చంద్రబాబువి దింపుడు కళ్లెం ఆశలు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి

వైయస్‌ జగన్‌ నవరత్నాలను బాబు కాపీ కొడుతున్నారు

హైదరాబాద్‌: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, దింపుడు కళ్లెం ఆశలతో వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అ«ధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి విమర్శించారు. పింఛన్‌ రూ.2 వేలు పెంచుతామని వైయస్‌ జగన్‌ రెండేళ్ల క్రితమే హామీ ఇచ్చారని, చంద్రబాబు రెండు నెలల క్రితం పింఛన్‌ పెంచారని తెలిపారు. ఈ విషయాన్ని వైయస్‌ జగన్‌ అప్పుడే చెప్పారని, అయినా మనం రూ.3 వేలు ఇస్తామని జననేత ప్రకటించడంతో చంద్రబాబు మళ్లీ రూ.3 వేలు ఇస్తామని హామీ ఇవ్వడం తన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారన్నారు. పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని వైయస్‌ జగన్‌ ఇదివరకే ప్రకటించారన్నారు.

చంద్రబాబు దీన్ని కాపీ కొట్టారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ పథకాలను ఒక్కదాని తరువాత ఒకటి కాపీ కొడుతున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నలభై ఏళ్ల యువకుడికి గడగడ వణికిపోతున్నారన్నారు. అయోమయం లోకేష్‌కు మూడు మంత్రిత్వశాఖలు కట్టబెట్టారన్నారు. ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో ఆయనకు తెలియదని, ఎప్పుడు పోలింగో కూడా తెలియడం లేదన్నారు. ఇలాంటి వ్యక్తికి మూడు మంత్రిత్వ శాఖలు కేటాయించడం మన దౌర్భాగ్యమన్నారు. అసలు సరుకే లేని నారా లోకేష్‌కు చంద్రబాబు ఉద్యోగం ఇచ్చారని ఎద్దేవా చేశారు. యువతకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నాడు ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకున్నారని...మళ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రూ.1000 చొప్పున కేవలం నాలుగు లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి 27 శాతం ఐఆర్‌ ఇస్తామని, పీఆర్‌సీ సకాలంలో చెల్లిస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పారు.
 

Back to Top