీఎం వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ బాధించిందని పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. మంత్రి మేకపాటి మరణంపై తెలుగుదేశం పార్టీ, బీజేపీ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. అసలు వారు పశువులా లేక సంస్కారహీనులా, లజ్జా, బిడియం, మానవత్వం ఏమైనా ఉన్నాయా అనే సందేహం వస్తుందన్నారు. అందరిలో మంచి పేరుతెచ్చుకొని, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడిన యువ నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాలమరణంతో ప్రజలంతా బాధతో కన్నీటి వీడ్కోలు చెబుతున్న సమయంలో టీడీపీ, బీజేపీ నేతల మాటలు వింటే అసహ్యం వేస్తుందన్నారు. వైయస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరినైనా చిరునవ్వుతో పలకరించి పక్కనకూర్చోబెట్టుకొని సమస్యలు పరిష్కరించే వ్యక్తి చనిపోతే మానవత్వం ఉన్నవారు ఎవరైనా బాధను వ్యక్తపరుస్తారు. కానీ, విశాఖలో టీడీపీ నాయకుడు సంస్కార హీనంగా మాట్లాడాడని దుయ్యబట్టారు. సీఎం వైయస్‌ జగన్‌కు గౌతమ్‌రెడ్డి ఎంత సన్నిహితుడో అందరికీ తెలుసన్నారు. 

ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఇంకా ఏం మాట్లాడారంటే..
సుజనా చౌదరి ఆడించే ఆటలో బీజేపీ నేతలు తోలుబొమ్మల్లా వ్యవహరించే తీరుచూస్తుంటే నవ్వొస్తుంది. ఐవైఆర్‌ కృష్ణారావు వయస్సులో పెద్దాయన, చదువుకున్నాడు. నోరుంది కదా ఏది మాట్లాడినా చెలామణి అవుతుందని జీవీఎల్‌ మాట్లాడుతున్నాడు. రూ.15 వేల కోట్లు విలువ చేసే 6 ప్రాజెక్టులు ఇచ్చాం. దాంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది.. ప్రజలు బతుకుతున్నారు అన్నట్టుగా జీవీఎల్‌ మాట్లాడుతున్నారు. 

దోమలతో యుద్ధం చేసే పహిల్‌వాన్‌లా ఆర్థిక శాఖ మంత్రికి జీవీఎల్‌ చాలెంజ్‌లు విసురుతున్నాడు. జీవీఎల్‌కు దమ్ముంటే వెంటనే మీడియా ముందుకువచ్చి రూ.15 వేల కోట్లు, 6 ప్రాజెక్టులు.. ప్రత్యేక హోదాకు, పోలవరానికి సమానం అని చెప్పండి. పార్లమెంట్‌ సాక్షిగా ఆమోదించిన విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, స్టీల్‌ ప్లాంట్, పోర్టులు అన్నీ బీజేపీ అగ్రనాయకత్వంపై పోరాటం చేసి సాధించండి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజలంతా మీకు బడితపూజ చేస్తారు. 

ఐవైఆర్‌ కృష్ణారావు టీడీపీ గవర్నమెంట్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా చేశారు. ఆ రోజు కనిపించలేదా..? చంద్రబాబు రూ.3.57లక్షల కోట్లు అప్పు చేస్తుంటే ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. బడ్జెట్‌ అంటే కేంద్రానిది.. బడ్జెట్‌ కానిది అయితే ఏపీ బడ్జెట్‌ అంట. అదానీ లాంటి వ్యక్తులను పెంచిపోషించేది బడ్జెట్‌ కేంద్రానిది అయితే.. ఈ రాష్ట్రంలోనిరుపేదలు తలెత్తుకొని జీవించే బడ్జెట్‌ ఏపీది. ఏపీ అప్పులు కేంద్ర ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే చేస్తుందని మీకు తెలియదా..? కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. దాన్ని మీరెందుకు ప్రశ్నించడం లేదు. 

కరోనా సమయంలో కేంద్రం కంటే మిన్నగా పేదలను ఆదుకుంది సీఎం వైయస్‌ జగన్‌. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్‌ రీఓపెన్‌ చేస్తే 1.5 లక్షల పిల్లలు స్కూల్స్‌ మానేశారు. కారణం ఏంటంటే.. కరోనా వల్ల ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవ్వడం అని ఈనాడు పత్రికలో రాశారు. కానీ, ఆంధ్రరాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. దాదాపు 1.50 లక్షల కోట్లు రెండున్నరేళ్లలో ప్రతి పేదవాడికి సీఎం వైయస్‌ జగన్‌ అందజేశారు. కరోనాను సైతం రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. 

చంద్రబాబు మ్యూజిక్‌కు ఏపీ బీజేపీ నాయకులు డ్యాన్స్‌లు వేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తయారు చేసిన వ్యవస్థతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలు కూడా ఆ వ్యవస్థలను ఫాలో అవుతారని ఆశిస్తున్నానని  ప్రధాని మోడీ స్వయంగా చెప్పారు. చంద్రబాబుకు తాళాలు, మద్దెలదరువు వేయడానికి జీవీఎల్, ఐవైఆర్‌ వచ్చారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టాంపు వేసుకున్నామంటున్నారు. అమ్మఒడి పథకం కేంద్రం అమలు చేస్తుందా..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మఒడి ఉందా..? వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత, మిగతా కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనైనా ఉన్నాయా..? రాష్ట్రంలో ఎంతమందికి కేంద్రం బియ్యం సరఫరా చేస్తుంది..? సీఎం వైయస్‌ జగన్‌ ఎంత మంది పేదలకు ఇస్తుందో సమాధానం చెప్పగలరా..? కేంద్రం పీఎం కిసాన్‌ ద్వారా 22 లక్షల కంటే తక్కువ మందికి రూ.6 వేలు ఇస్తే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం 50.58 లక్షల మందికి రూ.13,500 ఇస్తుంది. మీ పథకాలకు ఎక్కడ స్టాంపు వేసుకున్నాం. 

కేవలం చంద్రబాబుకు మేలు చేయడానికే రాష్ట్ర బీజేపీ పనిచేస్తుంది. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయించడానికి బీజేపీ నేతలు ఎందుకు ప్రయత్నించడం లేదు. ఆ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన లక్షల కోట్ల రూపాయలను ఎందుకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ–తెలంగాణ మధ్య తాంబూలం ఇచ్చి కొట్టుకోమన్నట్టు మీరూ మీరూ సెటిల్‌చేసుకోమని చెప్పి బాధ్యతల నుంచి పిరికిపందల్లా పారిపోతున్నారు. బాధ్యత ఉన్నట్టు అయితే.. చట్టానికి లోబడి ఏపీకి చేయాల్సిన మేలు ఎందుకు చేయడం లేదు. 

అంబానీలకో.. అదానీలకో, వ్యాపారస్తులకు లాభంచేసే క్యాపిటల్‌ వర్క్స్‌ చేస్తేనే క్యాపిటల్‌ ప్రాజెక్టులు గుర్తిస్తారా..? పవర్‌ ప్లాంట్లు, ఆరు లేన్ల రోడ్లు, వేలకోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చే పథకాలు చేస్తేనే అభివృద్ధి అని భావిస్తున్నారా..? నాడు–నేడుతో స్కూళ్లు, ఆస్పత్రులను ఏ విధంగా తీర్చిదిద్దామో చూడమని ఐవైఆర్‌ను కోరుతున్నాను. నాడు–నేడుకు కేంద్రం నుంచి ఆర్థికసాయం ఏమైనా చేస్తున్నారా..? రాష్ట్రంలో 28 లక్షల మందికి దాదాపు రూ.30–40 వేల కోట్లు ఖర్చు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. పేదలకు మేలు చేస్తే క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌ కాదా..? 
 

Back to Top