చంద్రబాబు దుర్భుద్ధి మరోసారి బట్టబయలు

శ్రీవారి లడ్డూపై ప్రధాని వద్ద అనుచిత వ్యాఖ్యలు

ప్రధాని, సీబీఐని ప్రభావితం చేసేలా బాబు మాటలు

టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజం

టీటీడీ లడ్డూపై మాట్లాడొద్దని సుప్రీంకోర్టు నిర్దేశం

అయినా ఏ మాత్రం మారని చంద్రబాబు ప్రవర్తన

ప్రధానికి లడ్డూ ఇస్తూ, ఇది కల్తీ లేనిదంటూ వ్యాఖ్య

ఎల్లో మీడియా కథనం ప్రస్తావిస్తూ భూమన ఆక్షేపణ

టీటీడీ లడ్డూపై స్వతంత్ర సిట్‌ విచారణ, నివేదిక

తనకు అనుకూలంగా తెచ్చుకునేలా బాబు కుట్ర

అందుకే లౌక్యంగా ప్రధానినీ వాడుకుంటున్న బాబు

టీటీడీ మాజీ ఛైర్మన్‌ స్పష్టీకరణ

రాజకీయాల కోసం అదేపనిగా తప్పుడు ఆరోపణలు

గత ప్రభుత్వ హయాంలో ఘనంగా తిరుమల వైభవం

ఎక్కడా తప్పు జరగలేదు. వైభవానికి భంగం వాటిల్లలేదు

దీనిపై పీఠాధిపతులతో చర్చకు సిద్ధంగా ఉన్నాం

చంద్రబాబుకు దమ్ముంటే నా సవాల్‌ స్వీకరించాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన భూమన కరుణాకర్‌రెడ్డి

 

తిరుపతి: టీటీడీ లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం ప్రధానిని కలుస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు తిరుపతి లడ్డూ ఇస్తూ..‘ఇది కల్తీ లడ్డూ కాదు సార్‌. ఇది సిసలైన స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసింది’ అని చెబితే.. ‘బాబు చమత్కారానికి మోదీ విరగబడి నవ్వారట’..అని చెప్పారు. దీని వల్ల చంద్రబాబు దుర్భుద్ధి మరోసారి బట్టబయలైందని ఆయన వెల్లడించారు. తిరుపతిలో టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

    తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరపనున్న నేపథ్యంలో, ప్రధాని మోదీతో పాటు, సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడారని, సిట్‌ నివేదిక తనకు అనుకూలంగా తెచ్చుకునేలా ఆయన కుట్ర చేశారని, అందుకే లౌక్యంగా ప్రధానిని వాడుకున్నారని భూమన ఆరోపించారు.
    స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు అదేపనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో తిరుమల వైభవంలో 
ఎక్కడా తప్పు జరగలేదని, ఆ వైభవానికి భంగం వాటిల్లలేదని తేల్చి చెప్పారు. దీనిపై పీఠాధిపతులతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన,  చంద్రబాబుకు దమ్ముంటే తన సవాల్‌కు స్పందించాలని కోరారు.
    లడ్డూ స్వీకరించిన సమయంలో ప్రధాని నవ్విన నవ్వుకు శతవిధాల అర్థాలుంటాయన్న భూమన, సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ వివాదంపై మాట్లాడకూడదన్నా, సీఎం ప్రధాని వద్ద ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అసలు నివేదిక రాకుండా, ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయకుండానే, విచారణ జరగకుండానే, బాబు ఎలా మాట్లాడుతారని నిలదీశారు. లడ్డూ ఇస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆయనను మందలించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 
    వాస్తవానికి లడ్డూపై తప్పుడు ప్రకటన చేయడమే కాకుండా దేశ ప్రధానిని కూడా తప్పు దారి పట్టించేలా చంద్రబాబు వ్యవహారం ఉందని  భూమన ఆక్షేపించారు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు మాట్లాడింది తప్పు అని దేశమంతటా ధర్మ ఘోష చేస్తే, ప్రధాని ముందు భక్తుల మనోభావాలు అపహాస్యం చేసేలా ఆయన వ్యవహరించారని గుర్తు చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అదే పనిగా ప్రయత్నించడంలో భాగమే ప్రధాని వద్ద సీఎం వ్యాఖ్యాలని అభివర్ణించారు. 
    ఏదేమైనా సిట్‌ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న టీటీడీ మాజీ ఛైర్మన్, గత ప్రభుత్వ హయాంలో తాను కానీ, తన కంటే ముందు ఛైర్మన్‌గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. 
    ‘రాజీవనేత్రుని వద్ద తప్పులు చేస్తే తట్టుకోవడం ఎవరికీ సాథ్యం కాదు. స్వామి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు శ్రీవారి లడ్డూపై ఆరోపణలు చేయడం, స్వార్థ రాజకీయం కోసం దాన్ని పదే పదే వాడుకోవడం సమంజసం కాదు. ప్రాణం కాపాడిన పరామాత్మడితో బాబు పరాచికాలు ఆడితే ఆ పైశాచిక చేష్టకు ఫలితం ఎలా ఉంటుందో ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడు. లడ్డూ కల్తీ ఆరోపణలు తీవ్రమైన నేరం. హిందూ సమాజంలో దృష్టిలో చంద్రబాబు ఓ నేరస్తుడిగా మిగిలిపోతారు’ అని భూమన కరుణాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top