న్యూఢిల్లీ: బీసీ వర్గానికి చెందిన మాకు రాజ్యసభలో చోటు కల్పించడం అరుదైన సన్నివేశమని, కలలో కూడా ఊహించనిది జరిగిందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. మాపై గురుతర బాధ్యత ఉంది మా అందరిపైనా ఇప్పుడు గురుతర బాధ్యత ఉందని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. విభజన చట్టం లో హామీలు ఇంకా పరిపూర్ణంగా అమలు కాలేదు .విభజన చట్టం అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆంధప్రదేశ్‌లో రూ.40 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం ఆల్‌టైమ్ రికార్డు. వ్యవసాయ రంగానికి రూ.19 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. విద్యా, వైద్య రంగాల మీద పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా సీఎం వైయస్ జగన్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాల హృదయంతో ఏపీని ఆదుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఇది జీవితంలో మరిచిపోలేని రోజు: మోపిదేవి ఇది మా జీవితంలో ఇది మరిచిపోలేని రోజుని ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంతోషం వ్యక్తం చేశారు.. ఇద్దరు బీసీలకు రాజ్యసభ చోటు కల్పించడం అరుదైన విషయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టం మేరకు రైతులకు రెండున్నర రెట్లు ధర చెల్లిస్తున్నాం. సేకరించిన భూమిని ఇల్లు లేని పేదలకు ఇస్తున్నాం. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. ఇళ్ల స్థలాల పంపిణీపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో పస లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసి చూపిస్తారా?’అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమ, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు తీసుకు వెళ్తున్నారుని రాజ్యసభ ఎంపీ మోపిదేవీ వెంకటరమణ అన్నారు. ఏడాది కాలంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో సీఎం వైఎస్ జగన్ నాలుగో స్థానంలోకి వెళ్లడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే బలమైన పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిందని మోపిదేవి తెలిపారు.