గీత దాటితే ఎవరికైనా చర్యలు తప్పవు 

పరుల హక్కులకు భంగం కలిగించడం రాజ్యాంగ భక్షణే

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉంది

ఏకగ్రీవాలు వద్దనడం రాజ్యాంగ వ్యతిరేకమే..

సెక్యూరిటీ సర్టిఫికేట్‌ లేకుండా ఈ–వాచ్‌ యాప్‌ ఎలా విడుదల చేశారు..?

చంద్రబాబు ఆదేశాల మేరకే మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ ఆంక్షలు

మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఏపీ ఎలక్షన్‌ కమిషన్‌ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోందని, ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాటి నుంచి తనకేదో అతీతమైన శక్తి వచ్చినట్లుగా, ఈ ప్రపంచంలో తానొక అద్బుతమైన శక్తి అని రకరకాలుగా, రాజ్యాంగ వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రవర్తిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. సెక్యూరిటీ సర్టిఫికేట్‌ లేకుండానే ఈ–వాచ్‌ యాప్‌ను ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగేటప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వంతో సంప్రదించి ప్రశాంతంగా ఎలక్షన్‌ జరిపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రం, ఘర్షణ వాతావరణంలో ఎన్నికలు జరపాలి.. ప్రభుత్వం, ఉద్యోగులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మీద పెత్తనం చేయాలనే పద్ధతుల్లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వంపై కక్షతో తెలుగుదేశం పార్టీ, వారి మిత్రపక్షాలకు లాభం చేయాలనే పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థం అవుతుంది. 

పార్టీ రహిత ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్‌ ఏ యాక్షన్‌ తీసుకుంది. మేనిఫెస్టోను రద్దు చేయడమా..? మేనిఫెస్టో రిలీజ్‌ చేసిన ఆ పార్టీపై, నాయకుడిపై ఏ విధమైన చర్య తీసుకోకుండా లాలూచీ కుస్తీ చేసే కార్యక్రమం చేసి బాబును రక్షించుకోవాలని నిమ్మగడ్డ ప్రయత్నించాడు. 

రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఈ–వాచ్‌ అనే యాప్‌ను సెక్యూరిటీ సర్టిఫికేట్‌ లేకుండా ఎలా రిలీజ్‌ చేస్తారు. దీనిపై కోర్టుకు వెళితే.. వారం రోజుల్లో సడ్మిట్‌ చేస్తామని ఎస్‌ఈసీ చెబుతున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహకాలు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని జీఓ రిలీజ్‌ చేస్తే.. ఎస్‌ఈసీ వీల్లేదని వాదిస్తుంది. కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు జరిగితే వాటన్నింటినీ ఆపేసేయండి అని అంటున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా..? ఏకగ్రీవాలపై ఏమైనా ఫిర్యాదులు అందాయా..? 

ఏకగ్రీవాలపై పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగం, చట్టానికి వ్యతిరేకంగా, అక్రమాలకు పాల్పడితే, ఏకపక్షంగా ఎన్నికల సంఘం మాటలు విని చర్యలు తీసుకుంటే ఉద్యోగులపై యాక్షన్‌ తీసుకుంటామని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి ఇళ్లు కదలడానికి, ప్రెస్‌తో మాట్లాడేందుకు వీల్లేదని నిమ్మగడ్డ ఆంక్షలు వేశారు. ఒక వ్యక్తిని ఈ విధంగా కట్టడి చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో ఏ శక్తికి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కును వ్యతిరేకిస్తారా..? చంద్రబాబుకు చిత్తూరులో పలుకుబడి లేకుండా చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంక్షలు వేశారు. 

నిమ్మగడ్డ రాజ్యాంగం ముసుగులో పరుల శక్తులను దోచుకోవాలని చూస్తే.. రాజ్యాంగ భక్షణే ఉంటుంది. గీత దాటితే చర్యలు తప్పవు. ఇలాంటి దుర్మార్గమైన పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. ఏకగ్రీవాలను కూడా నిలిపివేయాలనే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషన్‌ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 

Back to Top