అందినకాడికి దోచుకోవడమే చంద్రబాబు పని

రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారు

సర్వేల పేరుతో వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపు

ఇదేంటని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు

చట్టాలు చుట్టాలుగా ఎల్లకాలం ఉండవు చంద్రబాబూ

సర్వేలని ఎవరైనా ఇంటికి వస్తే తిరగబడండి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విజయనగరం: నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అందినకాడికి దోచుకోవడమే పనిగా చంద్రబాబు పాలన కొనసాగిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సర్వేల పేరుతో వచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కొందరు ట్యాబ్‌లు పట్టుకొని వచ్చి ఓటర్‌ లిస్టును ట్యాలీ చేసుకుంటూ వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుల ఓట్లపై ప్రత్యేక గుర్తులు పెట్టుకొని వారి ఏజెన్సీల ద్వారా ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రశ్నించి అధికారుల ముందు పెడితే నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దీన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. సర్వేల పేరిట ఎవరైతే ఆధార్‌ కార్డులు, ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారో, ఒంటరి మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వాటిని తీవ్రంగా ఆక్షేపిస్తున్నామన్నారు. 

చట్టాలు చుట్టాలుగా మార్చుకుంటే ఎల్లకాలం అధికారం ఉండదని చంద్రబాబు,  అధికారులు గ్రహించాలన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడవద్దు. వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులు, రాజకీయ నేతలకు, ప్రజాస్వామ్యంలోని ప్రతి పౌరుడికి ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయని, నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఏ ఒక్క వ్యవస్థ చట్టబద్ధతతో ముందుకు వెళ్లిన దాఖలాలు లేవన్నారు. గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు దోరికినకాడికి దోచుకొని తినేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నారన్నారు. రూ. 90 వేల కోట్లు అప్పు ఉంటే దాన్ని రూ. 2 లక్షల కోట్లు దాటించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. దుబారా ఖర్చులకు ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారని మండిపడ్డారు. శంకుస్థాపనల పేరుతో హడావిడి చేస్తున్న ప్రభుత్వం పునాదులు కట్టిన దాఖాలాలు లేవన్నారు.

పాలన గాలికి వదిలేసి ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు మళ్లీ మోసం చేసే కార్యక్రమాలకు పూనుకున్నారన్నారు. దుర్మార్గ, నీచమైన చర్యలు అడ్డుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు బెదరరన్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో వైయస్‌ఆర్‌ సీపీపై ఎన్నో నిందలు మోపారన్నారు. వాస్తవాలు ఏంటో ప్రజలంతా చూశారన్నారు. సర్వేల రూపంలో ఎవరైనా ఇంటికి వస్తే తిరగబడాలని ప్రజలకు సూచించారు.  

Back to Top