తాడేపల్లి: సమాన హక్కులు, అవకాశాలు, అధికారాల కోసం మహిళలంతా గొంతెత్తి ప్రశ్నిస్తున్న రోజుల్లో ఏపీలో భద్రత కోసం మహిళలు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. సగర్వంగా తలెత్తుకుని ఆనందంగా జీవించడమే కాకుండా నవరత్నాల ద్వారా 90 శాతం పథకాల లబ్ధిదారులు మహిళలే ఉన్నారని తెలిపారు. శ్యామల ఏమన్నారంటే... మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు పడిన ఆ రోజుల్లో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.75 లక్షల కోట్లు ప్రజలకు అందజేస్తే దానిలో మూడొంతులు మహిళలే లబ్ధిదారులు. - వైయస్ జగన్ సీఎంగా దార్శనికతో వేసిన అడుగులు ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపాయి. - దిశ యాప్ ద్వారా మహిళల రక్షణకు అన్నగా నిలబడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధితుల పక్షాన ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చారు. - ఇలాంటి గొప్ప యాప్‌ను కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యం చేసింది. దిశ ప్రతులను తగలబెట్టి మహిళల రక్షణ పట్ల తమకు బాధ్యత లేదన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పకనే చెప్పారు. కాబట్టే ఈ 9 నెలల్లో మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా నిందితులను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. - మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ స్వయంగా అంగీకరించారు. - గతేడాది జూన్ నుంచి జనవరి వరకు రాష్ట్రంలో 16,809 కేసులు నమోదైనట్లు హోంమంత్రి అనిత శాసనసభ సాక్షిగా సమాధానం ఇచ్చారు. కానీ ఒక్క కేసులోనైనా నిందితులను శిక్షించి బాధితులకు న్యాయం చేశామని చెప్పలేకపోతున్నారు. - అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఒక ప్రేమోన్మాది 9వ తరగతి బాలికను నరికి చంపాడు. - నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో అత్యాచారానికి గురై చంపేసిన బాలిక శవాన్ని నేటికీ పోలీసులు కనుగోనలేకపోయారు. - గుడ్లవల్లేరు కాలేజీ విద్యార్థినులు రక్షణ కావాలని ప్రభుత్వాన్ని అడిగితే రహస్య కెమెరాలు ఎక్కడున్నాయో చూపించాలని లోకేష్ హేళన చేశాడు. - పోలీసుల కుటుంబాలకే రాష్ట్రంలో రక్షణ లేదు. ధర్మవరం వన్ టౌన్ సీఐ తల్లి కనిపించకుండాపోతే విచారణ చేసి చివరికి శవాన్ని తెచ్చి ఇచ్చారు. - పుంగనూరులో బాలికను కాపాడలేకపోయిన హోంమంత్రి రాజకీయాలు చేసొచ్చారు. - డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాను అనే వ్యక్తి అత్యాచారం చేస్తే ఆ వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు. - గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి అడుగులోనూ మహిళలకు సోదరుడిగా రక్షణ కల్పించాడు. - తల్లి గర్భంలో ఉన్న శిశువు నుంచి వృద్ధాప్యం వరకు ఎవరికి ఏ అవసరాలు ఉంటాయో గ్రహించి వారిని ప్రభుత్వం తరఫున ఆదుకున్న గొప్ప వ్యక్తి వైయస్ జగన్ తప్ప ఏపీ చరిత్రలో మరెవరూ కనిపించరు. - ఒకప్పుడు ఆడబిడ్డ పుడితే ఎలా పెంచాలో ఇబ్బంది పడే తల్లిదండ్రులు కూడా జగనన్న హయాంలో ఆడబిడ్డలను మహాలక్ష్ములుగా చూసుకునే స్థాయికి తీసుకొచ్చారు. - అలాంటి మహిళలను అబద్ధపు హామీలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తీవ్రంగా వంచించారు. - మహిళలెవరూ అడగకుండానే వైయస్ జగన్ ఆనాడే 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, చంద్రబాబు ఇప్పుడు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. - మంత్రివర్గంలో హోంమంత్రితోపాటు డిప్యూటీ సీఎంలుగా మహిళలకు అవకాశాలు కల్పించి గౌరవించారు. - రాష్ట్రంలో ఉన్న 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడు మహిళలకే కేటాయించారు. 26 జెడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలను నిలబెట్టారు. 12 మేయర్ పదవులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తం 36 పదవుల్లో 18 మంది మహిళలనే నిలబెట్టి మహిళలను రాజకీయంగా ప్రోత్సహించారు. - చంద్రబాబు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేస్తే ఆ భారాన్ని వైయస్ జగన్ భరించారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్ఎల్‌బీసీ లెక్కల ప్రకారం పొదుపు సంఘాల మహిళల పేరిట రూ. 25,571 కోట్ల రుణాన్ని నాలుగు దఫాలుగా వైయస్ జగన్ ప్రభుత్వమే తీర్చింది. మొత్తంగా 7,98,395 గ్రూపుల్లో ఉండే 7894169 మంది పేరిట ఉన్న రుణాన్ని వైయస్సార్సీపీ ప్రభుత్వమే తీర్చింది. పొదుపు సంఘాలు మళ్లీ క్రియాశీలకంగా మారాయంటే ఆ ఘనత ఖచ్చితంగా వైయస్ జగన్‌దే.. ఆ భరోసా ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదు. - గత ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని అబద్ధాలు చెబుతూ పవన్ కళ్యాణ్ ఊగిపోయారు. ఈరోజు మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చున్నారు. (మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ వీడియో ప్రదర్శిస్తూ..) - ఇన్ని అనర్థాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్‌కి పౌరుషం చచ్చిపోయందా? మహిళల భద్రత కోసం ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా నిలబడుతుందో సుగాలి ప్రీతి కేసుతో నిరూపణ అయ్యింది. - డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు కూడా మోసం చేశారు. - వైయస్ జగన్ హయాంలో డ్వాక్రారుణాలు ఆసరా పథకంతో తీరడం మొదలయ్యాక చంద్రబాబు హయాంలో గ్రూపుకి ఇచ్చే రెండు లక్షల రుణాలు ఏకంగా రూ. 20 లక్షలకు పెరిగాయి. - జగన్ నోటి నుంచి వచ్చే ప్రతి హామీ అమలై తీరుతుంది. కానీ, చంద్రబాబు చెప్పే ప్రతి హామీ వెనుక ఏదొక మోసం కనిపిస్తుంది. 50 ఏళ్లకు పింఛన్, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్ పథకాలు అసలే లేవు. (ఉచిత బస్సు స్కీం గురించి చంద్రబాబు వీడియో ప్రదర్శిస్తూ..) - ఇదే ఫ్రీ బస్ స్కీం గురించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనసభలో వివరణ ఇస్తూ ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే తిరగాలని నాలుక మడతేశారు. - ప్రజలకు కావాల్సింది తప్పు జరిగితే నిందితులకు వెంటనే శిక్ష పడే ప్రభుత్వం కావాలి. మాయమాటలు చెప్పి మోసం చేసే కూటమి ప్రభుత్వం అవసరం లేదు. చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం వైయస్సార్సీపీ ప్రభుత్వం అని గత ఐదేళ్ల పాలనతో వైయస్ జగన్ నిరూపించారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే మహిళలకు మంచి రోజులొస్తాయని హామీ ఇస్తున్నా.