విశాఖ: పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేయడం ఆయన తొందర పాటు చర్య అని.. ఏ విషయమైనా తనతో చర్చించి ఉంటే బాగుండేదని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. పార్టీలో ఆవిర్భావం నుంచి చాలా మంది ఉన్నారని.. సీఎంను కలవాలి అన్నప్పుడు తనతో మాట్లాడితే తప్పకుండా చర్చించేవాళ్లమన్నారు. ఇవాళ విశాఖపట్నం గురజాడ కాళాక్షేత్రం లో మెప్మా అర్బన్ మార్కెట్ ను వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రమేష్ బాబు నిర్ణయం తీసుకునే ముందు పార్టీ ఇన్‌ఛార్జిగా తాను ఇక్కడ ఉన్నందుకు చర్చించి ఉంటే బాగుండేదన్నారు. జిల్లా అధ్యక్షుడిగా రమేష్ బాబు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ కూడా తాను పరిష్కరించానన్నారు. ప్రజా సమస్యలపై స్పందించట్లేదు అని రమేష్ బాబు చెప్పిన మాటలు వాస్తవం కాదన్నారు. వైయస్ఆర్‌సీపీ పార్టీ వ్యవస్థాపక దినం నుంచి ఉన్న వారిని కూడా పక్కనపెట్టి రమేష్ బాబుకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చామన్నారు. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు చాలా బాగున్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, నాయకులు కొనియాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.