తిరుపతి: చంద్రబాబు ఒక అథముడు, మోసకారి అంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు దిట్ట అని ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన నివాసంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వేధింపులు: – సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో వారి వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయన్న భయంతో కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఇప్పటికే 600 మందికిపైగా పైగా కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. దాదాపు 147 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి వేధించారు. – వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి వైయస్ షర్మిల, విజయమ్మ మీద ఐ–టీడీపీ కార్యకర్తలే నీచమైన పోస్టులు పెట్టారని తెలిసి, అతణ్ని పోలీసులు అరెస్టు చేశారని తెలిసి కూడా, తన తల్లిపై జగనే పెట్టించాడని అసెంబ్లీలో చంద్రబాబు నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేశాడు. – చంద్రబాబు చేతుల్లో ఉన్న ప్రచార సాధనాలను చూసుకుని ఆయన మిడిసి పడుతున్నాడు. తప్పును కూడా ఒప్పు చేయొచ్చని, రాష్ట్ర అప్పుల విషయంలో ఇన్నాళ్లు అదే చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చానని విర్రవీగిపోతున్నాడు. – జనసేన, బీజేపీ అధ్యక్షులుగా ఉన్న తనవారితో రాష్ట్ర అప్పులపై గోబెల్స్ ప్రచారం చేయించి విడతల వారీగా అప్పులను పెంచుకుంటూ పోయిన చంద్రబాబు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్‌తో అవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వమే అంగీకరించింది. వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే: – ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం దివాళా తీసిందని, వ్యవస్థలన్నీ నాశనమైతే తానే పునరుద్ధరిస్తున్నానంటూ, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడతున్నాడు. – 5 నెలల్లో ఏ హామీ అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పటికే రూ.57 వేల కోట్లు అప్పులు చేసింది. ఆ డబ్బంతా ఏం చేసిందో లెక్కలు చెప్పగలరా? ‘ఒక చరిత్ర. కొన్ని నిజాలు’ పుస్తకం: – చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు ఆనాడే.. ‘ఒక చరిత్ర కొన్ని నిజాలు’ అనే పుస్తకం రాశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పుస్తకానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఆ పుస్తకంలో కొన్ని అంశాలు ఇవీ.. – ‘టీడీపీలో చేరమని అడగడానికి దగ్గుబాటి వెళ్లినప్పుడు, కాగితం మీద లెక్కలు రాస్తూ.. ఈ మనిషి జేబులో నుంచి పైసా కూడా తీయడు. సినిమా మోజులో పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌కి 5 శాతం ఓట్లు కూడా రావని చెప్పాడు. తాను మంత్రి పదవి వదులుకుని కాంగ్రెస్ నుంచి ఎలా వస్తానని ఎద్దేవా చేశాడు’. – మరో సందర్భంలో ఆయన్ను ఇదే విషయం అడిగితే, తాను పత్రికల్లో మాట్లాడానని ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన మొదటి పేజీ బ్యానర్ వార్తలను దగ్గుబాటికి చూపించిన విషయం ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకంలో రాశారు. –‘తెలుగుదేశం ఒక గాలి పార్టీ. దానికి భవిష్యత్తు లేదు. మామ మీద ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధం. పెళ్లికి సహకరించడంతో పాటు, చంద్రబాబుకి సీటు ఇప్పించిన జయచంద్రనాయుడు తెలుగుదేశంలో చేరడానికి వెళ్తే నచ్చ చెప్పి చేరకుండా చేశాడు. ఇదే చంద్రబాబు అదే టీడీపీలో చేరాక, జయచంద్రనాయుడిని పార్టీలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు’. – చంద్రబాబు తెలుగుదేశం పార్గీలోకి వచ్చిన తర్వాతనే దోచుకునే సంస్కృతి మొదలైంది. (పేజీ నెం:34) –‘చంద్రబాబుకి మాట్లాడటం కూడా చేతనయ్యేది కాదు. తెలుగుదేశం కార్యకర్తల కోసం శిబిరాలు ఏర్పాటు చేస్టున్నట్లు చూపించి ఉపన్యాసాలు నేర్చుకోవడానికి ఏర్పాటు చేశాడు’. –‘1984లో నాదెండ్ల భాస్కర్‌రావు, ఎన్టీఆర్‌ను దించేసినప్పుడు ఎమ్మెల్యేలందర్నీ రామకృష్ణ స్టూడియోకి తరలించే కార్యక్రమాన్ని తానే దగ్గరుండి నడిపించినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నాడు. కానీ, ఆ నాటకానికి చంద్రబాబే అసలు కారణం. ఎప్పటికైనా తనకు అడ్డొస్తారనే కారణంతో ఎన్టీఆర్ తర్వాత ఎవరూ ఉండకూడదనేది చంద్రబాబు ఉద్దేశం. అందర్నీ క్యాంపులో ఉంచినట్టు రామారావు దగ్గర పరపతి పెంచుకున్నాడు. మీడియా ఛానళ్ల సపోర్టుతో బయట కూడా ఇలాగే ట్రబుల్ షూటర్‌గా ప్రచారం చేయించుకున్నాడు. (పేజీ నెం:44). చంద్రబాబు అనేవాడు మేనేజ్‌మెంట్ చేసుకునే దొంగ అని 20 ఏళ్ల కిందటే చెప్పాడు’. –‘1985 తిరిగి టీడీపీ ప్రభుత్వం వచ్చాక, సారా బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. ఆ ప్లాంట్‌ను తమిళనాడుకు చెందిన పురుషోత్తంకు అప్పగించాలని చంద్రబాబు అనుకున్నాడు. బాబు స్వయంగా తన తెల్ల అంబాసిడర్ కారు నడుపుకుంటూ వెళ్లి బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌కు వెళ్లి మూడు కోట్లు గోతం సంచుల్లో నింపుకుని వచ్చాడు. కేరళ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యుడు ఉన్నికృష్ణన్ ఆ డీల్ చేశాడు. ఆయన ఉపేంద్రకు చాలా సన్నిహితుడు. డబ్బులు తీసుకునే విధానం గతంలో టీడీపీలో లేదు. చంద్రబాబే ఆద్యుడు. ఎన్టీఆర్ మాత్రం ప్రైవేటు వ్యక్తులకు ఆ ప్లాంట్ అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు’. – ‘కానీ చంద్రబాబు తీరు ఇలాగే కొనసాగుతుండేది. కడప నుంచి వచ్చిన బలరాంరెడ్డికి నష్టాల్లో ఉన్న తన విష్ణుప్రియ హోటల్స్‌ను అధిక మొత్తానికి అప్పగించి ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చాడు. నష్టాల్లో ఉన్న భువనేశ్వరి కార్బైడ్స్ పరిశ్రమను రేణుకా చౌదరికి ఇచ్చి ఆమెకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాడు. జనవరిలో జరిగిన మహానాడులో చంద్రబాబు విపరీతంగా వసూలు చేయడం జరిగింది’. –‘1978 ఎన్నికల్లో గెల్చిన సుబ్రహ్మణ్యంనాయుడు అనే వ్యక్తి చంద్రబాబు గురించి తనతో అన్న మాటలంటూ.. దగ్గుబాటి ఆ పుస్తకంలో ఇలా రాశారు.. అప్పుడు చంద్రబాబు మంత్రి కావడానికి రూ.5 లక్షలు కాంగ్రెస్ వారికి సమర్పించుకున్నాడు. మద్రాస్ సవేరా హోటల్‌లో ఎన్నో చెయ్యరానివి, చెప్పలేని పనులు చేశాడని, అతడితో ఉన్న అప్పతి శ్రీకాళహస్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పాడు’. –‘చంద్రబాబును టార్చ్‌లైట్ మంత్రి అనేవారు. చిన్ననీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు కమిషన్లు ఇవ్వలేదని అర్థరాత్రి టార్చ్‌లైట్ పట్టుకుని తనిఖీల పేరుతో వెళ్లి వేధించాడు. దాంతో వారంతా భయపడి కమిషన్లు సమర్పించుకున్నారు. ఆనాటి నుంచి ఆయన్ను ఇరిగేషన్ మంత్రి అనడం మానేసి టార్చిలైట్ మంత్రి అనడం మొదలైంది’. – (పుస్తకంలోని 48, 50 పేజీల్లో)..‘చంద్రబాబు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు.. ఒకావిడ ఆయన గది వద్దకు రూ.10 కట్టలు చూపించి ఆ డబ్బుతో తన కొడుక్కి ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటే.. చంద్రబాబు ఆమెను వెంటనే పోలీసులకు పట్టించాడు. ఆ నేపథ్యంలో పత్రికల్లో ఒక కార్టూన్ వచ్చింది. ఏమమ్మా, చంద్రబాబు అంత చౌకగా కనిపిస్తున్నాడా?. కనీసం లక్ష కూడా పలక్కపోతే ఎలా అని విమర్శించారు. ఆరోజు పార్టీలో జెండాలు, బ్యానర్లు, అన్నీ తయారు చేసే పంపేవాళ్లం. దాని ఖర్చు కోట్లలో ఉండేది. ఆ సామాగ్రి కొనుగోళ్లలో కూడా చంద్రబాబు కమిషన్లు తీసుకునేవాడు. దీనికి పార్టీ కేంద్ర కార్యదర్శి భుజంగరావు, అంబటి బ్రాహ్మణయ్య సాక్ష్యం. 1989 ఎన్నికలప్పుడు మనిద్దరం ఒకేసారి అసెంబ్లీకి పోటీ చేయొద్దని దగ్గుబాటిని ఒప్పించి తాను పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆరోజు చెప్పి, ఆర్నెళ్ల తర్వాత మాత్రం ఆయన కుప్పం సీటు కోసం పట్టుబట్టాడు. ఎన్టీఆర్ చంద్రగిరి నుంచి పోటీ చేయమని కోరినా కుప్పమే కావాలని పట్టుబట్టి తీసుకున్నాడు. ఎత్తుగడలు వేసి తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు అవకాశవాది’. –‘నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీరాంసాగర్ రూ.300 కోట్ల టెండర్లలో గుత్తేదారుల ప్రిక్వాలిఫికేషన్ గురించి, దాంట్లో అవకతవకల గురించి నేను ప్రస్తావించడం జరిగింది. దీనిపై స్పీకర్ దగ్గరకు పరిశీలనకు పంపినప్పుడు ఆ కమిటీలో చంద్రబాబు కూడా మెంబర్. కానీ రెండు రోజుల తర్వాత ఏ అవకతవకలు జరగలేదని టీడీపీ నుంచి ఆయన రిపోర్ట్ ఇస్తే.. చంద్రబాబును పిలిపించిన ఎన్టీఆర్ చెప్పనలవి కాని భాషలో చీవాట్లు పెట్టారు. పార్టీని తాకట్టు పెడుతున్నాడని, అమ్ముడుపోయాడని కడిగేశాడు. ఆ టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు చంద్రబాబుకి పెద్ద మొత్తంలో సమర్పించుకున్నారని ఎన్టీఆర్‌కి తెలియవచ్చింది’. –‘చంద్రబాబు 20 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆందోళన నిర్వహిస్తే.. ఒక్క బస్సు కూడా తగలబడకుండా, హింస చెలరేగకుండా, ఒక్క పెట్రోల్ బాంబు వేయకుండా జరిగే ఉద్యమం ఉద్యమమే కాదంటూ, వెంటనే తనవారిని బరిలోకి దించి బస్సులను తగలబెట్టించాడు. తన స్వార్థం కోసం ఆర్టీసీ బస్సుల్ని తగలబెట్టించడానికి ఏమాత్రం సంకోచించడు’. –‘రేణుకా చౌదరిని కర్నూలు పార్లమెంట్‌కి పోటీ చేయించినప్పుడు, ఆమె ఎన్టీఆర్‌తో విభేదించి బయటకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు, ఆమెతో ఎన్టీఆర్‌తో తిట్టించాడు. పార్టీ నుంచి సస్పెండ్ కాకుండా చూస్తానని చెప్పి, ఆమెను ఒప్పించి మరింత రెచ్చగొట్టాడు. రేణుకా చౌదరిని పార్టీ నుంచి బహిష్కరించడానికి జరిగిన చర్చలో డిసిప్లినరీ మెంబర్‌గా ఉన్న చంద్రబాబు హాజరుకాలేదు. మరుసటి రోజు కుప్పం నుంచి తిరిగి రాగానే చంద్రబాబును ఎన్టీఆర్‌గారు భారీగా చీవాట్లు పెట్టారు. ఇంకోసారి ఈ పని చేశారంటే చెప్పుతో కొడతానని కూడా అన్నారు’. –‘ఎన్టీఆర్ దగ్గర ప్రాపకం పెంచుకోవడానికి తానే ఒక సమస్యను సృషించి తానే పరిష్కరించినట్టు పత్రికల్లో రాయించేవాడు. ఎవరికైతే పార్టీ సీట్లు దక్కాయో, వారి దగ్గరకు పోయి తానే సీటు ఇప్పించినట్టు ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకి అలవాటు. ఆ విధంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్, దేవినేని రమణ వంటి వారికి తాను (దగ్గుపాటి) సీట్లు ఇప్పిస్తే, తానే (చంద్రబాబు) ఇప్పించానని చెప్పుకున్నారని, అలాగే నిమ్మగడ్డ రమేశ్‌ను తాను (దగ్గుపాటి) టీటీడీ ఈఓగా వేయిస్తే, దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు’. –‘లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్‌గారు వివాహం చేసుకున్న తర్వాత తన వారికి సీట్లు రావని తెలిసిన తర్వాత.. లక్ష్మీపార్వతిని ఇంప్రెస్ చేసి సీట్లు తెచ్చుకోండని సలహాలు ఇచ్చేవాడు’. –‘రామారావుగారు లక్ష్మీపార్వతిని వివాహమాడటానికి ముందు ఆమెపై చంద్రబాబు ఎన్టీఆర్ ఎదుటే తీవ్రమైన అభియోగం చేశారు. లక్ష్మీపార్వతి కొంతమందితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని, వారెవరో కూడా తనకు తెలుసని చెప్పాడు. వారిలో ఒకరు రామారావు దగ్గర పని చేసే సెక్యూరిటీ ఆఫీసర్. మరొకరు చిక్కపడల్లి నివాసి అయిన విజయలక్ష్మి కుమారుడు. ఆవిడ లక్ష్మీపార్వతి కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. ఈ అభియోగాన్ని నిరూపించమని చంద్రబాబును ఎన్టీఆర్ ఆదేశించినట్టు, లక్ష్మీ పార్వతి తనే స్వయంగా తన పుస్తకంలో రాసుకున్నట్టు దగ్గుబాటి రాశారు. లక్ష్మీపార్వతిని వ్యతిరేకిస్తున్నట్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చెబుతూనే 1994లో సంధి చేసుకునే ప్రయత్నం చేశాడు’. –‘లక్ష్మీపార్వతి, చంద్రబాబుకి జరిగిన ఒప్పందంలో ఇకమీదట ఆమె జోలికి రానని ప్రమాణం చేయమని కోరితే చంద్రబాబు నిస్సందేహంగా తన బిడ్డ లోకేశ్ మీద ప్రమాణం చేశాడు. కానీ తర్వాత లక్ష్మీపార్వతి ఈ విషయాలు ఎన్టీఆర్ దగ్గర ఉటంకిస్తే.. లక్ష్మీ, అతను కాళ్లకు దండం పెట్టి లాగేస్తాడు. పిచ్చిదానా అతడ్ని క్షమించడం వలన మనకు జరిగే మంచి ఏమీ లేదు. పాముకు పాలు పోస్టే నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పాడు’. –‘ఎన్నికలయ్యాక కూడా తాను ముఖ్యమంత్రి కావడం కోసం ఎమ్మెల్యేల సైన్యాన్ని కూడా చంద్రబాబు సిద్ధం చేసుకున్నాడు’. –‘మద్యపాన నిషేధం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ హెల్త్ పర్మిట్లు ఇస్తే, వాటిని రద్దు చేస్తున్నానని చంద్రబాబు ఆయన బయట ఉన్నప్పుడు ప్రకటన చేశాడు’. –‘ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చంద్రబాబు ప్రవర్తించిన తీరు గురించి దగ్గుబాటి తన పుస్తకంలో రాశాడు. కుటుంబ సభ్యులలో చంద్రబాబు మొదట బాలకృష్ణను పట్టుకున్నాడు. ఏం చెప్పి నమ్మించాడో తెలియదు కానీ, విశాఖలో షూటింగ్ కూడా వదులుకుని బాలకృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాను ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే సమయానికే చంద్రబాబు మా ఇంటి దగ్గర కింద కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య మాటలే లేవు. తనతోపాటు బాలకృష్ణ, హరికృష్ణను తనతో వెంటబెట్టుకుని వచ్చాడు. ఇంటిలిజెన్స్ ఐజీగా ఉన్న దుర్గాప్రసాద్, సీనీయర్ ఐపీఎస్ హెచ్‌జె దొర కూడా అక్కడున్నారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతానని, డిప్యూటీ సీఎం పదవి నన్ను తీసుకోమని ఆఫర్ చేశాడు. ఇలా మభ్య పెట్టే మాటలెన్నో చెబుతూ ఉంటాడు చంద్రబాబు’. –‘తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆశను చెప్పకుండానే బాలకృష్ణ, హరికృష్ణను వైస్రాయ్ హోటల్‌కు తీసుకుని వెళ్లి, నా చేత వాళ్లతో ఆ మాటలు చెప్పమని చెప్పాడు. అసలు ఇక్కడికి వాళ్లు ఎలా వచ్చారని అడిగితే ఏదో చెప్పి తీసుకొచ్చానని తీసిపారేశాడు. వారి మీద చంద్రబాబుకున్న అభిప్రాయం అది’. –‘ఎన్టీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని బాలకృష్ణ చెబితే కనీసం ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు’. –‘నేను బీజేపీలో ఉండగా ఆయన ఇంటి బయట రెండు గంటల పాటు వెయిట్ చేస్తే కనీసం గేటు కూడా తెరవకుండా పంపించి వేశాడు’. –‘ఐటీని తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకుంటాడు. కానీ ఏపీ కన్నా కర్నాటక, మహారాష్ట్ర, మద్రాసు, ఢిల్లీతో ఎవరైనా పోల్చుకుంటారు. ఆ తర్వాతే మన రాష్ట్ర ఐటీ ఆదాయం ఉండేది. చంద్రబాబు దిగిపోయాక కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. కానీ చంద్రబాబు మాత్రం మీడియా మేనేజ్ చేసి తానే ఐటీని డెవలప్ చేశానన్న కీర్తి గడించాడు’. –‘బిల్ గేట్స్, బిల్ క్లింటన్ హైదరాబాద్‌కి రావడానికి తానే కారణమని చెప్పే చంద్రబాబు, ఇంగ్లిష్‌లో పట్టుమని నాలుగు మాటలు మాట్లాడలేడు. చదవలేడు. ఇప్పటికీ ఇంటర్నెట్ చూడాలంటే మరొకరి సాయం కావాలి. అలాంటిది కంప్యూటర్‌ను కూడా నేనే కనిపెట్టానని అనేంతలా మీడియాలో ప్రచారం చేసుకున్నాడు’. –‘రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేకుండానే ఈయనగారు విజన్–2020 ప్రకటించి అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకున్నాడు. తెచ్చిన పరిశ్రమలు ఏవైనా ఉంటే చెప్పాలని ఆనాడే డిమాండ్ చేశాను. ఆరోజు ప్రైవేట్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనుమతులిచ్చాడు. కానీ వాటిని స్థాపించ లేదు. వాటి గడువు పొడిగించమని కాంట్రాక్టర్లు ఆరు నెలలకోసారి చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడల్లా కమిషన్లు ఇచ్చుకోవాల్సిందే. అవి చంద్రబాబుకి ఒక పాడి కుండలా ఉండేవి. బయటకు మాత్రం విద్యుత్ రంగంలో సంస్కరణలు అని, ప్రైవేటీకరణ అని ప్రచారం చేసేవాడు’. –‘విజన్–2020 కి ఏడాదికి లక్ష కోట్లు కావాలని ఊదరగొట్టాడు. ఈ విజన్–2020 రాయడానికి ఒక విదేశీ కంపెనీకి కొన్ని కోట్లు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఏపీకి వచ్చిన స్విట్జర్లాండ్ మంత్రి తమ దేశంలో ఇలాంటి పుస్తకం ఎవరైనా రాస్తే జైల్లో అయినా పెడతారు లేదా పిచ్చాసుపత్రికైనా పంపుతారని ఘాటుగా స్పందించాడు. దాంతో విజన్–2020 ఒక కలగానే మిగిలిపోయింది. –‘పీవీ నరసింహారావు ప్రారంభించిన డ్వాక్రా సంఘాలను తానే ప్రారంభించానని ప్రచారం చేసుకుంటాడు’. –‘చంద్రబాబు హాయంలో జరిగిన కుంభకోణాల్లో ఏలేరు కుంభకోణం, భూముల నష్టపరిహారం కేసు, లిక్కర్ అమ్మకాల్లో ముడుపులు, దిల్లీరావు ప్రమేయంతో ఐఎంజీ అనే బోగస్ సంస్థకు హైదరాబాద్‌లో కొన్ని కోట్లు విలువ చేసే వెయ్యి ఎకరాల భూమిని కేవలం రూ.25 వేలకు ఆపద్ధర్మ సీఎంగా ఉండి కట్టబెట్టడం, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి దారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడం లాంటివి.. వాటిలో కొన్ని మాత్రమే’. చంద్రబాబుకు సంబంధించి ‘ఒక చరిత్ర. కొన్ని నిజాలు’ పుస్తకంలోని పలు అంశాలు వివరించిన భూమన కరుణాకర్‌రెడ్డి, ఇప్పుడు ఎక్కడ చూసినా, ఆ పుస్తకంపైనే చర్చ జరుగుతోందని, దాదాపు 5 లక్షల ఆర్డర్లు వచ్చాయని తెలుస్తోంది చెప్పారు. – మీరేమో మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడితే, మీ పార్టనర్ పురందేశ్వరిగారి భర్త రాసిన పుస్తకంలో మీరు అవినీతి పరుడని స్పష్టంగా చూపిస్తున్నారు’. చివరగా, చంద్రబాబు గురించి ఎన్‌టీఆర్ అన్న మాటలు.. గాడ్సే కన్నా అథముడు. ఔరంగజేబుకి వారసుడు. జామాత దశమ గ్రహం. దేవుడు కూడా క్షమించని ఘాతకుడు.. అవన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయని వివరించిన భూమన, చేతనైతే చంద్రబాబు ఆ పుస్తకాన్ని నిషేధించాలని సవాల్ చేశారు.