గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు చేశాం

రేపు ఉదయం 10 గంటలకు జీఐఎస్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారు

సీఎం పిలుపు మేరకు సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామిక వేత్తలు 

3వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభం.. 4వ తేదీ మధ్యాహ్నం 2కు ముగింపు 

వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆహ్వానం మేరకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దగ్గిజ పారిశ్రామిక వేత్తలు విశాఖలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో పాల్గొననున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కోసం అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేశామన్నారు. 3వ తేదీ (రేపు) ఉదయం 9 గంటల నుంచే పారిశ్రామికవేత్తల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం జరుగుతుందని, ఉదయం 10 గంటలకు  గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

విశాఖలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని, 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈరోజు సాయంత్రానికి విశాఖకు చేరుకుంటారని, జీఐఎస్‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైయస్‌ జగన్‌ విశాఖలో ఉంటారని చెప్పారు. 4వ తేదీన సదస్సు ముగిసిన అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి బయల్దేరుతారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగావకాశాలు మెరుగుపరిచే విధంగానే కాకుండా రాష్ట్ర ఆదాయ వనరులు కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా బోగస్‌ ఎంవోయూలు ఈ సమ్మిట్‌లో ఉండవని చెప్పారు. అన్ని ఏర్పాట్లు గమనించిన తరువాతే పారిశ్రామిక వేత్తలతో ఎంవోయూలు, ఒప్పందాలు చేసుకునే కార్యక్రమం జరుగుతుందన్నారు. 
 

Back to Top