సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైయస్ జగనే సీఎం కావాలి

మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: రాబోయే రోజుల్లో ఎస్సీ కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తమకు అందుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగాలంటే వైయ‌స్‌ జగన్‌ను మరోసారి సీఎం చేయాల్సిన అవసరం ఉంద‌ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. తాడేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, మేరుగు నాగార్జున, విశ్వరూప్‌, ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు.
 
సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఎస్సీలకు కొన్ని పథకాలు పెట్టి అవి కేవలం టీడీపీ కార్యకర్తలకు అందేలా చేసి అవినీతికి పాల్పడిన పరిస్థితి ఉందని, వాటన్నింటినీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం సరిదిద్దిందని తెలిపారు.

 ఈరోజు ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు కల్గించేలా సంస్థాగత మార్పులు, సంస్కరణలు చేస్తూ ప్రధానంగా విద్య, వైద్యం వంటి అంశాల్లో గత నాలుగు సంవత్సరాలుగా సీఎం వైయస్ జగన్ అందించిన పరిపాలన మీద ఈరోజు చర్చించాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల మీద ప్రతిపక్షాలు వక్రభాష్యంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఈరోజు తీర్మానించాం.

ప్రధానంగా ఈ ప్రభుత్వం మూల సూత్రాలు జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలనను నాలుగు సంవత్సారాలుగా ఏ విధంగా అందిస్తున్నారనే విషయంపైనా చర్చించామ‌ని తెలిపారు.  ఈ స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామాకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు.

Back to Top