అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా.. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలను కాపాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వైయస్ఆర్ సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అన్నారు. భారతదేశంలో అత్యున్నతమైన ఎగువ సభ రాజ్యసభకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు సభ్యులు ఎంపికైతే, వారిలో ఇద్దరు బీసీలను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు బీద మస్తాన్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అనంతరం ఎంపీ బీద మస్తాన్‌రావు మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు రాజకీయంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించడం ద్వారా, ఆ వర్గాలు అభివృద్ధి చెందుతాయని నమ్మి మాకు అవకాశం కల్పించిన సీఎం వైయస్ జగన్.. బీసీల హృదయాల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బేషరతుగా వచ్చానని, రాజ్యసభ సభ్యత్వం వస్తుందని తాను ఊహించలేదన్నారు. తన చిన్ననాటి మిత్రుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రూ. 1.46 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదలకు అందించడం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కే సాధ్యమైందన్నారు. సంక్షేమ పథకాలకు లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే.. ఇదేదో నేరం అన్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, పేదవాడికి ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంటే గర్వంగా చెప్పుకోవాలి గానీ, నిందలు వేయడం సరికాదన్నారు.