రేపు విశాఖలో సీఎం చేతుల మీదుగా ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్థాపన

జీవీఎంసీ చేపడుతున్న రూ.136 కోట్ల అభివృద్ధి పనులకూ భూమిపూజ‌

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రజిని, అమర్‌నాథ్‌

విశాఖ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. నగరంలోని కైలాసపురం వద్ద దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 16 ఎకరాల్లో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం జరగనుంది.  

అదే విధంగా గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేపడుతున్న రూ.136 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల నిర్మించిన ఫార్మా ఇంకుబేషన్‌ సెంటర్, ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషన్‌ బిజినెస్‌ సెంటర్‌ ప్రాంగణాలను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను వైయస్‌ఆర్‌ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్, అధికారులు పరిశీలించారు. 

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి రేపు విశాఖకు సీఎం వైయస్‌ జగన్‌ రానున్నారని చెప్పారు. 16 ఎకరాల్లో సుమారు 12 ఎకరాల స్థలంలో మాల్‌ నిర్మించనున్నారని, మిగిలిన స్థలంలో ఐటీ స్పేస్‌ కూడా డెవలప్‌ చేసే విధంగా పారిశ్రామిక వేత్తలు ముందుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, వైజాగ్‌ టెక్నాలజీ పార్కు, ఒబేరాయ్‌ హోటల్స్‌ నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రానున్న కాలంలో విశాఖనగరంలో మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టడం ఖాయమన్నారు.  
 

Back to Top